వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరుణ ఓ జీవలక్షణం: పెద్దిభొట్ల

By Staff
|
Google Oneindia TeluguNews

''నేను భావతీవ్రతతో కదిలిపోయినప్పుడు మాత్రమే కథ రాస్తాను. అయితే నా ఆవేదననో, ఆక్రోశాన్నో పాఠకుడికి పంపిణీ చెయ్యడమే నా కథల పరమ ప్రయోజనంగా మాత్రం నేనెన్నడూ పరిగణించలేదు. నా కథ చదివే వాళ్ల మనస్సుల్లో కించిత్తు ఎంపథీ-అనుకంప రేకెత్తించేందుకు నేను కాన్షియస్‌గానే ప్రయత్నిస్తాను. అయితే అది శిల్ప రహస్యమనో, టెక్నికల్‌ గిమ్మిక్‌ అనో నేనెప్పుడూ భావించలేదు. నాకు సంబంధించినంత వరకు ఇది సాహిత్య ప్రయోజనం-సంస్కార సంబంధమైన లక్ష్యం''- పెెద్దిభొట్ల సుబ్బరామయ్య తన కథల గురించి ఇచ్చిన ఈ వివరణలో డిఫెన్సివ్‌-అపాలజెటిక్‌ టోన్‌ అణుమాత్రం కూడా ధ్వనించకపోవడం గమనార్హం.

''కొందరు విమర్శకులు నా కథల్ని విషాదాంతాలుగా లెక్క గడుతూ సూత్రీకరణలు చేశారు. అవన్నీ శుద్ధ తప్పు. ఆ మాటకొస్తే నా కథల్లో అత్యధికం ఆద్యంతం విషాదభరితాలే. చదివేవాళ్ల కంట తడి పెట్టించడమో గుండెల్ని మెలి తిప్పడమో వాటి లక్ష్యం కానేకాదు. అసలు అలాంటి లక్ష్యాలు తమంతట తాము సాహిత్య ప్రయోజనాలు కాగలవని కూడా నేననుకోవడం లే''దంటారాయన. ''ఒక్క విషయం మాత్రం చెప్పగలను- చదువరుల హృదయాలలో కాస్తంత కరుణ, ఆర్ద్రత కలిగించడం అంత అలవోకగా సాధ్యమయ్యే లక్ష్యమేం కాదు. ఏ మాత్రం నిష్పత్తి చెడినా మొత్తం రసాభాసగా మారే ప్రమాదం ఉంది. అంచేత ఈ తరహా కథలు రాయడానికి పూనుకోవడం సాహసమనే చెప్పా''లంటారు సుబ్బరామయ్య.

పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి తొలికథ అచ్చయ్యే నాటికి నాకు నిండా ఏడాది కూడా నిండలేదు. అందుకే ఆయన్ను ఇంటర్వ్యూ చెయ్యాలనుకుని చాలా కాలమే అయినా ఇంతకాలం సాహసం చాలింది కాదు. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల ప్రచారహోరులో నిండా మునిగి వున్న విజయవాడ సందర్శించిన సందర్భంగా ధైర్యం చిక్కబట్టుకుని సుబ్బరామయ్య మేష్టారితో కాసేపు కబుర్లు చెప్పగలిగాను. నిజానికి నాకాయన రెండు దశాబ్దాలుగా తెలుసు. పాతికేళ్లుగా ఆయన రచనలు చదువుతూనే వున్నాను. అయినా చెప్పుకోదగ్గ చనువుగానీ, చొరవ గానీ చూపించలేకపోయాను. కారణం ఒక్కటే- ఆయన కథల్లోని కరుణ రసానికి మూలం తీవ్రమైన ఆగ్రహమన్న రహస్యం నాకు చాలా కాలంగా తెలియడమే. సుబ్బరామయ్యగారిని చాలామంది మృదుభాషి, సాత్వికుడు, అజాత శత్రువులాంటి అందమయిన పదాలతో వర్ణించడం కద్దు. వాటిల్లో ఏ ఒక్కటీ అసత్యం కాదు. అలాగే ఏ ఒక్కటీ సుబ్బరామయ్యగారి వ్యక్తిత్వాన్ని గానీ, సాహిత్య తత్వాన్ని గానీ మనకి పట్టించే వర్ణన కాదు. ఇదో చిత్రం, విడ్డూరం!!

''బహుశా నా వ్యక్తిగత జీవితంలోని విషాదం, నా కథల్లో కరుణరసంగా పరిణమించి ఉంటుందని కొందరు భావించారు. నేను కాదని వాదనకు దిగదల్చుకోలేదు. ఎటొచ్చీ జీవితంలోంచి సాహిత్యతత్వం రూపు దిద్దుకోవడం, ఇంత మెకానికల్‌గానూ, మేథమాటికల్‌గానూ జరిగే పరిణామమా? అన్న అనుమానం మాత్రం వ్యక్తం చేయకుండా ఉండలేకపోతున్నా''నని బహు మర్యాదగా తన నిరసన వ్యక్తం చేశారు పెద్దిభొట్ల. సుబ్బరామయ్యగారి కథల్లో పాత్రలకు ఉండే ప్రాధాన్యం సంఘటలకూ సందర్భాలకూ లేకపోవడం పట్ల చాలామంది విమర్శకులు అభ్యంతరం చెప్పారు. అయితే షార్ట్‌స్టోరీ చట్రంలోనే అలాంటి పరిమితి ఉందేమోనని కొందరు సర్ది చెప్పుకున్నారు. కానీ, పెద్దిభొట్ల మేష్టారు అలా అనుకోవడం లేదు. ''ఉన్నదున్నట్టు కాదు గానీ నా కథల్లో చాలామట్టుకు నా సొంత అనుభవాలనే రాస్తాను. ముఖ్యంగా నేను దగ్గరగా చూసిన వ్యక్తులనే పాత్రలుగా-కథకి అవసరమయ్యే రీతిలో- మలచడానికి ట్రై చేస్తాను. అసామాన్యమైన సమయస్ఫూర్తినీ కల్పనా చాతుర్యాన్ని ప్రదర్శించిన ఏడెనిమిదేళ్ల అమ్మాయి మాటలను ఆధారంగా చేసుకుని ఒక కథ రాశాన్నేను అలాగే ఒకసారి హైదరాబాద్‌లో రోడ్‌ మీద వెళ్తుంటే ఒకతను నన్ను నిలబెట్టి నువ్వు ఫలానా వ్యక్తివేనా అని అడిగాడు. కాదు మహానుభావా అన్నా సరే వదల్లేదు. పక్కనే ఆర్టిస్టు చంద్ర కూడా ఉన్నాడు. ఆయన జోక్యం చేసుకుని సర్ది చెప్పే దాకా నన్ను పెద్ద మనిషి వదలి పెట్టలేదు. అప్పటికీ అతను నా మాటలు నమ్మినట్లనిపించలేదు. దాని మీద తీగలు సాగిన ఊహే 'నీడ' కథగా రూపు దిద్దుకుంది. ఎందుకు చెబుతున్నానంటే నా కథలకి- మోస్ట్‌లీ- నా స్వానుభవాలే ప్రాతిపదికలని చెప్పడానికి. అయితే ఈ సందర్భంగా ఒక విషయంలో మిమ్ముల్ని కాషన్‌ చెయ్యాల్సి వుంది. ఏ అనుభవాన్నీ యథాతధంగా కథగా మార్చడం సాధ్యం కానట్లే, ప్రతి కథకీ సొంత అనుభవమే పునాదిగా సమకూర్చడం కూడా సాధ్యం కాదు. ఇది కథాప్రక్రియకి ఉన్న పరిమితిగా నేను భావించడం లేదు. ఆయా రచయితలు ఇష్టపూర్తిగా ఎంచుకునే మార్గాన్ని బట్టి ఈ విషయం ఉంటుంద''ంటారు సుబ్బరామయ్య.

