వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో డికె అరుణ ఘాటు వ్యాఖ్య, ఏడ్చిన పద్మా: రోజా ఇష్యూను ప్రస్తావించిన హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ కూడా హీటెక్కింది. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ వ్యాఖ్యల పైన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కంటతడి పెట్టారు.

సంస్కారం లేని వాళ్లు సభను నడిపిస్తున్నారని డికె అరుణ వ్యాఖ్యానించారు. దీంతో పద్మా దేవేందర్ రెడ్డి కంటతడి పెట్టారు. డికె అరుణ వ్యాఖ్యల పైన సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి స్పందించాలని డిప్యూటీ స్పీకర్ డిమాండ్ చేశారు. ఇదే విషయంపైన మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.

డిప్యూటీ స్పీకర్ పైన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెంటనే క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. లేదంటే స్పీకర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. సభలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. డికె అరుణ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. మహిళ పట్ల మరో మహిళ ఇలాగే మాట్లాడుతారా అని ప్రశ్నించారు.

DK Aruna comments, Padma Devender Reddy weeps, Harish Rao Reference Roja

దీనిపై జానా రెడ్డి మాట్లాడుతూ... సభ హుందాగా ఉండాలని, ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.

దీనిపై హరీష్ రావు మాట్లాడుతూ... మేం ఏం తప్పు చేశామో చెప్పాలని, చెబితే దానిని విత్ డ్రా చేసుకుంటామన్నారు. మేం తప్పు చేస్తే క్షమాపణలు చెబుతామని, మీరు కూడా తప్పకుండా క్షమాపణ చెప్పాలన్నారు. మేం ఏం తప్పు చేశామో చెప్పాలన్నారు.

పక్క సభలో ఆఫ్ ది రికార్డుగా ఓ ఎమ్మెల్యే మాట్లాడితే సంవత్సరం పాటు సస్పెండ్ చేశారని ఏపీ అసెంబ్లీలోని రోజా అంశాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రజలు చూస్తున్నారని చెప్పారు.

దీనిపై జానా రెడ్డి మాట్లాడుతూ... మేం గతంలో అన్ పార్లమెంటరీ మాట్లాడితే తమ పార్టీ ఎమ్మెల్యేలు సంపత్‌తో, డికె అరుణతో క్షమాపణలు చెప్పించానని గుర్తు చేశారు. అప్పుడప్పుడు అలాంటి ఆవేశాలు కట్టడి చేసేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నామని, దీనిని అందరూ గమనించాలన్నారు. ఎవరికి వారు సంస్కారహితంగా ఉండాలన్నారు.

దీనిపై హరీష్ రావు మాట్లాడుతూ.. ఇది వ్యక్తుల మధ్య ఘర్షణ కాదని, ఆ చైర్‌కు గౌరవం ఇవ్వాలన్నారు. మమ్మల్ని నాలుగు మాటలు అన్నా మేం పడేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ ఆ చైర్‌కు గౌరవం ఇవ్వాలన్నారు. ఒక్కోసారి సభ్యులు ఆవేశంగా మాట్లాడుతారని, గతంలోను క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయన్నారు.

DK Aruna comments, Padma Devender Reddy weeps, Harish Rao Reference Roja

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ... మమ్మల్ని ఏమైనా అన్నా వదిలేస్తామని, కానీ చైర్‌ను అన్నప్పుడు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. చైర్ పైన కూర్చున్న వారు సభను హుందాగా నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

జానా రెడ్డి మాట్లాడుతూ... చైర్ పైన ప్రతిపక్షానికి గౌరవం ఉందన్నారు. అప్పుడప్పుడు సభ్యులు ఆవేశంతో ఏమైనా అంటే తాము సర్దుబాటు చేస్తున్న విషయాన్ని గమనించాలన్నారు. చైర్ పర్సన్ పైన అనాలనే ఉద్దేశ్యం ఏ సభ్యుడికి లేదన్నారు. నడుస్తున్న థీమ్ పైనే మాట్లాడారన్నారు.

సభ హుందాగా నడిపేందుకు తాము సహకరిస్తామని చెప్పారు. ఈ విషయంలో వాదోపవాదాలకు పోకుండా ఎవరి ఆత్మవిమర్శకు వారిని వదిలేసి సభను నడిపించాలని జానా రెడ్డి విజ్ఞప్తి చేశారు.

దీనిపై టిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే ఒకరు మాట్లాడుతూ.. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే సభ్యురాలిని (డికె అరుణ)ను సస్పెండ్ చేయాలన్నారు.

హరీష్ రావు మాట్లాడుతూ... తాము పదేపదే క్షమాపణ కోసం అడుగుతున్నామని, ఆమె చేసిన తప్పిదానికి సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. క్షమాపణ చెప్పడం లేదు కాబట్టి డికె అరుణను సస్పెండ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

జానా రెడ్డి మాట్లాడుతూ... నేను డికె అరుణను అడిగి తెలుసుకుంటానని, చైర్ పర్సన్‌ను అనలేదంటే ఇంతటితో ముగించాలన్నారు. సస్పెండ్ సరికాదన్నారు.

పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ... ఎవరిని ఉద్దేశించి అన్నా, సభలో అయితే అన్నారు కదా అన్నారు. అలాంటప్పుడు చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

హరీష్ రావు మాట్లాడుతూ... ఎవరిని ఉద్దేశించి అన్నారో చెప్పాలన్నారు. సభలో అలాంటి మాటలు సరికాదన్నారు. మే ఇన్నిసార్లు అవకాశం ఇస్తున్నామని, సస్పెండ్ చేయడం ఇష్టం లేదని, మొండితనంతో క్షమాపణ చెప్పడం లేదని, అలాంటప్పుడు సస్పెండ్ చేయక తప్పదన్నారు.

మీకు ఇష్టం వచ్చినంత సేపు మైకు ఇస్తున్నామని, అలాంటప్పుడు కూడా ఇష్టారీతిన మాట్లాడుతామంటే ఎలా అన్నారు. రాష్ట్ర ప్రజలు సభను చూస్తున్నారని, ప్రజలు తేలుస్తారన్నారు. ఇలాంటి తీరును ప్రజలు నచ్చరన్నారు. దయచేసి విత్ డ్రా చేసుకోవాలని ఫైనల్‌గా అప్పీల్ చేస్తున్నానని చెప్పారు.

డికె అరుణ మాట్లాడుతూ... నేను సంస్కారం లేకుండా మాట్లాడనని చెప్పిన మాటలు అవాస్తవమన్నారు. నాకు చెప్పడం విడ్డూరమన్నారు. వారు ఏమన్నారో చెప్పాలన్నారు. ఓసారి రికార్డు చూడాలన్నారు. నేను ఆ పదజాలం ఉపయోగించలేదన్నారు.

హరీష్ రావు.. డికె అరుణను సస్పెండ్ చేసేందుకు ప్రయత్నించగా... డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కల్పించుకొని మంత్రిగారు... అన్న వ్యాఖ్యలను ఆమెకే వదిలేద్దామని, ఇక సభను కొనసాగిద్దామని చెప్పారు.

English summary
DK Aruna comments, Padma Devender Reddy weeps, Harish Rao Reference Roja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X