వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్విక్‌బాక్సింగ్: చిలకా క్షేమమా?

|
Google Oneindia TeluguNews

అదో చెట్టు.. ఆ చెట్టు కింద వో అరుగు. అరుగు మీద ఓ చాప. చాప మీద ఓ పంజరం ఆ పంజరంలో అట్నించిటు ఇట్నుంచటు తిరుగాడే ఓ చిలక పచ్చని చిలక దాని ముక్కు ఎరుపు. పంజరాన్ని ఆనుకుని కూచున్న మనిషి కట్టుకున్నది ధోవతీ. వేసుకున్నది పొడుగు చేతుల చొక్కా పెట్టుకున్నది ముఖం మీద మూడు విబూది రేకలు వాటి మధ్య వున్న బొట్టు ఎరుపు. పంజరానికెదురు గుండా వుంది అట్ట ముక్కల దొంతర. ఆ అట్టముక్కల్లో వున్నది దేవుళ్లు. వెంకటేశ్వరుడేమి, విష్ణుమూర్తేమి, లచ్చిందేవేమి, కృష్ణుడేమి రాముడేమి ముక్కోటి దేవతల్లో ముఖ్యమైన వాళ్లందరూ వున్నారు.

తలకు మాసినవాడు, తల్లో జుట్టులేని వాడు, ముఖంనిండా గడ్డమున్నవాడు, పాత పంచె చుట్టుకున్నోడు అక్కడక్కడా చిరుగుల పట్లాము తొడుక్కున్నాడు. ఏ వేషమయితేనేం ఏ మనిషయితేనేం అందరూ ముఖం వేళ్లాడేసుకుని వచ్చే వాళ్లే. అందరి ముఖాల్లోనూ క్వశ్చన్ మార్కులే.

చిలక చెప్పే ఫ్యూచర్ కోసం వచ్చే వాళ్లందరి ముఖాల్లోనూ ముందు అనగాముందు ముందు యేం జరగబోతున్నదో తెల్సుకోవాలనే ఆరాటమే. ఇప్పుడున్న దరిద్రం యిలాగే కంటిన్యూ అయిద్దా లేక ఏ పగలో రాత్రో లచ్చిందేవి విష్ణుమూర్తిని వదిలేసి తమ ఇళ్లల్లోకి వచ్చిద్దా అని తెల్సుకోవాలనే ఆరాటమే. ఈ జలుబూ జబ్బూ తుమ్ము దగ్గూ ఆయాసమూ ఎంత కాలం పీడిస్తయి ఎప్పుడు వొదిలేసి వెళ్లిపోతయి అని తెల్సుకోవాలనే ఆరాటమే. ఇంకా ఇలాంటి ఆరాటాలనేకమే.

Quick boxing story on Astrology

ఈ ఆరాటాలకి జవాబు చిలక. చిలక ముక్కులోంచి జాంపండు జారవిడిచి పంజరం లోంచి వొయ్యరంగా తోకెత్తి నడిచొచ్చి సాపుగా పరచిన అట్ట ముక్కల్లోంచి ఏదో ఓటి ముక్కుతో ఏదో ఓ దేవుడ్నో దేవతనో పైకి లేపి తన బాస్‌కి అందించి పంజరంలోకి ‘రిట్రీట్' అయిపోతుంది.

బొమ్మలో దేవుడ్ని ఎగాదిగా చూసి కళ్లు మూసుకుని ధ్యానం చేసి ఆరాట పడేవాళ్లకి ఊరట కలిగించే విధంగా జోస్యం చెప్పడం చిలక జ్యోతిష్కుడికి పొట్టతో వచ్చిన విద్య. ముఖాలను చదవడమే అతను నేర్పిన విద్యా.

కూటి కోసం కోటి విద్యల్లో ఒక్కటైన ఆ విద్య యిప్పుడు కనిపించడం మానేసింది. అన్ని రంగాల్లో మార్పువచ్చినట్టే ఆ రంగమూ కొత్త వీరంగం చేస్తున్నది. ఇప్పుడు చెట్టూ లేదు చెట్టు కింద అరుగూ లేదు. అరుగు మీద చాప చాప మీద పంజరంలో చిలకా ఆ పక్కన ముఖాన విబూది రేకల జ్యోతిష్యుడు హాంఫట్!

కట్ చేస్తే టీవీ. టీవీలో ఛానల్ ఛానల్‌లో జ్యోతిష్యుడు. ధోవతీ వుంది పొడుగు చేతుల చొక్కా వుంది. ముఖాన తెల్లగీతాల మధ్య ముద్దొచ్చే ఎర్రబొట్టూ వుంది. కానీ పంజరంలో చిలక ఎగిరిపోయింది. అట్ట ముక్కల్లో దేవతలు బ్రతుకు దేముడా అని పరారై పోయేరు. ఇప్పుడు పంజరం వుండాల్సిన చోట కంప్యూటర్ వెలుగులు విరజిమ్ముతూ కూచుంది. మరో పక్క చక్కని చుక్క చిరునవ్వులు విసిరేస్తూ కూచుంది.

