కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తంపులు: టీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ వ్యూహం ఇలా

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నాయకత్వం ఒకవైపు ఆకర్ష్.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తెర వెనుక మంటలు స్రుష్టించడానికి పూనుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నదన్న వార్తలో మీడియాలో వండి వార్చే వ్యూహాలు అమలు చేస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా విభేదాలు స్రుష్టించే మార్గాన్ని సుగమం చేస్తుందన్న భావన గులాబీ పార్టీలో ఎక్కువగా ఉన్నది. దీనికి సోమవారం రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు.. 'తుమ్మిళ్ల' ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన కార్యక్రమం వేదిక కావడం గమనార్హం.

ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత జోగులాంబ - గద్వాల జిల్లా పరిధిలోని ఆలంపూర్ అసెంబ్లీ స్థానం పరిధిలోకి వస్తుంది. 'తుమ్మిళ్ల' ఎత్తిపోతల పథకం నిర్మాణ శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి హరీశ్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ సంపత్ కుమార్ స్వాగతం పలికారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న 'తుమ్మిళ్ల' ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఇప్పటికైనా పునాది రాళ్లేసినందుకు ముకుళిత చేతులతో మంత్రి హరీశ్ రావుకు సంపత్ కుమార్ నమస్కరించడంతోనే అసలు చిక్కంతా వచ్చి పడింది.

మంత్రికి ఎమ్మెల్యే నమస్కారంతోనే చిక్కు

మంత్రికి ఎమ్మెల్యే నమస్కారంతోనే చిక్కు

‘మంత్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యే శతకోటి వందనాలు' అనే కాప్షన్‌తో మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి మంగళవారం ప్రచురితమైన వార్తలతో అంతా గందరగోళం నెలకొంది. మంత్రి హరీశ్‌రావును ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రశంసించారు. అభినందనలు తెలిపారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పట్ల అమితాసక్తి చూపుతున్నారని మంత్రి హరీశ్ రావును పొగడ్తల్లో ముంచెత్తారు. దీంతో మీడియాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన వార్తలతో కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకించి ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, డీకే అరుణ మధ్య విభేదాలను స్రుష్టించడానికి పూనుకున్నారు.

టీఆర్ఎస్ పార్టీలో సంపత్ చేరిక ఖాయమన్న ప్రచారం

టీఆర్ఎస్ పార్టీలో సంపత్ చేరిక ఖాయమన్న ప్రచారం

మంత్రి హరీశ్ రావుకు ఎమ్మెల్యే సంపత్ కుమార్ దండాలు పెట్టేయడంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే (గద్వాల) డీకే అరుణకు అంది వచ్చిన అస్త్రంగా మారింది. వారిద్దరి మధ్య సత్సంబంధాలు లేవని వార్తలు వినవస్తున్నాయి. దీంతో సంపత్ కుమార్‌కు వ్యతిరేకంగా వదంతులను ప్రచారంలో పెట్టారు డీకే అరుణ గ్రూపు కాంగ్రెస్ పార్టీ నాయకులు. త్వరలో సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడం అన్న ప్రచారం హోరెత్తించారు. గమ్మత్తేమిటంటే 2014 ఎన్నికల్లో టిక్కెట్ ఖరారు కావడానికి.. సంపత్ కుమార్ గెలవడానికి డీకే అరుణ ఎంతో కీలకంగా వ్యవహరించడమే.

ఫొటో ఆధారంగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ

ఫొటో ఆధారంగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ

మీడియాలో వచ్చిన వార్తలతో సంపత్ కుమార్ ఆందోళనకు గురయ్యారు. ఆగమేఘాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వదంతులు, విమర్శలపై ఖండించాల్సి వచ్చింది. ఒక ఫొటోను ఆధారంగా చేసుకుని టీఆర్ఎస్ నాయకులు ప్రజలను, తమ పార్టీ శ్రేణులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరిన ఎమ్మెల్యే సంపత్

ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరిన ఎమ్మెల్యే సంపత్

‘నా నియోజకవర్గంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు వచ్చిన మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలియజేయడం నా విద్యుక్త ధర్మం. కానీ టీఆర్ఎస్ నాయకులు నేను మంత్రి నమస్కరించిన ఫొటో ఆధారంగా తప్పుడు ప్రచారం చేపట్టారు. మంత్రి నా గురించి గానీ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానం గురించి గానీ ఒక్కమాట కూడా చెప్పలేదు' అని తెలిపారు. ఆలంపూర్ ప్రజల సమస్యలు పరిష్కరించాలని మంత్రి హరీశ్ రావును కోరారు. మంత్రి హరీశ్ రావు వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అబద్దాలు ప్రచారం చేశారని ఆరోపించారు.

డీకే అరుణ వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని వెల్లడించిన సంపత్

డీకే అరుణ వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని వెల్లడించిన సంపత్

‘మంత్రులు హరీశ్ రావు, కే తారక రామారావులకు తెలుసు. నేను వారి పార్టీలో చేరబోవడం లేదని వారిద్దరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా రాజకీయ ప్రత్యర్థులు నాకు వ్యతిరేకంగా వదంతులు ప్రచారం చేస్తున్నారు. అందుకోసం వివిధ రకాల వ్యూహాలు అమలు చేస్తున్నారు' అని ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణకు, తనకు ఎటువంటి విభేదాల్లేవన్నారు. డీకే అరుణ వల్లే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Telangana Rashtra Samithi’s attempt to create troubles within the Congress party in the state by planting a story in the media indicating that one of its MLAs is joining the ruling party has backfired.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి