వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివసాగర్‌తో కాసేపు

By Staff
|
Google Oneindia TeluguNews

కవిగా, విప్లవకారుడిగా శివసాగర్‌ రోమాంటిక్‌. అంతటి రోమాంటిక్‌ పోయెట్‌ ఆధునిక తెలుగు కవిత్వంలో మరొకరు కనిపించరు. 'ఉద్యమం నెలబాలుడు' కవితా సంకలనంలో ఉన్న కవితలు, పాటలు ఆయన కవితాశక్తికి, ఆయన ఈస్తటిక్‌ సెన్స్‌కు ప్రతీకలు. అజ్ఞాతంలో ఉంటూ వివిధ పేర్ల మీద ఆయన రాసిన కవితలు చాలా కాలం క్రితమే 'ఉద్యమం నెలబాలుడు' పుస్తకంగా వచ్చింది. ఆయన పీపుల్స్‌వార్‌ నాయకత్వంతో విభేదించి అజ్ఞాతవాసం వీడి బయటకు వచ్చారు. ఆ తర్వాత దళిత కవిత్వం రాశారు. ఇందులోనూ అంతే. ఆయన రాసిన 'నల్లసూర్యుడు' కవిత దళిత కవిత్వానికి ప్రతీకగా నిలిచింది. రెండో సారి అజ్ఞాతం వీడి ఆయన బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కదిలించినప్పుడు- 'కవిత్వమే నాకు జీవితాన్ని ఇచ్చింది' అని ఆయన అన్నారు. ఇటీవల తాను రాసిన 'సద్దామ్‌కు ప్రేమలేఖ' కవిత గురించి చాలా సేపు మాట్లాడారు. 'దాంట్లో రొమాంటిసిజం ఉంది' అన్నారు. 'పోయెట్‌ అంటేనే అది కదా!' అన్నాడు. 'విప్లవ కవిత్వం రాసినప్పుడు కూడా అలాగే రాశాను' అని ఆయన అన్నారు.

పీపుల్స్‌వార్‌ నుంచి బయటకు వచ్చాక కె.జి. సత్యమూర్తి అలియాస్‌ శివసాగర్‌ రాజకీయంగా అనేక ప్రయోగాలు చేశారు. కాన్షీరామ్‌ నాయకత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి)లో చేరి అక్కడ ఉక్కపోసి వెనక్కి వచ్చేశారు. దళితవాదం గురించి అనేక చర్చలు చేశారు. దళిత ఈస్తటిక్స్‌ గురించి మాట్లాడారు. ఆయనకు ఆయుధం ఒక అబ్సెషన్‌ కావచ్చు. విప్లవం తెస్తానంటూ రెండో సారి అడవి దారి పట్టారు. సిపిఐ (ఎంఎల్‌) ప్రతిఘటనలో చేరి వృద్ధవృకోదరమై గర్జించారు. రెండోసారి ఎందుకు అడవులకు వెళ్లారని అడిగితే- 'విప్లవం ఎలా చేయాలో పీపుల్స్‌వార్‌కు ఆచరణలో చూపిద్దామనుకున్నాను' అని అన్నారు. అక్కడా నిలువలేకపోయారు. తిరిగి వచ్చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే- 'ముసలితనం కదా!' అని అన్నారు.

ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలోని తన కూతురు ఇంట్లో ఉంటున్నారు. అంబేడ్కరిజాన్ని విమర్శిస్తూ 'అంబేడ్కర్‌ చాలడు- మార్క్స్‌ కావాలి' అని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ రాశారు. ఆయన అజ్ఞాతం వీడి బయటకు వస్తూనే- ఆ పుస్తకానికి జవాబు చెప్పే పనిలో పడ్డారు. రంగనాయకమ్మ రాసిన పుస్తకానికి జవాబిస్తూ ఆయన రాస్తున్న వ్యాసాలు ఒక దినపత్రికంలో వారంవారం వస్తున్నాయి. ఇటీవల ఆయన హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఈ విషయాలన్నీ ఆయన కలబోసుకున్నారు. 'ఇక్కడే ఉంటారా?' అని అడిగితే 'లేదు. విశాఖపట్నంలోనే ఉంటా' అని జవాబిచ్చారు. రెండోసారి అడవుల్లోకి వెళ్లే వరకు ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు.

'ఇప్పుడేం చేస్తారు?' అని అడిగితే 'సాహిత్య రంగంపై దృష్టి పెడతా' అని చెప్పారు. తన రాజకీయానుభవాలను కూడా రాయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయం ఆయన చాలాసార్లు చెప్పారు. కానీ ఆచరణలో పెట్టలేదు. మార్క్సిజంలోని లోపాలను గురించి ఆయన ప్రస్తావించారు. మార్క్సిజం పరిమితుల గురించి ఆయన చాలా సేపు మాట్లాడారు. ఆ పరిమితుల్లోంచే సాంస్కృతిక విప్లవం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థికాంశానికి తాము అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని ఏంగెల్స్‌ అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. అయితేఅప్పట్లో ఏంగెల్స్‌ ఏమిటి అట్లా అనడమేమిటని అనుకున్నామని ఆయన చెప్పారు.

సాంస్కృతికోద్యమం బలంగా సాగాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరి పని వారు చేసుకోవడమనే సంస్కృతి ఇందులో ఉన్నదని ఆయన చెప్పారు. విప్లవోద్యమం ఫలించినదేశాల్లోనూ ఇది అమలు కాలేదని ఆయన చెప్పారు. పైస్థాయిలో ఉన్నవారు దానికి బ్రేక్‌లు వేశారని ఆయన అన్నారు. సాంస్కృతికోద్యమం జరగకుండా జరిగే అభివృద్ధి ఏది కూడా గుణాత్మకం కాదనేది ఆయన అంచనా అని ఆయన మాటల ద్వారా నాకు అర్థమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X