వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతపట్ల క్విక్‌బాక్సింగ్: ‘ది ఎలిఫెంట్ గాడ్’

|
Google Oneindia TeluguNews

కర్ర పుల్లల్తో గీకారు. గోళ్లతో గోకారు. కొమ్ముల్తో పొడిచారు. అప్పుడు కానీ నిద్దర్లేవ లేదు ఆదమరచి నిద్దరోతున్న ఏనుగు.

ఎవర్రా మీరు నన్ను గీరీ గిచ్చి పొడిచీ చావగొడ్తున్నారు అంది ఏనుగు.

లే లే! మేం ప్రమధ గణాలం. శివుని భక్తులం అన్నారు ఏనుగుని నిద్దరేపిన వాళ్లు.

మీరెవరైతే నాకేం కానీ హాయిగా నిద్దరోతున్న నన్ను లేపడానికి మీ కేం హక్కుంది? అని ప్రశ్నించింది బలవంతంగా నిద్రలేచిన గజరాజు.

అవసరమం మాది! మిమ్మల్ని లేపి మీ తలని తెగనరికి తెమ్మన్నాడు మా బాస్ శివుడు. లేచి రడీ అయిపోండి అన్నారు ప్రమధగణాల్లో ఇంపార్టెంట్ వ్యక్తులు.

లేవడమేంటి! రడీ అయి పోవడం దేనికి. నాకేం అర్థం అవడం లేదు అన్నది నిద్రమత్తు వదిలిన ఏనుగు.

Chintapatla quick boxing: The elephant God

తమరు ఏనుగే! అయితేనేం దక్షిణం వైపు తలాపు వుంచి నిద్ర పోయేరు కాబట్టి మిమ్మల్ని అంటే మీ తలని తీసుకురావాలని శివుడి ఆజ్ఞ అన్నాడో శివ భక్తుడు.

నా తలా? అంది ఆశ్చర్యపడుతూ యేనుగు.

అవును మీ తలే. మాకిప్పుడు అర్జంటు. కాస్సేపు కళ్లు మూసుకుంటే మీ హెడ్‌ని మీ బాడీ నించి సెపరేట్ చేసి తీసుకుపోతాం అన్నాడు నంది.

అవునవును అని వంతపాడారు తక్కిన వాళ్లు.

నో! నెవర్! వీల్లేదు గాక వీల్లేదు. నా తలని నరుక్కు వెళ్లే అధికారం మీకెవరిచ్చారు? అని ప్రశ్నించింది ఏనుగు.

మీ బాస్ విష్ణువే అన్నారు కొందరు. దేవతలం ఆ దేవ దేవుడి మాట కాదనగలమా అన్నారు కొందరు.

హాయిగా ప్రశాంతంగా నా మానాన నేను నిద్రపోతుంటే నా తల నరికి యివ్వమన్న దెవరు? అని ప్రశ్నించాడు ఏనుగు.

పిచ్చివాడా! ఈ లోకంలోని చరాచర వస్తువులన్నీ ఆ పరమేశ్వరుడి స్వంత ఆస్తే. నువ్వు వస్తావా రావా అనడిగారు ప్రమధగణాలు.

నేను రాను. రాను గాక రాను. నా తల మీద నాకు వుంటుంది కాని హక్కు శివుడికీ మీకూ ఎక్కడిదని మొరాయించాడు గజడనగా యేనుగు.

లాభం లేదు. నీ దంతా ‘లాస్ ఆఫ్ మెమరీ' అనుకుంటా. ఒక్కసారి ఈ ‘ఏపిల్ ట్యాబ్'లో చూడు అంతా అర్థమయిపోతుంది అన్నాడు ప్రమధ గణాల ప్రతినిధి.

అప్పుడు కన్పించింది ఏనుక్కి గతం క్లియర్‌గా.

గజాసురుడు అనే పేరున్న ఓ రాక్షసురుడు శివుడి కోసం యమ ఘోరమే కాదు బీభత్సంగా తపస్సు చేశాడు.

శివుడు ప్రత్యక్షమయ్యేడు. గజాసురుడు శివుణ్ణి తన స్టమక్‌లో సెటిలవ్వాలని అడిగాడు. ప్రత్యక్షమయ్యాక తప్పదు గదా అని శివుడు గజాసురుడి పొట్టలో దూరాడు. పార్వతికి మొగుడు ఎక్కడికి వెళ్లేడో చెప్పలేదు గనక తెగ టెన్షన్ పడి, విష్ణుమూర్తి దగ్గరికొచ్చి గోడుగోడునా తన గోడు వినిపించింది.

