• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అస్తిత్వ ఉద్యమంలో నవీన కెరటం: చింతం ప్రవీణ్‌తో ఇంటర్వ్యూ..

|

ఆధిపత్యం ఘీంకరిస్తే.. వలసెళ్లిన కన్నీళ్లు మనాది నుంచే మూలాన్ని తవ్వుకుంటయ్. తాతల కాలానికి.. తండ్రి కాలానికి.. తన కాలానికి ఆధిపత్య రూపం మారిందే తప్ప.. లోతుల్లోకి ఇంకిన దాని సారం కొత్తగా మొలకెత్తుతూనే ఉంది. చింతం ప్రవీణ్ కుమార్ మాటల్లో కనిపించిన భావన ఇది.

విద్యార్థి రాజకీయాల నుంచి.. ఉద్యమాల నుంచి.. పదునెక్కిన చైతన్యంతో.. తన జాతి కోసం బహుజన అస్తిత్వాన్ని భుజానికెత్తున్న వ్యక్తి చింతం ప్రవీణ్ కుమార్. సమకాలీన సామాజిక, రాజకీయ, సాహిత్య అంశాల పట్ల ఆయనకున్న దృక్పథాన్ని వన్‌ఇండియా.కామ్ తో పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ మీకోసం..

నేపథ్యం:

నేపథ్యం:

నేపథ్యం.. పుట్టింది పెరిగింది అంతా వరంగల్ శివనగర్ లోనే. అయితే మా పూర్వీకులది కరీంనగర్ జిల్లా మంథని మండలం ఖమ్మంపల్లి. తాత ముత్తాల నుంచి అక్కడే ఉన్నం. అప్పుడంతా ఆధిపత్య కులాల వ్యవహారం. బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కువుండేది. తాత పేరు బాలరాజు..

తాత గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. తాత ఎదుర్కొన్న పరిస్థితులే మా మీద బలంగా ప్రభావం చూపించినయ్. అప్పట్లో మాకు దొరలతో సమానంగా పాడి పశువు ఉండేది. ఆధిపత్య వర్గాలకు అది నచ్చలే. అట్లా.. మా తాత వాళ్లతో చాలా పోరాడిండు.

చివరకది ఎంతదాకా పోయిందంటే.. ఆయనకాయనే ఓ పిచ్చోడైపోయి చనిపోయేటట్టు చేసిన్రు. ఆ పరిస్థితుల్లో.. ఉన్న ఊరును విడిచి మాలో కొంతమంది మంచిర్యాల పోయిర్రు.. మేం వరంగల్ శివనగర్ కి వచ్చినం.

ఆధిపత్యం-పట్టణీకరణ-ప్రపంచీకరణ..

ఆధిపత్యం-పట్టణీకరణ-ప్రపంచీకరణ..

మా ఇంట్లో మూడు తరాల వాళ్లం ఈ సమస్యలను ఎదుర్కొన్నం. తాత కాలానికి ఆధిపత్య వర్గాలతో.. నాన్న టైమ్ కి అప్పుడే మొదలైన పట్టణీకరణతో.. ఇప్పుడు నా టైమ్ వచ్చేసరికి ప్రపంచీకరణతో..

సో.. ముందునుంచి మీలొ సామాజిక స్పృహ అనేది ఉంది..

స్పందించడం ఎట్లా మొదలైంది?

నేను పెరిగిన శివనగర్ ఏరియాలో ఎర్రజెండా ప్రభావం ఎక్కువ. ఒకవిధంగా ప్రశ్నించడం కమ్యూనిజమే నేర్పింది. అందులో ఎట్లాంటి డౌట్ లేదు. ఆ తర్వాత యూనివర్సిటీలో చేరడం.. ఎస్ఎఫ్ఐతో కలిసి పనిచేయడంతో స్పందించే తత్వం అనేది ఇంకాస్త పెరిగింది.

అంటే.. తొలుత మీలో కొంత కమ్యూనిస్టు భావజాలం ఉంది.

మరెందుకు ఆ తర్వాతి రోజుల్లో అస్తిత్వ ఉద్యమాల వైపుకు మళ్లిర్రు?

చాలా స్పష్టంగా అర్థమైంది నాకు. కమ్యూనిస్టులు కులాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నరు.

... ... ...

ఒక వ్యక్తిని డిసైడ్ చేయాలంటే సాంస్కృతిక, ఆర్థిక, చరిత్ర వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కమ్యూనిజం కేవలం ఆర్థిక అంశాలను మాత్రమే పట్టించుకుంది.

'కులం చేత నిర్మితమైన వ్యవస్థను విస్మరించి కేవలం పెట్టుబడిదారి గురించే మాట్లాడుతమంటే కుదరదు.'

మార్క్స్ ప్రతిపాదించి గతిశీలత సూత్రాన్ని వీళ్లు కుల కోణంలోంచి చూడలేదు. అది వారికి వర్గంగా కనబడింది.

ఇంకో మాట.. మనకో స్పష్టమైన లైన్ ఉంది. సాహు మహరాజ్ వంటి మహానుభావుడు రిజర్వేషన్లకు సంబంధించిన దామాషా పద్దతి గురించి ఆనాడే చెప్పిన్రు. జ్యోతిబాపూలే మనకో కల్చరల్ లైన్ ఇచ్చిన్రు.. బాబా సాహెబ్ దాన్ని రాజ్యాంగం చేసి మనకు అందించిన్రు. దాన్ని ఫాలో కావాలె మనమిప్పుడు..

కమ్యూనిస్టులు కులాన్ని విస్మరించారన్న స్పృహ మీకెట్లా కలిగింది?

కమ్యూనిస్టులు కులాన్ని విస్మరించారన్న స్పృహ మీకెట్లా కలిగింది?

అంటే ప్రత్యక్ష అనుభవమేమైనా!..

నేను పెరిగిన శివనగర్ ఏరియా ఒక స్లమ్ ఏరియా.. నేను పీహెచ్.డీ చేసింది సింగరేణి కార్మిక వర్గం మీద కథలు రాసిన పి.చాంద్ గారి రచనల మీద. మా అమ్మ ఓ బీడీ కార్మికురాలు.. మా నాన్న ఆర్టీసీ డ్రైవర్, సీఐటీయూ మెంబర్..

ఈ జీవితాల్లోంచి చూసినప్పుడు అసమానతలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నయ్. అంతకు ముందు తరాలు దాన్ని అర్థం చేసుకోలేకపోయినయ్..

లైఫ్‌లో ఇదీ టర్నింగ్ పాయింట్ అనిపించేదేమైనా!..

నేను సాహిత్యం చదువుకోవడం.. జర్నలిజంలోకి రావడం.. రెండూ టర్నింగ్ పాయింట్సే. 2006 తర్వాత ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, ఐ న్యూస్, నవతెలంగాణల్లో పనిచేశా.

జర్నలిస్టుగా నేను చూసిన జీవితాల్లో గమనించిందేంటంటే.. పీడించబడేవాడు పీడించబడుతూనే ఉన్నడు. పేదరికం నుంచి సమాజాన్ని అర్థం చేసుకునే కోణం ఇది.

ఇదంతా సరే.. మరి రాయడమెట్లా మొదలైంది?

ఇదంతా సరే.. మరి రాయడమెట్లా మొదలైంది?

ఎట్ ది ఏజ్ ఆఫ్ 17th..'ఇట్స్ ఏ వాల్యూ ఆఫ్ లవ్' అని నేనో నవల రాసిన. పొయెట్రీ విషయానికొస్తే.. దు:ఖం-బాధ-ప్రేమ.. వీటి నుంచే కవిత్వం పుడుతుంది. నేను రాసింది కూడా వాటినుంచే..

మీ దృష్టిలో అసలు సాహిత్యమంటే!..

ప్రేమ్ చంద్ గారు ఒక మాటంటరు..

'సాహిత్యం జీవితాన్ని వ్యాఖ్యానించాలి

జీవితాన్ని వ్యాఖ్యానించడమే సాహిత్యం '

ప్రజల కోసం, ప్రజల సంఘర్షణ కోసం, అస్తిత్వం కోసం సాహిత్యం కృషి చేయాలె. సీరియస్లీ నేనేం చెప్తా అంటే.. ఇప్పటిదాకా వచ్చిన సాహిత్యంలో ఎక్కువ శాతం సాహిత్యం పండిత సభల్లో మూలిగింది.

అసలు సాహిత్యం ఏ వర్గాల కోసం?.. పంట పండించేటోనికి పరిగెనే దక్కుతుంది నేడు.. అది గమనించాలె.. సాహిత్యం ఎవరి సొత్తు అన్న ప్రశ్న మొదలైనప్పుడు.. ఈ దేశం యొక్క ఇంధనం ఉత్పత్తి శక్తులు చేస్తున్న ఉత్పత్తి మీద ఆధారపడి ఉన్నది అన్న విషయం గుర్తుంచుకోవాలె.

పెన్ అనేది వెపన్ లాంటిది.. ఏదో రాసి ఊరుకోవడం కాదు.. రాసిన అక్షరానికి కట్టుబడి ఉండేంత నిబద్దత ఉండాలె. ఫైనల్ గా దీని మీద నేను చెప్పేదొక్కటే.. స్పందించేవాడే కవి.. స్పందించేవాడే కవి..

జనం ఏ వస్తువు మీద బాధపడుతున్నారో.. వారిని బాధపట్టే వస్తువు ఏదైతే ఉందో.. దాని మీద రాయాలె. అట్లా కాకుండా ఓ లిస్టవుట్ తయారుచేసుకుని నేను దానిమీదనే రాస్తూ పోవుడు కాదు.

ఒక్క మాటబ్బా.. జ్యోతిబాపూలే, సాహు మహరాజ్, బాబా సాహెబ్ అంబేడ్కర్.. వీళ్లంతా వాళ్ల జీవితాలకే గనుక పరిమితమై ఉంటే.. ఇంత చైతన్యం వచ్చేదా?, నీ అక్షరం ఎవరికైనా ఉపయోగపడాలె. నేను చదువుకున్న యూనివర్సిటీలో ప్రతీ ఇటుకు పెళ్ల శ్రమజీవుల ఉత్పత్తి నుంచి వచ్చిందే. అక్కడ చదువుకుని.. నేను వాళ్లకోసం మాట్లాడకపోతే ఎట్లా?

బీసీ అస్తిత్వ ఉద్యమం గురించి:

బీసీ అస్తిత్వ ఉద్యమం గురించి:

నిచ్చెనమెట్ల కులవ్యవస్థ మీద నిర్మించబడ్డ ఈ దేశంలో మనుధర్మశాస్త్రం-ఓ అన్‌రిటెన్ కాన్‌స్టిట్యూషన్. ఇట్లాంటి దేశంలో.. బీసీల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. అటు రాజ్యాంగాన్ని ఓన్ చేసుకోలేక.. ఇటు రాజ్యం వైపు పోలేక..

ప్రజలు కేవలం ఓటు బ్యాంకుగా మారడమన్నది అత్యంత సిగ్గుచేటు విషయం. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. పొలిటికల్ పవర్ లేని కులాలు త్వరగా ఉనికిని కోల్పోతాయి. అందుకే రిజర్వేషన్లను నేను పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తా.

ఈరోజు ఎస్సీ-ఎస్టీల కన్నా దారుణమైన స్థితిలో బీసీలున్నరు. అసలు మేం బీసీలం అని కూడా తెలియని కొన్ని సంచార జాతులు ఉన్నయి. కోతులోళ్లు.. పిచ్చకుంట్ల.. బహురూపులు.. వీళ్లంతా ఆ కోవకే చెందినోళ్లు.

నిజానికి ఎస్సీల్లో ఉన్న ఐక్యతతో పోలిస్తే..

బీసీల్లో అంత ఐక్యత లేదన్నది వాస్తవం.. మరిప్పుడు అది సాధ్యమవుతుందా?

బీసీల్లో ఐక్యత లేదు అనే క్రమంలో ఒక విషయం గమనించాలె. బీసీల్లో ఉన్న ఒక్కో కులానికి ఒక్కో నిర్దిష్ట సంస్కృతి ఉంది. ఇంకో విషయం.. ఎస్సీలు బ్రాహ్మణ వర్గం చేత దారుణంగా అణిచేయబడ్డరు కాబట్టి.. వాళ్లలో బ్రాహ్మణ ఆధిపత్యం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. బీసీల పరిస్థితి అలా లేదు.. అటు పూర్తిగా అణిచేయబడలేదు.. అలా అని వారిచేత ఓన్ చేసుకోబడలేదు..

ఒక్కటి నేను చెప్పేదేంటంటే.. అస్తిత్వ ఉద్యమాల ఎజెండా కుల నిర్మూలనే ధ్యేయంగా ఉండాలె. అలా కానంతవరకు ఇండియాలో ఏ రెండు కులాలు ఎప్పటికీ కలవవు.

మీరనుకుంటున్న రాజ్యాధికారం ద్వారా

మీరనుకుంటున్న రాజ్యాధికారం ద్వారా

ఖచ్చితంగా బీసీలందరికీ న్యాయం జరుగుతుందా?, ఎస్సీ అస్తిత్వ ఉద్యమాలను కలుపుకుపోతరా? ఎస్సీ-బీసీ ఐక్యతా ఎట్లా ఉంటది?

నిర్ణయాధికారంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. ఇక్కడో విషయం గమనించాలె.. రాజ్యకాంక్ష వేరు.. నిర్ణయాధికారం కావాలనుకోవడం వేరు.. అందుకే ఎస్సీల తరహాలోనే బీసీలకు కూడా పొలిటికల్ రిజర్వేషన్స్ ఉండాలె..

రాజ్యాధికారాన్ని బీసీ, ఎస్సీ కోణం నుంచి చూసినప్పుడు.. బీసీల కన్నా ముందు ఎస్సీలకు రాజ్యాధికారం కావాలె. అప్పర్ క్యాస్ట్ కింద బీసీలు పనిచేస్తున్నప్పుడు.. ఎస్సీల కింద ఎందుకు పనిచేయొద్దు?. రాజ్యాధికారం గనుక బీసీలకు దక్కితే.. అది బీసీల్లో ఉన్న కింది కులాలకు కూడా రిప్రజెంటేటివ్ గా ఉండాలె.

అస్తిత్వవాద ఉద్యమం ద్వారా రాజ్యాధికారం సాధించినప్పుడు..

రాజ్యాధికారం తర్వాత కూడా రాజ్యకాంక్షకు తావివ్వకుండా,

అసలు లక్ష్యంతో పనిచేయగలరా?

అస్తిత్వ ఉద్యమాలను ఎట్లా అర్థం చేసుకోవాలంటే.. భావజాలపరంగా అర్థం చేసుకోవాలె. పుట్టుక చేత ఎస్సీ, బీసీ కాదు, భావజాలం చేత ఎస్సీ, బీసీగా ఉండాలె.. బ్రాహ్మణిజం మీద పోరాటం అంటే బ్రాహ్మణ సోదరుల మీద యుద్దం కాదు, అంతా నేనే.. అంతా నాదే.. అనుకునే తత్వం మీద పోరాటం.

రాజ్యాధికారం రావడమంటే.. బీసీల్లో ఉన్న ఐదు కులాలో, ఎస్సీల్లో ఉన్న రెండు కులాలో బాగుపడుడు కాదు. అట్లయితే అసమానతలు మళ్లా ఎప్పటి లెక్కనే ఉంటయ్.