పెద్దిభొట్లగారి కథల్లో కొన్ని తట్టుకోలేనంత దుక్ఖాన్ని- కొండకచో శోకాన్ని- కలిగించేవి వున్నాయి. ''కోరిక'', ''శనిదేవత పదధ్వనులు'', ''దగ్ధగీతం''లాంటివి అలాంటి కథల్లో కొన్ని. ఈ తరహా కథలు పాఠకుడిని తీవ్రంగా ప్రభావితం చేసి నిష్క్రియా పరుడిగా, నిరాశాపరుడిగా, మెట్ట వేదాంతిగా మార్చే ప్రమాదం లేదా అన్న ప్రశ్నకు ఆయన సవివరంగా సమాధానమిచ్చారు. ''ఇలాంటి కథలు ఇలాగే ఎందుకుండాలి? అసలు ఇలాంటి కథలే ఎందుకు రాస్తారు మీరు?? అని నన్ను చాలా మంది అడిగారు. ఆ కథలు అలాగే ఉండాలని గానీ, నేను అలాగే రాయాలని గానీ ఎప్పుడూ అనుకోలేదు. అందుకు భిన్నమయినవి కూడా రాశాను. అయితే కరుణ జీవలక్షణమన్నది నా నమ్మకం. అందులో కూడా గాఢమయిన డైనమిజం ఉందని నేను భావిస్తాను. అలాంటి కథలు నేను చాలా కోపంతో రాస్తానని చెబితే మీరు బహుశా నమ్మరు! మన సమాజం మహా క్రూరమయినది. మతం, కులం, వర్గం, జెండర్‌- ఏది తీసుకుని చూసినా ఆ విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందాకా ఎందుకు- బయట ఆ గోల చూడండి. అలా గొంతు చించుకుని ప్రచారం చేస్తున్నవాళ్లకి మనసంగతేమన్నా పడుతోందా? అలాగే- రోడ్డు మీద అడుగు పెట్టిందగ్గర్నుంచీ అడుగడుగునా మన సామాజిక జీవనంలోని క్రూరత్వం సెవెంటీ ఎంఎంలో కనిపిస్తూనే ఉంటుంది. మన మానవసంబంధాలు బహు బలహీనమైనవి. వాటికి సొంత రంగూరుచీవాసనా ఉండడం అరుదు. ఇలాంటి జీవితాన్ని ద్వేషించకుండా ఉండేవాళ్ల మానసిక ఆరోగ్యం మీద నాకు నమ్మకం లేదు. రచయితగా ఇలాంటి పరిస్థితికి- అసహాయతకి స్పందించకుండా ఎలా ఉండగలమో ఊహాతీతం. అది ఆగ్రహం కాక మరోలా ఎలా వుండగలదు? అయితే కరుణ రసాన్ని వాహికగా చేసుకుని నేను నా ఆగ్రహాన్ని ప్రకటిస్తాను. అది వాచ్యంగా ఉండకపోవడం దాని బలహీనత కాదు-బలమే అనుకుంటాను. అలాంటి కథల వల్ల పాఠకుడిని ఒక్కోసారి శోకం ముప్పిరిగొనే అవకాశం ముమ్మాటికీ వుంది. కానీ అది అతగాడిని నిష్క్రియాపరత్వం వైపో, మెట్టవేదాంతం వైపో తీసుకెళ్తుందని మాత్రం నేను అనుకోవడం లేద''న్నారాయన.

