వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు వచన కవిత్వానిది నా ఒరవడే: గుంటూరు శేషేంద్రశర్మ

By Staff
|
Google Oneindia TeluguNews

భీమవరంలో నా సన్మానసభ జరుగుతోంది. సభకు అధ్యక్షత వహించిన సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌ మాట్లాడిన తర్వాత క్రిక్కిరిసిన ప్రేక్షకుల్లో నుంచి ఒక పాతికేళ్ల యువతి హఠాత్తుగా లేచి పరుగెత్తుకుంటూ వేదిక మీదికి వచ్చింది. ప్రిన్సిపాల్‌ ముందటి మైక్‌ లాక్కొని తన పేరు చెప్పి- ''నేను ఇక్కడికి 25 మైళ్ల దూరంలో వున్న వూళ్లో హిందీ టీచర్ని. 'వేళ్లు కాళ్లయి నడిచే చెట్టు మనిషి/ చెట్టుగా వుంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది/ మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను' అన్నటువంటి ఈ కవిని ఎప్పుడు చూస్తానా అని పదేళ్ల నుంచి కాచుకుని కూర్చున్నాను. ఇక్కడికి వస్తాడని తెలిశాక పాఠశాలకు సెలవు కూడా పెట్టకుండా ఇక్కడికి వచ్చా'' అని చెప్పి గంటసేపు నా కవిత్వం మీద ప్రసంగించింది.

ఇలా 1960 ప్రాంతం నుంచి నాకు అనేక ఉత్తరాలు వస్తుండేవి. తమ కవితలను జతపరిచి అభిప్రాయాలు అడిగేవారు. వాటిని నేను ఇలాంటి కవిత్వమే రాసేవాళ్లకు పంపి వాళ్ల అభిప్రాయాలు అడిగేవాడ్ని. ఈ రకంగా ఉత్తరాలు ఆంధ్రదేశమంతా పరిభ్రమించేవి. ఈ క్రమంలో ఈ రకం కవిత్వం రాసేవాళ్లంతా ఒక జాతిగా ఏర్పడ్డారు. వాళ్లే ఒకసారి 'కవిసేన' ఏర్పాటు చేద్దామన్నారు. ''ఇదొక ఉద్యమం, ఉద్యమం రుతువులాంటిది, కాలానుగుణంగా వస్తుంది, కాలానుగుణంగా పోతుంది, రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు'' అని చెప్పాను. నేను వద్దన్నాను. కానీ, మొండిపట్టు పట్టి 1976లో నాగార్జునసాగర్‌ విజయవిహార్‌లో సభ పెట్టి నన్ను ఆహ్వానించారు. వెళ్లా. చివరికి ఆ సభ 'కవిసేన' ఆవిర్భావంతో ముగిసింది. తర్వాత దానికి నన్ను మానిఫెస్టో రాయమన్నారు. ఈ మానిఫెస్టో 30 పేజీల్లో రాద్దామని మొదలుపెట్టా, 350 పేజీల ఆధునిక కావ్యశాస్త్రమైంది. ఈ పుస్తకం చాలా ప్రసిద్ధికెక్కింది. సుప్రసిద్ధ విమర్శకులు ఆధునిక విమర్శను ఒక మలుపు తిప్పిన ల్యాండ్‌మార్క్‌ గ్రంథమన్నారు దీన్ని. దీని గురించి ఇంకా చాలా చెప్పవచ్చు. అలా చెప్పుకుంటూ పోతే ఒక వాల్యూమ్‌ అవుతుంది.

'కవిసేన' ద్వారా మీరు ఏమైనా మార్పు తెచ్చారా?
'కవిసేన' ఉద్యమం ప్రారంభం కాకపూర్వం తెలుగుకవిత్వం వచన కవిత్వమనే పేరుతో వచన మైనస్‌ కవిత్వంగా వస్తూ వచ్చింది. ఈ ఉద్యమం ప్రారంభమయ్యాక ప్రధాన కవిత్వ లక్షణమైన ఆలంకారికత లేక కావ్యాత్మకత కలిగిన కవిత్వాన్ని యువతరం రాయడం ప్రారంభించింది. ఈ లక్షణం చేత శ్రోత కానీ, పాఠకుడు కానీ కవిత్వం చేత ఆకర్షితుడవుతాడు. కవిసమ్మేళనాలకు శ్రోతలు అసంఖ్యాకంగా వచ్చేవాళ్లు. ఈ మార్పును అన్యులు అసూయ చేత అంగీకరించకపోయినా ఇది ఒక చారిత్రకసత్యం.