ఇప్పటిదాకా వచ్చిన నాయకత్వాలన్ని

ఆ విషయంలో ఫెయిల్యూర్ అయినవని భావిస్తున్నరా?

ఫెయిల్ కాలేదు.. అయుంటే మనమిట్లా ఇంటర్వ్యూ చేసుకునేటోళ్లం కాదు.. వాళ్లు ఇచ్చిన పోరాటాలను ముందుకు తీసుకెళ్లగలిగితే సక్సెస్ అవుతాం. తెలంగాణ మూమెంట్ తర్వాత మనదగ్గర నాలాంటి యువకులు చాలామంది యాక్టివ్ అయిన్రు. వాళ్లందరిని కలుపుకుని ముందుకుపోయే ప్రయత్నం చేయాలె.

మళ్లీ చెబుతున్నా.. మహానుభావులు సాహు మహరాజ్, పూలే, అంబేడ్కర్, కాన్షీరాం ఇచ్చిన ఓ గొప్ప లైన్ మనకున్నది. సాహు మహరాజ్ రిజర్వేషన్లకు దారివేస్తే.. పూలే కల్చరల్ లైన్ ఇచ్చిన్రు. అంబేడ్కర్ తన అపార జ్ఞానంతో రాజ్యాంగాన్ని ఇచ్చిన్రు. కాన్షీరాం-పనివిధానం ఎలా ఉండాలో నేర్చించున్రు. కాబట్టి ఆ లైన్ ను మనం సీరియస్ గా తీసుకుని ముందుకు పోవాలె.

బాబా సాహెబ్ అంబేడ్కర్ ఒకానొక సమయంలో ఓ గొప్ప మాటన్నరు.. ఆయన కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు.. ఓ వ్యక్తి అంబేడ్కర్ వద్దకు వచ్చి.. అయ్యా మీ కొడుకు బ్రతికేటట్టు లేడు అని చెప్పిండట. అప్పుడు అంబేడ్కర్ ఏమన్నడో తెలుసా.. 'ఇక్కడ నా జాతి ప్రజలే చనిపోతున్నరు..' అన్నాడట. ఎంత గొప్ప త్యాగం అది.. కాబట్టి త్యాగాలు లేకుండా పోరాటాలు నిర్మించలేం.

మన దేశంలో దైవత్వ భావజాలం బలంగా ఉన్నది..

మన దేశంలో దైవత్వ భావజాలం బలంగా ఉన్నది..

పొలిటికల్ మైలేజీ కోసం, ఓటు బ్యాంకు కోసం దాన్ని ఉపయోగించుకుంటున్నారు..

అస్తిత్వ ఉద్యమాలు ఈ విషయాన్ని ఎట్లా చూస్తయ్?

మనదేశంలో మెజారిటీ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు.. సింధు నాగరికత కాలం నుంచి పృకృతిని ఆరాధిస్తున్న దేశం మనది. వ్యవసాయ ఆధారిత దేశం కావడం కన్నా ముందు పశు ఆధారిత దేశం మనది.

ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే.. చరిత్రను తెలుసుకోకుండా చరిత్ర నిర్మించలేం. ఇదంతా తెలుసుకోవాలంటే.. ముందు విద్య కావాలె. ఆ విద్య సామాజిక సంఘర్షణ, చరిత్ర, ప్రాచీన సంస్కృతిని తెలుసుకునేదై ఉండాలె.

హిందూయిజం అన్న పదాన్ని నేనసలు ఒప్పుకోను.. దాన్ని బ్రాహ్మణిజమే అంటా నేను.. మనదేశం పశువుల మీద ఆధారపడి జీవిస్తున్న సమయంలో.. బ్రాహ్మణుల ప్రవేశంతో.. యాగాలు, పశుహింస విపరీతంగా పెరిగిపోయినయ్. సరిగ్గా.. ఆ కాలంలో బుద్దుడు జీవహింసకు వ్యతిరేకంగా ఓ నినాదం ఇచ్చిన్రు. జీవహింస మహా పాపం అన్నరు.

బుద్దుడు చెప్పిన ఇంకో మాట.. 'బహుజన హితాయ.. బహుజన సుఖాయ..' వేల ఏళ్ల కిందనే చెప్పిన మాట ఇది. ఇప్పటికీ ఆచరణకు నోచుకుంటుందా? లేదు..

ఇదే దైవత్వ భావజాలన్ని ఆసరాగా చేసుకుని..

ఇదే దైవత్వ భావజాలన్ని ఆసరాగా చేసుకుని..

ఏం తినాల్నో.. ఎవరిని మొక్కాల్నో రాజకీయం నిర్దేశిస్తున్నది?

దీని నుంచి ప్రజలను ఎట్లా చైతన్యపరుస్తారు?

సంస్కృతికి సంబంధించి నేను చెప్పే మాటేంటంటే.. బొట్టు పెట్టుకున్నంత మాత్రాన పూజరి కాదు.. గడ్డం పెంచుకున్నంత మాత్రాన ఉగ్రవాది కాదు. మనదేశం ఓ ప్రార్థన సమాజం. మనదేశమొక్కటే కాదు.. ప్రపంచమంతా ప్రార్థన సమాజమే.