పెద్దిభొట్ల కథల్లో- పూర్ణాహుతి, దుర్దినం, శుక్రవారంలాంటివాటిల్లో- కొన్ని రకాల మనుషులు కనిపిస్తారు. శనిదానాలు పట్టేవాళ్లు, శవవాహకులు, బ్రాహ్మణులే అస్పృశ్యులుగా ఎంచే ప్రత్యేక తరహా బ్రాహ్మణులు వాళ్లు. వీళ్లను వేగుంట మోహనప్రసాద్‌ ''దళిత బ్రాహ్మణులు'' అన్నారట. ''బ్రాహ్మణ దళితులు'' అంటే మరింత కరెక్ట్‌గా వుంటుందేమో! ''ఇలాంటివాళ్ల గురించి రాసేటప్పుడు నేను దృష్టిలో వుంచుకునేది ఒక్క విషయాన్నే. ఈ ప్రపంచంలో అసహ్యకరమయిన వృత్తులు చేసేవాళ్లు కొందరు వుండడం, మనందరి అవసరం. కానీ వాళ్ల వృత్తుల కారణంగా వాళ్లని అసహ్యించుకోకండా వుండలేం. ఈ పేరడాక్స్‌ చాలా విషాదభరితమయినది. దీన్ని నేను మరికొన్ని కోణాల్లోంచి కూడా చూసి ప్రదర్శించాను. రైల్లో చెత్తాచెదారం ఎత్తి పోసే దిక్కుమాలిన అనాథ కుర్రాళ్ల దైన్యం గురించి 'లేచిన వేళ' అనే కథలో రాశాను. అలాగే 'సతీ సావిత్రి', 'చీకటి'లాంటి కథలు కూడా నిస్సహాయుల గురించి రాసినవే. చిన్నప్పటి నుంచీ పట్టణ వాతావరణంలో పెరిగిన నాకు- దూరం నుంచే అయినప్పటికీ- ఈ తరహా లంపెన్‌ జీవితం గురించిన ఎక్స్‌పోజర్‌ వుంది. అక్కడ పనిచేసే జీవనసూత్రాల గురించి స్థూలంగా అవగాహన వుంది. అందుకే అలాంటి కథలు రాయగలిగాను. కాలువ మల్లయ్యలాంటి రచయితలు నోచుకున్న భాగ్యం నాకు దక్కకుండా పోయింది. మట్టివాసన అంటారే అదేమిటో నాకు తెలీదు. పట్టణాల్లో సుళ్లు తిరిగే మురుగు కంపు మాత్రమే నాకు తెలుసు. దాన్ని గురించి మాత్రమే రాశాను. 'పంజరం', 'ముక్తి' ఈ కోవకే వస్తాయి. తెలియనివాటి జోలికి వెళ్లి చేతులు కాల్చుకునే అలవాటు నాకు లే''దని సుబ్బరామయ్య స్పష్టం చేశారు.

తెలుగులో క్రీడలు నేపథ్యంగా వచ్చిన కథలు అరడజనుకు మించి లేవని ఒకసారి కె.వి.యస్‌. వర్మ రాశారు. వాటిలో మూడు కథలు పెద్దిభొట్ల సుబ్బరామయ్య రాసినవే అయి వుండడం గమనార్హం. ముఖ్యంగా ఆయన రాసిన 'ఏస్‌ రన్నర్‌' కథ చాలా గొప్పది. అందులోని రామచంద్రమూర్తి కేరెక్టర్‌ మధ్యతరగతి అసమర్థాగ్రహంలోని దీనత్వాన్ని ప్రదర్శించింది. అసమర్థుడి ఆగ్రహం ఆత్మహాని కలిగిస్తుందని 'పేదవాడి కోపం....' సామెత ఎప్పుడో చెప్పింది. అయితే అలాంటి సందర్భంలో, పరిస్థితిలో ఉండే హృదయరాహిత్యాన్ని సుబ్బరామయ్య మనకి చూపించారీ కథలో. ఆ కథకి కూడా తను చూసిన ''కొందరు వ్యక్తుల జీవితాలే ప్రేరణ'' అంటారాయన.