మీ ఒరవడి ఎంత వరకు కొనసాగింది?
ఇప్పుడు వస్తున్నదంతా అదే రకమైన కవిత్వం. కవి అన్నవాడు అదే యాంగిల్‌లో రాయక, ఇంకెట్లా రాస్తాడు? దీని వల్లనే అన్యభాషల్లో కవిత్వం కన్నా తెలుగు కవిత్వం అత్యుత్తమంగా వుంటోంది.

ఆధునిక కవిత్వంలో శ్రీశ్రీ ఒరవడి కొనసాగుతోందని అంటారు, కదా! ఆయనను యుగకవి అంటారు....
శ్రీశ్రీకి పూర్వం ప్రేమ, వగైరాలని వస్తువుగా తీసుకుని కావ్యం రాసేవారు. కానీ, ఆ తర్వాత ఈ దీర్ఘకాలిక సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేసి విప్లవాన్ని కావ్యవస్తువుగా ప్రవేశపెట్టాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు తెలుగు కవిత్వంలో విప్లవ కవిత్వమే ప్రధానంగా వస్తోంది. ఈ చారిత్రక సంఘటన కర్త అయిన శ్రీశ్రీ మహాపురుషుడు అనక తప్పదు. అయితే, శ్రీశ్రీ కవిత్వం 16,17 శతాబ్దాలలో వచ్చిన మనుచరిత్ర, వసుచరిత్ర, ఇత్యాది ప్రబంధాల భాషలో రాయబడింది. అది సాధారణ ప్రజల వద్దకు వెళ్లిందని, వెళ్తుందని అనడం కారణరహితంగా వుంటుంది. ఆ భాషను సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేరు.

మీ కవిత్వంలో మార్మికత ఎక్కువ, అందువల్ల చాలామందికి అందకుండా పోతుందనే విమర్శ ఉంది, మీరేమంటారు?
నా కవిత్వంలో మార్మికత అనేది ఏ అర్థంలోనూ లేదు. నా కవిత్వంలో వున్న చమత్కారం శ్రోతకు అందాలని కవిత్వరచన చేశాను. అంటే, నేను వాడిన భాష వీధుల్లో, బస్‌స్టాండులలో, కాఫీ హోటళ్లలో, రైల్వే స్టేషన్లలో సంచరించే జనసమూహం మాట్లాడే దైనందిన వ్యవహార భాష. చమత్కారం వుంటే అది శ్రోతలకు లేదా పాఠకులకు అందుతుంది, లేకుంటే అందదు.

మార్మికత అంటే, కేవలం భాషకు సంబంధించిన విషయమే కాదనుంటా.....
మిస్టిసిజం అనేది చాలా తాత్విక చింతనకు సంబంధించింది. భావాలు గుంపులుగుంపులుగా మీదికి దండెత్తితే అప్పుడు శ్రోత అయోమయ అంధకారంలో చిక్కుకుంటాడు. అలా నేను ఎక్కడా రాయలేదనుకుంటా. స్పానిష్‌కవి గొవుగోరా- స్పానిష్‌ సముద్రాన్ని 'అండ్యులేటింగ్‌ ఎమరాల్డ్‌' అన్నాడు. అంటే, ఇదేమిటి సముద్రాన్ని ఇలా అంటాడన్నారు లేదా అర్థం కాలేదన్నారు. ఇలా అనేవాళ్లు అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో వున్నారని మనకు గ్రంధస్తమైన సాక్ష్యం వుంది.

కావ్యశాస్త్రకర్త భామహుడు (బహుశా క్రీ.పూ. రెండవ శతాబ్దంవాడు) ఆయన తన కావ్యాలంకారంలో ఇలా అన్నాడు -
'అఖండ మండలః క్వేందుః క్వ కాంతానన ద్యుతిః' చంద్రమండల కాంతి ఎక్కడ, ఈ కాంత ముఖకాంతి ఎంత? ఒకడు ఈ కవి విపరీత వ్యాఖ్యలు చూడమన్నాడు. అంటే ఈ వ్యాఖ్య చేసినవాడికి కావ్యస్పృహ లేదన్నమాట. కవిత్వం ఎప్పుడూ అలంకారం, బింబం, ప్రతీకలు, మెటఫర్‌, ఇత్యాది అమూల్య ద్రవ్యాలతో చేత చేయబడిన అతిశక్తిశాలి శబ్ద సంయోజన. అట్టి కవిత్వానికి వున్న ఆకర్షకశక్తి అయస్కాంతానికి కూడా వుండదు. ఈ శక్తి చేతనే కవిత్వం జాంతవదశలో వున్న మనిషిని హృదయం నుంచి మార్చి ఈనాడు చూస్తున్న సభ్యమానవునిగా రూపొందించింది. కవులే సంస్కృతులను, నాగరికతలను యుగయుగాల నుంచి మానవ సమాజంలో సృష్టించారు. కవులే లేకపోతే మానవ సమాజానికి, జంతువును జంతువు చంపుకొని తినే అరణ్యానికి ఏ తేడా వుండేది కాదు. కనుక కవిస్థానం సమాజంలో సర్వోపరి అవుతుంది.