ప్రజలకు తెలుసు.. వాళ్లెవరికి మొక్కాల్నో.. దేవుడంటే ఇష్టపడనివారు వాళ్ల తల్లిదండ్రులను ప్రార్థిస్తరు. ఇవాళ చాలామంది అంబేడ్కర్ ఫోటో పెట్టుకుని ఆయన్ను ప్రార్థిస్తున్నరు.. ఇవేవి కాకుంటే రాజకీయ నేతల ఫోటోలు కూడా పెట్టుకుని ప్రార్థిస్తున్నరు.. మొత్తంగా ప్రార్థించడం అనే సంస్కృతి మాత్రం ఆగిపోదు.

కొన్ని వందల ఏళ్ల అజ్ఞానం నుంచి ఇప్పుడిప్పుడే చైతన్యం దిశగా అడుగులు వేస్తున్నం కదా.. ఇవేవి తెలియనివాళ్లను ఇప్పటికిప్పుడు మారమంటే సాధ్యమైతదా? అన్న విషయం గుర్తెరగాలె.

దేవుని పేరు మీద చేసే రచ్చ, రాజకీయాలు అత్యంత నీచమైనవి. ఇవాళ గోమాంసం వద్దంటున్నవ్.. నువ్ పెడుతవా వానికి బువ్వా? వానికి అన్నం పెట్టవ్.. వాడు తినేది వాన్ని తిననివ్వవు. కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్, వాక్ స్వాతంత్ర్యం, పెళ్లిళ్లు.. లాంటి విషయాల్లో రాజ్యం జోక్యం అసలు ఉండవద్దు.

అస్తిత్వ ఉద్యమాల ధ్యేయం కుల నిర్మూలన అని మీరంటున్నరు..

జనం ఆ దిశగా చైతన్యం అవుతరనే నమ్మకముందా?

జనం ఎప్పుడూ రిసీవ్ చేసుకోవడానికి రెడీగానే ఉంటరండి.. కానీ వాళ్లకోసం ఏం చేయకుండా వాళ్లెట్లా మారుతారు? అలా అని ఎవడు మారుతడులే.. మనకెందుకు అనుకుంటే.. అది ఎస్కేపిజమే తప్ప ఇంకోటి కాదు.

ముందు యూనిటీ కావాలె. ఆ యూనిటీ ఎట్లా రావాలె.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీ చేసుకోవు.. అవతలి కులం వాన్ని నీ జీవితంలోకి రానివ్వకుండా.. అది మారాలె, ఇది మారాలె అంటే ఎట్లా సాధ్యమైతది. కలిసి రాజ్యాధికారాన్ని పంచుకున్నప్పుడు.. కలిసి జీవితాలను పంచుకోవాలె అన్న ఆలోచన కూడా ఎందుకు రావద్దు.

అందుకే రాజ్యాధికారం అనేది కేవలం నినాద ప్రాయంగా ఉండవద్దు. స్లోగన్స్ కన్నా కార్యచరణ మిన్నా. అలాంటి కార్యచరణను ఉత్తరప్రదేశ్ లో కాన్షీరాం, మాయావతి చేసి చూపించారు కదా మనకు.

బీసీలంతా ఒక్క తాటిపైకి రావడానికి

బీసీలంతా ఒక్క తాటిపైకి రావడానికి

మొత్తంగా రాజ్యాధికార లక్ష్యాన్ని చేరుకోవడానికి.. మీరు పెట్టుకున్న నియమాలు?

స్పష్టమైన నినాదం ఈరోజు మనముందు ఉంది. 'బోధించు-సమీకరించు-పోరాడు' అంతేగానీ ఇవేవి లేకుండా ముందే పోరాటం అంటే కుదరదు. జనానికి చెప్పాలె కదా.. పోరాటం అనేది ఆర్టిఫీషియల్ స్టేట్ మెంట్‌కాదు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా వెంటనే పోరాటం రాలేదు.. దానికన్నా యాభై ఏళ్ల ముందునుంచే భావజాల వ్యాప్తి జరిగింది. కాబట్టి అన్యాయానికి గురయ్యే ప్రతీ ఒక్కరిని సమానంగా కూడగట్టుకుని ముందుకుపోవాల్సిన అవసరముంది.

పోరాటం కూడా.. మూలం నుంచి సమూహాంలోకి వ్యాప్తి చెందాలె. అట్లా కాకుండా కేవలం ఉపరితల విషయాల్నే స్పృశించడం హాస్యాస్పదం అవుతుంది.

తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావించిన్రు కాబట్టి ఒక ప్రశ్న..

మీరన్నట్టు భావజాల వ్యాప్తి కోసం.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో జయశంకర్, కోదండరాం సార్ లాంటి వాళ్లు ముందుండి పనిచేసిన్రు. అలాంటి నాయకత్వం బీసీ అస్తిత్వ ఉద్యమానికి ఉందా?

ఒకటి గమనించాలె.. ప్రజలే తమకు అవసరమైన నాయకున్ని తయారు చేసుకుంటరు. ఇవాళ నేను కూడా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినవాన్ని. లీడర్లంటే.. ఇవాళ అసెంబ్లీలోనో, పార్లమెంటులోనో కూచుంటునోళ్లు కాదు. లీడర్లంటే మాస్ నుంచి పుట్టుకొస్తరు. ఓ అంబేడ్కర్.. ఓ కాన్షీరాం.. వీళ్లు అసలైన లీడర్లు.