మన సినిమా నేలబారుగా కూడా లేదు- పాతాళపు లోతుల్లో ఎక్కడో నక్కిం''దని పెద్దిభొట్ల సుబ్బరామయ్య అంటారు. పైకి మామూలు కంటెంప్ట్‌లా కనిపించినా దాని వెనకాల పెద్ద కథే వుంది. ''న్యూయార్క్‌లోని సిక్త్స్‌ ఎవెన్యూ థియేటర్‌లో ఆరు మాసాలుగా ఆడుతున్న 'పథేర్‌ పాంచాలీ' సినిమా బెజవాడ లీలామహల్‌లో ఒక్క ఆట ఏర్పాటు చేశారు. నలభై ఏళ్ల నాటి మాట ఇది. ఆ రోజు శనివారం. లయోలా కాలేజ్‌లో ఉద్యోగానికి వచ్చి చేరమనడంతో ఇంటి నుంచి బయలుదేరాను. దార్లో 'పథేర్‌ పాంచాలీ' పోస్టర్‌ చూసి దిగిపోయాను. సినిమా చూసి ఇంటికెళ్లిపోయాను. రెండ్రోజుల తర్వాత వెళ్లి ఉద్యోగంలో చేరాను- నిదానంగా. సినిమా కళ మీద నాకున్న అభిమానం అంతటిది. కానీ, మన తెలుగు సినిమా ఒఠ్టి ఫ్రాడ్‌. నీచాతినీచమయిన 'అభిరుచి'కి ఆటపట్టుగా ఉంటోంది-నాకు తెలిసినప్పటి నుంచీ ఇదే పరిస్థితి. నానాటికీ దిగజారుతోంది తప్ప మెరుగయ్యే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. తెచ్చి పెట్టుకున్న మొహాలు- ఎరువు తెచ్చుకున్న తలకట్లు-అరువు గొంతులు- కనీసం వెకిలితనం కూడా సొంతం కాదు ఇక్కడ. దీనికి సమాజం అంతా పూనుకుని సబ్సిడీలూ రాయితీలూ ప్రోత్సాహకాలు ఎందుకు ప్రకటించాలో నాకెప్పుడూ అర్థం కాద''ంటారాయన.

''నా బాల్యంలోనే మా నాన్న పోయారు. నా కళ్ల ముందే మా అన్నయ్య నెత్తురు కక్కుకుని చనిపోయాడు. అమ్మనూనన్నూ అభద్రతాభావం ఆవరించింది. అయితే నా జీవితమంతా ఎదురీత అనీ, కష్టాల కడలి అనీ అనుకోకండి. కష్టం అంటే ఏమిటో తెలిసిన మధ్యతరగతివాణ్ని నేను. రచయితగా నాకు నా జీవితానుభవం బాగా ఉపయోగపడింది. కౌమార ప్రాయంలోనే గొప్ప అవకాశాలు నాకు ప్రాప్తమయ్యాయి. ధారా రామనాథశాస్త్రి, కె.వి. రమణారెడ్డి గార్లు చెయ్యి పట్టుకుని కొత్త వెలుగుల వైపు నడిపించారు. విశ్వనాథ సత్యనారాయణగారి శిష్యరికం సరేసరి. బాష మీద, భావ ప్రకటన రీతి మీదా అవగాహన కల్పించింద''ని జ్ఞాపకం చేసుకున్నారు పెద్దిభొట్ల. ''నేను రాసిన మొదటి కథ 'చక్రనేమి' 1959లో ఆంధ్రపత్రిక వీక్లీలో అచ్చయింది. సెంటర్‌స్ప్రెడ్‌లో బాపు వేసిన కలర్‌ ఇలస్ట్రేషన్‌తో వచ్చిందది. చూసుకోగానే అనిర్వచనీయమయిన అనుభూతి కలిగింది. అప్పట్లో మహానుభావుడు తిరుమల రామచంద్ర 'భారతి' మాసపత్రికకి ఎడిటర్‌గా వుండేవారు. 'మీ రచన చక్రనేమిని భారతిలో పునఃప్రచురించదల్చుకున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నా'మంటూ ఆయన రాసిన కార్డు చూసినపుడు ఆ ఆనందం ద్విగుణీకృతమయింది. నేను రాసిన చేదుమాత్ర, అంగారతల్పంలాంటి చిన్ననవలలు భారతిలో వచ్చాయి. కొందరు పబ్లిషర్స్‌ వాటిని పుస్తకాలుగా వేశారు. 'చేదుమాత్ర' ప్రూఫ్‌ రీడింగ్‌ స్టేజీలో వుండగా తుమ్మలవెంకటరామయ్యగారు చూసి, తనంతట తానే ముందుమాట రాసిచ్చారు. రచయితగా నాకు దక్కిన అపూర్వ పురస్కారాలివి'' అని అన్నారు పెద్దిభొట్ల మురిసిపోతూ. రచయితగానూ, వ్యక్తిగానూ కూడా సుబ్బరామయ్య మేష్టారిలో కొట్టొచ్చినట్లు కనిపించే విశిష్టత సింప్లిసిటీ. అది ప్రయత్నం చేసి సాధించింది కాకపోవడమే దాని ప్రత్యేకత.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X