వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతపట్ల క్విక్ బాక్సింగ్: బుద్ధీ-జ్ఞానమూ

|
Google Oneindia TeluguNews

అసలు ఈ లోకమనగానేమి? అంటే కొందరు ఇదని, కొందరు అదని అందరూ రకరకాలుగా విప్పి చెప్తారు గానీ చెప్పడానికే ముందసలు? ఈ లోకంలో ఏమీ లేదు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం తప్ప. ఇదో పెద్ద ‘క్విడ్‌ప్రోకో' . ఇంకా కొంచెం లోతుకి ములిగితే యిక్కడేముంది. అన్నీ అంతా కొనడమూ అమ్మడమే!

మాల్లో వస్తువులు కొంటాం.. బళ్లో చదువులు కొంటాం.. గుళ్లో పుణ్యం కొంటాం.. ఆస్పత్రిలో ఆరోగ్యం కొంటాం.. హోటళ్లో ఇడ్లీ సాంబార్ కొంటాం. అవసరమైతే మనుషుల్ని కొంటాం. చుట్టాల్నీ పక్కాల్నీ స్నేహితుల్నీ మనుషుల మధ్య సంబంధాల్నీ కొంటాం అన్ని కొంటమే. కొంటం కోసం అమ్మటమే. అమ్మడం కొనడం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం యింతేగదా లోకం ఎంత నలగొట్టినా ఎంత సాగదీసినా ఎంత కరగబోసినా!

అనగనగా ఓ పురానా జమానాలో ఓ రాజ్యెం వుండేది. రాజ్యమన్నాక దానికో రాజూ ఆ రాజుకో కొడుకూ వుండేవాడు. ఆ రాజుగారి కొడుక్కి కష్టమంటే ఏమిటో తెలీదు. మహల్లోనించి కాలు బయట పెట్టకుండా అన్నీ సమకూర్చార్రాజావారు. ఎక్కడానికి ఏనుగులూ, ఈదడానికి సరస్సులూ, ధారళంగా గాలి పీలవడానికి ఉద్యానవనాలూ వాటిల్లో లేళ్లూనెమళ్లూ.. చదువు చెప్పడానికి పంతుళ్లు అన్ని అమర్చారు. ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులోనే ముచ్చటగా వుంటుంది గనుక రాజావారి కొడుకు అబ్బాయి కనక ఓ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పెళ్లయ్యేక చిన్న రాజావారికి ఓ బుల్లి రాజావారు పుట్టారు. ఇంకేం అంతా సాఫీగా సజావుగా అవుటర్ రింగురోడ్డు మీద స్పోర్ట్స్ బైక్‌లా సాగిపోతున్నది. అయితేనేం కాకపోతేనేం చిన్న రాజావారికి వున్నట్టుండి లోకానికి సంబంధించి కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. పంతుళ్లు తనకి చెప్పిన చదువు వొట్టి చదువేగాని జ్ఞానమనేది కానేకాదని, జ్ఞానమనేదే లేనివాడు మనిషనే వాడు కానేకాదని వో అర్ధరాత్రి పూట కోట గుమ్మంలోంచైతే దొరికి పోతామని దొడ్డిదారిన కోటగోడ దూకేశాడు.

Chintapatla Quick Boxing on intelligence

జ్ఞానం కోసం లోకమనగా నేమిటో తెల్సుకోవడం కోసం లోకమనేదానికి నిజమైన చదువేమిటో చెప్పడం కోసం కాళ్లు అరిగేట్టు తిరిగి తిరిగి ‘టైరై' పోయి ఓ పెద్ద చెట్టు కింద కూలబడ్డాడు. ఆ చెట్టు నీడో అది విసిరిన గాలో కానీ చిన్న రాజా వారికి జ్ఞానోదయం అవనే అయ్యింది. అది అట్లాంటిట్లాంటి జ్ఞానం కాదు కొన్నాళ్లకి లోకమంతా ‘స్ప్రెడ్' అయిపోయింది.

అస్సలు అదీ జ్ఞానమంటే. అసలా జ్ఞానమే వుంటే లోకమంటే ఏమిటన్నది పూర్తిగా తెల్లగా తేటమవుతుంది. జ్ఞానమనే రెండక్షరాల పదం చాలా బరువైనదీ ఎంతో భారమైనదీ లోతైనదీ అంతుచిక్కనిదీ అంతులేనిదీ!

పురానా జమానాని వొదిలేసి నయా జమానాలో అడుగేద్దాం. జ్ఞానమనే మాట ఈ రోజుల్లోనూ వినపడేమాటే. జ్ఞానమంటే బుద్ధి అని కూడా కొందరు తర్జుమా చేయడమూ వినపడేదే. జ్ఞానమో, బుద్ధో కానీ ఈ మాటలు మరీ చిక్కుముళ్లల్లా తయారయ్యేయి మనుషుల బయోగ్రఫీల్లో.