తెలంగాణ ఉద్యమంలో కూడా జయశంకర్, కోదండరాం లాంటి వ్యక్తులు మనకు లైవ్ లో ఉన్నరు గానీ.. అంతకుముందు బెల్లి లలిత, మారోజు వీరన్న, లాంటి వ్యక్తులు తెలంగాణ కోసం పనిచేసిన్రు. తెలంగాణ జనసభ, మహాసభ వంటి కార్యచరణ కూడా జరిగింది. అయితే అప్పటిదాకా అంతర్లీనంగా ఉన్న మూమెంట్ ను జయశంకర్, కోదండరాం, ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఉద్యమాలే నాయకుల్ని తయారుచేసుకుంటయ్.

నాయకత్వం అంటే.. కాన్షీరాం గురించి చెప్పాలె. ఆయన మనీ పాలిటిక్స్ నుంచి వచ్చిన లీడర్ కాదు. మాస్ నుంచి వచ్చిన్రు. కాన్షీరాం సభలకు హాజరయ్యే జనం వారాలకు వారాలు సొంత డబ్బులతో టెంట్లు వేసుకుని ఆయన ప్రసంగాలు వినేది.

నేనోసారి ఢిల్లీకి పోయిన.. అక్కడ రవిచావోస్ అనే వర్గం ఇప్పటికీ కాన్షీరాం గారిని గుర్తు చేసుకుంటరు. ఎందుకు..? ఆయన వారివద్దకు పోయిండు కాబట్టి. వాళ్ల సమస్యల కోసం పనిచేసిండు కాబట్టి.

పీహచ్.డీ తర్వాత బహుజన మూమెంట్ లోకి వచ్చాక.. నేనొక విషయం తెలుసుకున్నా. ఈ దేశంలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజల్లో.. 60శాతం మంది ప్రజలు గెలిచినోని దగ్గరికి పోతలేరు. అంటే ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ ఆ గెలిచిన వ్యక్తిని.. పలానా సహాయం కోసమో.. పలానా పనికోసమో వీళ్లు కలిసే సందర్బాలే లేవు. ఎంత దారుణమిది.

బహుజన ఉద్యమం అనగానే.. అందరికీ గుర్తొచ్చేది బీఎస్పీ..

రేప్పొద్దున రాజ్యాధికారం కోసం సాగే దిశగా.. మీరు కూడా బీఎస్పీతోనే పయనిస్తరా? ప్రత్యామ్నాయం వైపు కదులుతారా?, కమ్యూనిస్టులను కలుపుకుపోతరా?

భావ సారుపత్య కలిగివున్న ఏ పార్టీతో అయినా పనిచేయడానికి మేం సిద్దం. అట్లనే కమ్యూనిస్టుల పాత్రను కూడా విస్మరించలేం. కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తూనే.. కుల సమస్యను కూడా పట్టించుకోవాలని వాళ్లను కోరుదాం. ఖచ్చితంగా ఓ భారీ బహుజన మూమెంట్ కోసం జమిలి పోరాటాలు కావాలె. కమ్యూనిస్టులు లేకుండా అలాంటివి ఊహించలేం.

వ్యక్తుల మధ్య చీలికలు ఉన్నప్పటికీ.. భావజాలమే అందరినీ దగ్గర చేస్తది అన్న నమ్మకం ఉన్నది. మారోజు వీరన్న ఒక మాటన్నారు.. ఆయన తన పార్టీని దేశీయ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. ఎంత గొప్ప మాట.. ఇక్కడి సమాజానికి ఏం అవసరమో.. వాటికి అనుగుణంగా ముందుకుపోవాలె. ఫ్రేమ్ వర్క్ లోకి ప్రజలు రారు.. కాబట్టి ఫ్రేమ్ వర్క్, గిరి గీసుకు పోవడం లాంటివి ఉండవద్దు.

(ఇక సాహిత్యం దగ్గరికి వద్దామన్నా.. అనగానే.. ఆయనే కల్పించుకుని కొన్ని విషయాలు పంచుకున్నారు..)

* ఇవాళ ఒక కవి మాట్లాడుతున్నడు.. కవులు రాజకీయాలు మాట్లాడవద్దు అని చెప్తున్నడు. నేనంటున్నా.. ఓటేసేవాడు ఓటరుగానే మిగిలిపోవాల్నా!.. స్వతంత్ర్య భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఇద్దరు ప్రధానులు సాహిత్యంతో సంబంధమున్నవారు ఉన్నరు. ఒకరు పీవీ నరసింహరావు, మరొకరు అటల్ బిహారి వాజ్ పేయి.

అంటే.. వాళ్లు సాహిత్యం రాసుకోవచ్చు.. రాజకీయాలు చేయవచ్చు.. మిగతా కవులు, ఇతర సాహితీవేత్తలు మాత్రం రాజకీయాలు మాట్లాడవద్దా?

