• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పీరియడ్‌ నవలానిధి దాశరథి

By Staff
|

ఒక ప్రక్కన అధికార బధిరాంధుల నిరంకుశ పదఘట్టణలు, వేరొక వంకన దుర్బల పీడిత జనుల నిస్సహాయ ఆక్రందనలు ఒక వైభవోజ్వల మహాయుగంలో మరో కారు చీకటి అధ్యాయం. మంచి తనాన్ని దోచుకునే దుష్కర ముష్కరత్వం. అంతటా పర్చుకున్న ఎడారితనం. ఒక చోటనే పేరుకున్న అపార సంపద. ఇదీ కొన్ని దశాబ్దాల క్రితం కోటి రత్నాల తెలంగాణ. భుగభుగలను వేలార్చే అగ్ని పర్వతం. నిరంకుశ నిజామునకెదురు నిల్చిన శిలీముఖం. వీర తెలంగాణా వీణ వినిపించిన ఒకే రాగపు రెండు స్వరాలు దాశరథి సోదరులు. వారికి అన్యాయమంటే పడదు. ఒకరు కవిత్వాన్నాశ్రయించి, తెలంగాణా వైతాళికుల్లో ఒకరై, జనశక్తిని సమీకరించి, పోరాటపు రంగంలో ముందు నిల్చి కారాగార క్లేశం అనుభవించి, నిజామును గద్దె దింపి, ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన కవి అయితే, వేరొకరు కవితను ఆవలకు నెట్టి, జన సమీకరణకు విషయ విపులీకరణకు గద్యమే శరణ్యమని నవలనాశ్రయించి, పీరియడ్‌ నవలా రచనలో పలుకుబడి సాధించి, జనతా హృదయాస్థాన రచయిత అయ్యారు. కవి కృష్ణమాచార్య, నవలా రచయిత రంగాచార్య.

''ప్రభుత్వాల్ని పడగొట్టడానికి కవులు తుపాకిధారులు కావాలని నేననుకోను. తుపాకీ గొట్టం ద్వారానే విప్లవం పల్లవిస్తుందనుకోడం భ్రమ. ఈ కాలానికి భావ వ్యక్తీకరణకు కవిత్వం సాధకం కాదు. మీ సందేశాన్ని నవల కన్నా బలీయంగా చెప్పగల మరో ప్రక్రియ మరొకటేదీ లేదు. అందాల హరివిల్లుల్నీ, రంగుటద్దాల పడక గదుల్నీ చిత్రిస్తూ సమకాలీన జీవితం నుంచి సాహిత్యం పారిపోవడం సుతరామూ నే హర్షించలేను.

రచయితలు తమ బాధ్యతల్ని మర్చిపోతే ఎట్లా?

సమ సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. మనిషిని మనిషి ప్రేమించి, గౌరవించి నిష్కల్మషంగా బ్రతికే సుందర కాలం కోసం నేను కలలు కంటున్నాను'' రంగాచార్య పలుకులివి. పొట్టిగా, బొద్దుగా, ముద్దుగా, చామనచాయగా ఇంగ్లీషూ, ఉర్దూ, తెలంగాణా తెలుగూ కలిపి చకచక మాట్లాడేసే దాశరథి రంగాచార్యకు తమిళం కూడా బాగానే వచ్చు. వైష్ణవ కుటుంబంలో పుట్టి, చిన్నతనమంతా ఆ సంప్రదాయాల నీడల్లో పెరిగి కొంచెం వయసు రాగానే వాటికి గుడ్‌బై కొట్టి విప్లవ పంథా పట్టాడు. పుట్టిన వరంగల్‌ జిల్లా తీవ్రవాదులకు పుట్టినిల్లు, తీవ్రవాదులకు మెట్టినిల్లు. 1930లో చిన్న గూడూరులో పుట్టిన రంగాచార్య, పదేహేనేళ్లు కూడా రాకుండానే అరెస్టయ్యాడు, నిజాము నవాబుకు వ్యతిరేకంగా వీర పోరాటంలో సురవరం ప్రభృతుల ప్రభావంలోకి వచ్చి, ఆ తర్వాత స్వాతంత్ర్య సంపాదనానంతరం కొంత కాలం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పని చేశాడు. న్యాయశాస్త్రం చదువుకొని, రాజధాని కార్పోరేషన్‌ ఉద్యోగంలో స్థిరపడ్డాడు.