ఏ అబ్బాయైతేనేం ఆ అబ్బాయికి ఐదో ఆరేళ్లో వచ్చినప్పట్నించీ మొదలవుతుంది ఈ కఠిన పదాల ప్రయోగం. తండ్రయితేనేం తల్లయితేనేం ‘కోపం' అనేదాని యొక్క ఏకైక లక్షణం ‘కోపమే' కదా. అదొచ్చినప్పుడు వాళ్లు వాడే మాటలేయివి. ‘వెధవా బుద్ధి లేదూ'తో మొదలయ్యి పదేళ్లోచ్చినవి దాటినవి అయినా వెధవకి బుద్ధి రాలేదు జ్ఞానం లేదు అన్న మాటల్తో అబ్బాయి నుదురు బొప్పి కడుతుంది. మైండు బ్లాకవడమే కాదు బ్లాంకు కూడా అయిపోతుంది.

ఇంట్లోనే ఈ గోల అనుకోవద్దు. స్కూళ్లో టీచర్లూ విరివిగా విచ్చలవిడిగా వాడేస్తుంటారు. హోంవర్కు చెయ్యకపోతే ‘బుద్ధిలేదు' అంటారు. అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పలేక ‘వాటర్' నములుతుంటే ‘జ్ఞానం లేదు' అంటారు. ఇంటాబయటా ఎక్కడ చూసినా బుద్ధీ జ్ఞానమూ లేదనే వారే కాని బుద్ధి అంటే ఏమిటో జ్ఞానమంటే ఏమిటో సెలవిచ్చేవారు కనపడనే పడరు. తెలుగును తెలుగులో చెప్పే పంతుళ్లు, ఇంగ్లీషును తెలుగులో చెప్పే పంతుళ్లూ, చరిత్రా భూగోళమూ సైన్సూ చెప్పే పంతుళ్లూ, లెక్కల్తో డొక్కల్చింపేసే పంతుళ్లూ వుంటారు కానీ బుద్ధీ జ్ఞానమూ చెప్పడానికి ఒక్క పంతులు కూడా వుండడు.

అబ్బాయి యువకుడయినా కూడా ఈ బుద్ధీ జ్ఞానం జాడ తెలవకుండా వుండి పోద్ది. బళ్లో లాగానే కాలేజీలో కూడా ఇంగ్లీషూ సంస్కృతమూ లెక్కలూ సైన్సూ అమ్ముతారు కానీ బుద్ధి జ్ఞానం మాత్రం అమ్మరు గాక అమ్మరు. బాగా రాచిరంపాన పెట్టి బుర్ర చింపి ఫార్మూలాలు కుక్కి బట్టీ పెట్టించి కాల్చి ర్యాంకులు తెప్పించే వారే కానీ బుద్ధి జ్ఞానమూ చెప్పేవారు వుండరు. ఉన్నటైమంతా హుటాహుటిగా పోటాపోటీగా ర్యాంకుల రణక్షేత్రంగా కౌన్సిలింగుల కురుక్షేత్రంగా గడచిపోతుంది.

చూడగా చూడగా చించగా ఆలోచించగా అర్థమయ్యేదేవిటంటే చదువుకీ బుద్ధీ జ్ఞానాలకీ ఆట్టే సంబంధం లేదని. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గానీ హీనుడవగుణంబు మానలేడు అన్నాడో కవి. చెట్టు కింద జ్ఞానోదయం సాధించిన చిన్న రాజావారు చదువంటే నాలుగ్గోడల మధ్య ఘోష కాదని ఈలోకమనేదే ఒక పెద్ద పాఠశాల అనీ మనిషి అనుభవాలే పాఠాలనీ తెల్సుకున్నాడు. అంచేతే చెడుమార్గం నుంచి మంచి మార్గంలోకి నడవాలనీ, చీకట్లోంచి వెలుతురులోకి ప్రయాణించమనీ అన్నారు.

మనిషిలోపల వున్న మృగాన్ని, రాక్షసుణ్ణీ బయటకు తరిమి సత్యం, ధర్మం, కరుణ, ప్రేమ, సమసత్వం వంటి మానవ విలువల్ని మేల్కొలిపే జ్ఞానం కానీ బుద్ధి కానీ ఎవరూ అమ్మడం లేదు అరువివ్వడం లేదు ఉచిత బోధన అంతకంటే లేదు. అందువల్లే టీవీలో ‘నేరాలు ఘోరాలు', ‘క్రైం' వంటి ప్రోగ్రాంలకి కావాల్సినంత మేటర్. పుస్తకాల్లో మ్యాటర్నీ మనుషుల్లో బలవంతంగా కూరే గురువులు వున్నారు గనకే ఓల్డేజి హోమ్‌లు! తల్లిదండ్రుల్ని గాల్లో వదిలేసి వెళ్లిపోయే ఎన్‌ఆర్ఐ! వావి వరుసలు వదిలేసే వికృతపు చేష్టలు!

లోకంలో ఎంటరయిన్నాట్నించి ఎగ్జిట్ అయ్యేదాకా ‘ఏళ్లోచ్చేయ్ ఏం లాభం బుద్ధీ జ్ఞానం లేదు' అని అనిపించుకొని ‘చదువుకోవాల్సిందే' కానీ కొనాల్సింది కాదు!!

- చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his quick boxing writes about intelligence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X