తొలి కవితా సంపుటి నెగడు గురించి:

తొలి కవితా సంపుటి నెగడు గురించి:

తెలంగాణ ఉద్యమంలో మాస్ అంతా కదిలింది. నేను కూడా ఉద్యమంతోనే యాక్టివిస్ట్ గా మారిన. నా దృష్టిలో ప్రజలతో కలిసిరాని ఉద్యమాలు, అక్షరాలు వృథా. ఉద్యమం అంత తీవ్రంగా జరుగుతున్న సమయంలో.. నేను భావ సాహిత్యం రాసుకుంట కూర్చుంటా అనడం కరెక్టేనా? కాబట్టి కవులు ప్రజా సంఘర్షణను కవిత్వం చేయాలె.

ఆ క్రమంలోనే నెగడు కవితా సంపుటిని తీసుకురావడం జరిగింది. ఇక వస్తువా..? శిల్పమా? అని మీరడిగితే.. నిజంగా ప్రజల కోసం రాసేవాళ్లు టెక్నిక్ గురించి ఆలోచించరు. అంత సమయం కూడా ఉండదు.

ఇక్కడ బాబ్ డిలాన్ గురించి ఒక మాట చెప్పాలె.. ఈమధ్యనే ఆయనకు నోబెల్ పురస్కారం ప్రకటిస్తే.. ఆయనెమన్నారో తెలుసా?

'నేను రాసే సాహిత్యం సరైందేనా? కాదా? అన్నది విశ్లేషించుకోవడానికి నాకంత సమయం చిక్కలేదు. యాభై మంది ముందు పెర్ఫార్మ్ చేయడం కన్నా.. 50వేల మంది ముందు పెర్ఫార్మ్ చేయడమే చాలా సులువు. ఇలాంటి ఆలోచనలో ఉన్న నేను.. రాస్తున్నది సాహిత్యమే అనుకుని రాసి ఉండవచ్చు. ఇప్పుడు మళ్లీ బిజీ..' ఈ మాటలు చెప్పి ఆయన అవార్డు కూడా తీసుకోలేదు.

కాబట్టి.. ప్రజల కోసం రాసేవాళ్లు అంత నిబద్దతతోని ఉంటరు. చెకోరా పక్షి వెన్నెలను తాగిందని రాస్తరొకరు.. దానివల్ల ఎవరికి ఉపయోగం.. చెకోర పక్షికా? అది ఆస్వాదిస్తదా ఈ వర్ణనను..

కవి అనేవాడు ఎలా ఉండాలి?,

అలాగే మీ కథల గురించి కూడా కొన్ని మాటలు..

కవి అనేవాడు దారం లాగా ఉండాలె. వస్తువు పతంగి కావాలె. అంతేగానీ తానే పతంగి అయి ఎగురుతా అంటే అదే పెద్ద సమస్య అవుతది.

కథల విషయానికొస్తే.. నేను మొదట రాసిన కథ 'నర్సు'. మొన్నీమధ్యే జిందాబాద్-డీమోనీటైజేషన్ పేరిట ఓ కథ రాసిన. ఇందులో ఓ భవన నిర్మాణ కార్మికురాలి జీవితం నేపథ్యంలో రాసిన కథ అది.

అయితే నేనెప్పుడూ ఫ్రేమ్ వర్క్ పెట్టుకోలేదు. ఇప్పటికీ ఓ యాభై కథలు మొదలుపెట్టి పూర్తి చేయలేదు.. ఈ రెండు కథలే ఎందుకు పూర్తయినయంటే 'అవసరత'. అంతే కదా!

కవిత్వంతో పాటు కార్యాచరణ ముఖ్యమే:

ప్రస్తుతం మనం సెకండ్ ఫేజ్ గ్లోబలైజేషన్ లో ఉన్నాం. ఐఫోన్ కోసం వీర్యం అమ్ముకోవడం.. ఇంకేదో దానికోసం కిడ్నీ అమ్ముకోవడం.. హత్యలు చేయడం.. జరుగుతున్న దశలో ఉన్నాం. ఇలాంటప్పుడు ఒక్క కవిత్వమే వస్తే సరిపోదు.. దానికి తగ్గ కార్యాచరణ కూడా కావాలె.

గ్లోబలైజేషన్ పరిణామాలే.. ఇవాళ తెలంగాణలో ఓపెన్ కాస్ట్ లు.

గ్లోబలైజేషన్ పరిణామాలే.. ఇవాళ తెలంగాణలో ఓపెన్ కాస్ట్ లు.

కొత్త రాష్ట్రంంలోను కొత్త ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతులు వచ్చాయి. దీన్నెట్లా చూడాలె?

ఇదే ప్రశ్న 2014, జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు నేను ప్రశ్నించిన. అయ్యా తెలంగాణ వచ్చింది. ఇకనైనా బొందలుగడ్డులు ఆగుతయా? అని సోషల్ మీడియాలో నేను అడిగిన ప్రశ్న ఇప్పటికీ మీరు చూడవచ్చు.

అయితే కొత్త రాష్ట్రమైనా.. ఇంకోటైనా.. రాజ్యం తీరు మాత్రం మారదనేది దీనితోని స్పష్టమవుతున్నది.

మీ మూడో కవితా సంపుటి గ్లోబలి ప్రపంచీకరణ గురించి రాశారు..

ప్రపంచీకరణ వెంట పరిగెడుతున్న మనదేశం..

దేశీ ఉత్పత్తిని, దేశీ నైపుణ్యతను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు?