రంగాచార్యకు ఉన్నవ అన్నా, రచయిత శారద అన్నా ఎంతో అభిమానం. ఉన్నవలో ఉన్న సంస్కరణ తత్వమూ, శారద కనబరిచిన యధార్థ వాదమూ ఎంతగానో అతడిని ప్రభావితుణ్ని చేశాయి. వారిద్దరికి తోడు డికెన్స్‌, గోర్కీ, టాల్‌స్టాయ్‌, ప్రేమ్‌చంద్‌లను కూడా రంగాచార్య బాగా చదువుకున్నాడు. డికెన్స్‌లో ఉన్న కథాకథనం, గోర్కీలో ఉన్న చారిత్రక దృష్టి, టాల్‌స్టాయ్‌లో కనిపించే మానవతావాదమూ, ప్రేమ్‌చంద్‌లో కనిపించే యథార్థత్వమూ అతనికి ఉద్దీపకాలుగా భాసించాయి. వీటన్నింటినీ రంగరించుకుని తెలంగాణ పోరాట రచనకు ఆయత్తమయ్యాడు.

వందలు వేలు మూగజీవులను ఆ కాలంలో అధికార బలిపీఠం మీద ఆత్మార్పణం చేశారు. వారివారి బలిదానం అతని కథా వస్తువైంది. వట్టికోట ఆళ్వారుస్వామి అంతకు ముందే ఇటువంటి కథా వస్తువులకు శ్రీకారం చుట్టాడు. కానీ ఆయన అకాల మరణంతో ఆ రకం రచనలకు ఆటంకం ఏర్పడింది. రంగాచార్య, ఆళ్వారుస్వామి వదలిపెట్టిన చోటు నుండీ తన యాత్ర ప్రారంభించాడు. వట్టికోటకు తగిన వారసుడుగా నిలబడ్డాడు.

''చిల్లర దేవుళ్లు'' దాశరథికి తొలి రచన. మేలు రచన కూడా. 1938కి ముందు తెలంగాణాలో ఉన్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ శక్తులకు అది సాహిత్య స్వరూపం. ''మోదుగు పూలు'' 1942 నుండి భారత ప్రభుత్వం, వల్లబ్‌భాయ్‌ పటేల్‌ ధర్మమా అని, పోలీసు యాక్షన్‌ జరిపి తెలంగాణాను విముక్తి చేసే వరకు ఉన్న పరిస్థితిని వర్ణిస్తుంది. ''జనపదం'' 1967 నాటి ఎన్నికల వరకూ జరిగిన తంతును వివరిస్తుంది. ఈ నవలలు మాయజలతారు, మానవత, శరతల్పం వంటి నవలలు ఆసక్తిని పెంచుతాయి. ఉత్కంఠ ఆరోగ్యకరంగా ఎట్లా పోషింపబడాలో తెలియజెపుతాయి. పాత్రలు కన్నీటి జడులలో తడిసే పారావతాలు, సంఘటనలు జీవితమంత విస్తారాలు, సందేశాలూ, తత్వాలూ తెరమరుగు నుండే వినిపిస్తాయి. సమిష్టి క్షేమం ఎంత ముఖ్యమో వ్యక్తి శ్రేయస్సు కూడా అంత ముఖ్యమన్న విషయం ప్రతి నవలా ప్రస్ఫుటీకరిస్తుంది. సంభాషణల్లో మాండలిక ధోరణులూ, ధ్వని మర్యాదలూ కలగాపులగంగా కలిసిపోతాయి.

రంగాచార్య నవలలు కొన్ని సినిమాలుగా వచ్చి సంచలనం కల్గించాయి. 1971లోనే సాహిత్య అకాడమీ బహుమతిని పొంది రంగాచార్య సాహితీ వ్యక్తిగా సంచలనం కల్గించాడు. భీమసేన్‌ నిర్మల్‌ వంటి ప్రముఖులు అతణ్ని హిందీలోకి అనువదించుకుని తమ నవలా ప్రక్రియను సుసంపన్నం చేసుకున్నారు. తిరుగుబాటుదారుడు, ప్రయోగశీలి, చరిత్రకారుడు. దోషరహితుడైన కళాకారుడు దాశరథి రంగాచార్య.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more