అప్పుడు విష్ణువు తన స్టాఫ్‌తో కదిలివొచ్చేడు భూమ్మీదకి. వస్తూ వస్తూ నందిని డ్యాన్సులో ట్రెయినింగ్ యిచ్చి తోలు కొచ్చేడు గజాసురుడి దగ్గరకి.

గజాసురుడు గంగిరెద్దు డ్యున్సుకి ఫ్లాటయ్యేడు. ఎద్దు నాడించేవాడి మేకప్‌లో వున్న విష్ణునడిగేడు ఏం కావాలని?

అప్పుడు బయటపడ్డాడు విష్ణువు. నీ స్టమక్‌లో వున్న శివుడి కోసం వచ్చామని.

ఆడిన మాట తప్పని గజాసురుడు నంది కొమ్ముల్తో పొట్ట చీల్పించుకుని శివుణ్ణి రిలీజ్ చేశాడు. అట్లా రిలీజు చేస్తున్న సమయంలో తన తలని లోకాలన్నీ పూజ చేయాలని, తన చర్మాన్ని శివుడు లుంగీలా చుట్టుకోవాలనీ కోరాడు.

గతం అంతా ట్యాబ్‌లో క్లియర్‌గా కన్పించి గతుక్కుమన్నాడు గజాసురుడు.

నాకు ఈ ఎలిఫెంట్ లైఫ్ బానే వుంది. ఇప్పుడింత అర్జంటుగా నా ‘హెడ్'తో ఏం పని పడింది శివుడికి అనడిగాడు గజాసురుడు.

అదంతా మళ్లీ చూడు అంటూ ట్యాబ్ వోపిన్ చేశారు ప్రమధులు.

గజాసురుడి తల కోసం వాళ్లు రావడానికి ముందు జరిగిన స్టోరీ స్క్రీన్ మీద కనపడింది.

శివుడు గజాసురుడి కడుపులోంచి బయట పడ్డాక కైలాసంకేసి మందీ మార్బలంతో వచ్చాడు. అప్పటికే ఆయన వస్తున్నాడన్న న్యూస్ విని, సంతోషంతో స్నానానికి బాత్ రూంలోకి వెళ్తూ ఓ కుర్రాణ్ణి పసుపుతో మేకించి ఇంటి ఫ్రంట్ డోర్‌లో కాపలావుంచి వెళ్లింది పార్వతి. ఆ సంగతి తెలీని శివుడు కుర్రాడితో జగడం పెట్టుకుని తలని త్రిశూలంతో నరికేశాడు.

తర్వాత జరిగిన విషయం తెల్సి పార్వతి ఏడుపు లంకించుకుంది. ఆమె దు:ఖాన్ని ఉపశమింప చేయడం కోసం యిది వరకే త్రిలోకాల్లో పూజ్య మవ్వాలని కోరిన నీ తలని నరికి గోనె సంచీలో పెట్టుకుపోవడానికి వచ్చాం అన్నారు ప్రమధ గణంలోని లీడర్లు.

అప్పుడు జరిగిందంతా గుర్తుకు వచ్చి గజాసురుడు తన తలని తెగ నరుక్కుపోవాల్సిందని, తన చర్మాన్ని ఒలుచుకుపోవాల్సిందని వాళ్లని బ్రతిమాలేడు.

ఇంకేం వుంది. తల తెగి పడిన బాలుడి శరీరానికి ఏనుగు తల అతికించబడ్డది.

ఆయనే వినాయకుడు. ఆయన్ను పూజించి కానీ ఎవరైనా ఏ పనైనా చెయ్యడానికి వీలు లేదు.

ఇదీ హిందూ పురాణాల్లో ఎలిఫెంట్ గాడ్ జననం జరిగిన తీరు. చవితి నాడు చంద్రుడ్ని చూసిన వాళ్లకి నీలాపనిందలు కలక్కుండా వుండాలంటే ఈ కథ చెప్పుకుని నాలుగు అక్షింతలు నెత్తిన వేసుకుంటే సరి. నో ఫియర్.. ఐయాం హియర్ అంటాడు ది ఎలిఫెంట్ గాడ్!

- చింతపట్ల సుదర్శన్

English summary
A prominent columnist and Telugu writer Chintapatla Sudarshan in his quick boxing wrote about God of Ganesha in the eve of Vinayaka Chavithi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X