నిజమే.. దేశీ ఉత్పత్తులకు, నైపుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఇవాళ స్కిల్ ఇండియా ఎందుకు? మనమొకటి గమనించాలె.. కుల వృత్తులు వేరు.. కులమనే భావజాలం వేరు.. కులవృత్తి బువ్వ పెడుతది.. అలాంటి కులవృత్తులు ఇవాళ కానరాకుండా పోయినయ్..

అందుకే గ్లోబలిలో ఓ కవిత రాసిన..

నెత్తురు కాల్వలు

వృత్తుల హత్యలు

చెరచబడ్డ చెమట చుక్కలు

కోల్పోవడమే బ్రతుకా?

మనదేశంలో కుల నిర్మూలనకు బదులు కులవృత్తుల నిర్మూలన జరిగింది. అందుకే కావాల్సింది స్కిల్ ఇండియా కాదు.. ఫెడరేషన్స్. కులవృత్తులు ఉండాలనుకోవడం కులాన్ని స్థిరీకరించడం కాదు. నిన్ను అమాంతం మింగేసే టెక్నాలజీ ఎన్నటికీ మంచిది కాదు. ఇదే విషయాన్ని గ్లోబలి లో చెప్పిన. అంతశోధన-ఆకలి కవిత్వమది.

రింగ్ రోడ్డు అక్కడి జీవితాలను మింగేస్తుంటే.. అప్పుడో కవిత రాసిన..

'మునుపిక్కడ భూములు ఉండేవి

ఇప్పుడిక్కడ శవాలు గుట్టలు ఉంటున్నయి

రోడ్డు ఊరును మింగి బరియల్ గ్రౌండ్..'

షాడో కవితా సంపుటి గురించి:

ప్రతి మనిషిలోను ఓ ఫిలాసఫికల్ అప్రోచ్ ఉంటుంది. హేతువుకు తత్వం ఉండాలె. తత్వానికి హేతువు ఉండాలె. అన్నింటికంటే మించి మనిషి తత్వాన్ని నేను ప్రేమిస్తా. అది లేకుండా మనిషిని మార్చడం జరగని పని.

మనం పరిగెడుతుంటే.. మనకు తెలియకుండానే మన వెనుకాల ఓ షాడో మనల్ని ఫాలో అవుతుంటుంది. అది నీలో అంతర్లీనంగా ఉన్నదే కావచ్చు.. అదే 'షాడో' కవిత్వం. 'బొడ్డురాయి' పేరుతో సాహిత్య విమర్శనా వ్యాసాలు కూడా రాశాను.

ఇక 'సమూహం' నా సంపాదకత్వంలో వచ్చిన తొలి బీసీ కవితా సంపుటి. బుక్ ఫెయిర్ సందర్బంగా దీని ఆవిష్కరణ జరిగింది.

ప్రస్తుతం నిర్వర్తిస్తున్న బాధ్యతలు:

ప్రస్తుతం నిర్వర్తిస్తున్న బాధ్యతలు:

బీసీ రైటర్స్ వింగ్ ఫౌండర్

బీసీ స్టడీ ఫోరం కన్వీనర్-కాకతీయ యూనివర్సిటీ

అలాగే.. 15ఏళ్ల నుంచి నవసమాజ సేవాసమితి అనే సంస్థ ద్వారా సామాజిక చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఇకముందు కూడా కొనసాగుతది.

ఇందులో చేరడానికి ఓ క్వాలిఫికేషన్ పెట్టినం. ఇంతకుముందు డిగ్రీ, ఇప్పుడు దాన్ని పీజీకి పొడగించినం.. ఇట్లనైనా యువత చదువు పట్ల ఆసక్తి చూపిస్తరనే ప్రయత్నమిది. నవసమాజ సేవాసమితి ద్వారా శివనగర్ లాంటి ఏరియాల్లో గుడుంబా కార్యకలాపాల మీద పెద్ద యుద్దమే చేసినం.

25-35ఏళ్ల వయసున్న కొన్ని వందలమంది యువకులు గుడుంబాకు బానిసై చనిపోయిన్రు. ఎంత దారుణమిది. కేవలం గోడల మీద నినాదాలతో ఇలాంటివాటిని ఆపే కాలం కాదు.కాబట్టి ప్రత్యక్ష పోరాటంలోకి దిగినం. గుడుంబా వల్ల వితంతువులుగా మారిన మహిళలు ముందుపడి ఈ ఉద్యమాన్ని నడిపించిన్రు.

మొన్నటికి మొన్న.. హన్మకొండ జిల్లాను వరంగల్ ను వేరుచేస్తే.. దాని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినం. ప్రభుత్వం కూడా మా పోరాటంతో నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది.

చివరగా మీదైన మాట.. ఏదైనా..

అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా.. బీసీ, ఎస్సీ, మైనారిటీ అన్న తేడా లేకుండా అందరిని కలుపుకుని ముందుకుపోవాలె అన్న ప్రయత్నంలో ఉన్నాం. ఈ 'బీసీ' 'ఎస్సీ' 'మైనారిటీ' అన్న పదాలు కూడా కేవలం టెర్మినాలజీ కోసమే. అణగారినోళ్లకు అన్నం పెట్టాలన్నదే అంతిమ లక్ష్యం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Its a interview of Chintam Praveen Kumar who is a well known scholar and telangana poet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more