వర్తమాన దళిత, స్త్రీవాద కవిత్వాల గురించి మీ అభిప్రాయం ఏమిటి?
కవి మానవ దుఃఖాన్ని సహించలేని ఏకైక విశిష్ట వ్యక్తి . క్రౌంచపక్షిని కిరాతకుడు వధించినప్పుడు ఆదికవికి కలిగిన శోకంలోంచి రామాయణ శ్లోకం పుట్టింది. అంటే, శోకంలోంచి శ్లోకం పుట్టింది. దళిత, స్త్రీవాద ఇత్యాది కవిత్వాలు ఒక విధంగా చూస్తే సమంజసమే అయినా అవి ఒక మహాసత్యాన్ని గుర్తించని చర్యలుగా విదితమవుతాయి. ఆ మహాసత్యం విశ్వమంతటా దళితులున్నారు. కోట్లాది ఈ వైశ్వికదళితులందరూ కలిసి ఉద్యమించి వారి శోషణకు కారకులైన అల్పసంఖ్యాక శోషకవర్గాన్ని వధించినప్పుడే మానవ సమాజంలో కెరటాలు, కెరటాలుగా ఉప్పొంగి పడుతున్న దుఃఖం తొలగిపోతుంది.

కనుక మానవ సమాజంలో వున్న దళిత ప్రవృత్తి చేత కలుగుతున్న దుఃఖాన్ని పారద్రోలడానికి లోకంలో వున్న దళితులందరూ ఏకం కావాలి. శోషితులు, శోషకులు అనే వర్గచైతన్యం ప్రగాఢంగా వ్యాపించాలి. అప్పుడే లోకానికి మోక్షం. అలా కాకుండా కులాన్ని ఆధారం చేసుకుని, స్త్రీ లింగాన్ని ఆధారం చేసుకుని భిన్న భిన్న అల్పసంఖ్యాకవర్గాలు 'మేం దళితులం, మేం దళితులం' అంటే, వేర్వేరు లేబిళ్లు తగిలించుకుని కేకలు వేస్తే వాళ్ల ఉద్యమాలు నిష్కర్షగా ఫలించవు. అంతేకాక, వైశ్వికంగా వృద్ధి పొంది మానవకళ్యాణాన్ని తీసుకురాగలిగిన వైశ్విక ఉద్యమాన్ని ముక్కులుముక్కలుగా చీల్చి నిర్వీర్యం చేసిన వాళ్లవుతారు. ఈ ప్రత్యేకమైన లేబిళ్లు తగిలించుకునే రచయితలకు ఈ అల్ప ఉద్యమాలు ఉపయోగపడవచ్చునేమో గానీ కమ్యూనిజం ప్రతిపాదించిన విప్లవానికి ఇవి బలహీనకరమైన శక్తులు.

ప్రపంచంలోని గొప్పకవుల్లో ఒకరు గుంటూరు శేషేంద్రశర్మ భార్య ఇందిరాదేవి ధనరాజ్‌గిరి, ఆయన రాసిన 'ఋతుఘోష' కావ్యాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఒక వైపు శేషేంద్ర తెలుగు కవిత్వం, మరో వైపు ఆమె ఆంగ్లానువాదం పుస్తకంలో వుంటాయి. కవిగా శేషేంద్రతో ఇంటర్వ్యూ సాగుతున్నంత సేపు ఆమె దాదాపుగా పక్కనే కూర్చున్నారు. కవిగా శేషేంద్ర గురించి అడిగినప్పుడు-'ప్రపంచంలోని గొప్పకవుల్లో ఒకరు, ఆయనను తూచడానికి కొలబద్దలు లేవు' అని అన్నారు. స్త్రీవాద కవిత్వం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆమెనే జోక్యం చేసుకుని-'పురుషుడి మీద ద్వేషం పెంచుకుంటే, ఏ పురుషుడు కూడా స్త్రీని ప్రేమించలేడు' అని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X