ఇప్పుడు జ్యోతిష్యుడు ముఖం చదవడం మానేశాడు. శబ్ద గ్రహణ విద్య నేర్చాడు. ఫోన్‌లో ప్రశ్నలు వినపడ్తియి. వినపడ్డ ప్రశ్నలకు జవాబులు వివరంగా చెప్పబడ్తాయి. ఛానళ్లతోపాటు జ్యోతిష్కుల్తో బాటు మొబైళ్లు పొట్ట కూడా నిండాలి కదా.

ఒక పట్టాన లైను దొరకదు. దొరికితే అడిగేవాడి పంట పండినట్టే. చెప్పేవాడి జేబు నిండేనట్టే.

హలో.. హలో..

చెప్పండి స్వామివారు వింటున్నారు.. అని ముసిముసి నవ్వులు విసిరేస్తుంది చిన్నది.

అబ్భా! ఎన్నాళ్లకి దొరికింది స్వామీ లైను. ఎన్ని రోజుల్నించి ‘ట్రై' చేస్తున్నాను స్వామీ అని తీగల్లేని వార్తా ప్రయాణానికి ఆ కొసనున్నవాడు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోతాడు.

అడగండి.. అడగండి అని తొందర పెడ్తుంది చిలక కాని చిలక జ్యోతిష్కుడికీ ఆరాటపడే వాడికీ మధ్య లింకు.

‘మీ పేరేమిటి?' అనడుగుతాడు స్వామి. చచ్చీ చెడీ, లైను పట్టేసినవాడు చెప్పాడు.

ఎప్పుడు పుట్టారు? అనడుగుతాడు స్వామి.

గుర్తున్నవాడు తేదీ చెప్తాడు. ఆ టైంలో ఆకాశంలో ఏ నక్షత్రం డ్యూటీలో వున్నది అడుగుతాడు స్వామి. గుర్తున్నవాడు అదీ చెప్తాడు. ఏదీ గుర్తులేకపోయినా ఫర్లేదు.. ఒకటి నుండి తొంబయి వరకు వున్న నంబర్లల్లో ఒకటి చెప్తే చాలంటాడు స్వామి. అట్టముక్కల్లే పోతేనేం యిక్కడా యిష్టదైవమే ఇంపార్టెంట్ అదీ అడుగుతాడు స్వామి. అప్పుడు మొదలవుతుంది రేపేం జరగబోతున్నదీ చెప్పడం.

అడిగే వాడిది అదే ఆరాటం. అందరూ మోసం చేసే వాళ్లే ఎవర్ని నమ్మాలో తెలీడం లేదు, ఉద్యోగం లేదు, చదువు రావడం లేదు, పెళ్లి కావడం లేదు, ఆరోగ్యం వుండి చావడం లేదు, ఆస్తి వస్తుందా లేదా? విదేశాలకి వెళ్తానా లేదా? ప్రశ్నలు.. ప్రశ్నలు.. అవే ప్రశ్నలు అదే ఆరాటం. ముందు.. ముందు.. ముందు.. ఏం జరుగుతుంది ముందు?

జవాబులు.. జవాబులు.. అవే జవాబులు. అంతా మంచే జరుగుతుంది. ముందు.. ముందు. ఇప్పుడేమంత బాగాలేదు. శని ఎక్కడుండ కూడదో అక్కడ కూచుని తీరిగ్గా చెవిలో పుల్లతో కెలుకుతున్నాడు. కుజుడు ఏదో ఇంట్లో కూచుని ఖాళీ చెయ్యనంటున్నాడు. గురుడు గడ్డం దువ్వుకుంటూ బిజీగా వుంటం వొల్ల ఏ ఇంట్లోకి, ప్రవేశించాలో ఆ ఇంట్లో ప్రవేశించకుండా ‘డిలే' చేస్తున్నాడు.

అడిగిన వాడి ముఖం వాచిపోతుంది. గుండెజారి గల్లంతయి పోతుంది. అయితే టీవీలో కనిపించదు. అయితే కనిపించే చెప్పేవాడు ఆ పక్కన వున్న యాంకరి నవ్వడం మానరు. అడిగేవాడికి చెప్పేవాడు ఉత్సాహంగా పరిస్థితులు చక్క బడటానికి పరిహారం చెప్తాడు. సొల్యూషన్ చెప్తాడు. కొబ్బరికాయలు కొట్టమంటాడు. నెయ్యి దీపాలు వెలిగించమంటాడు. ఆవుకు తినిపించమంటాడు. ఇష్టదైవం దూరంగా వుంటే దగ్గర్లో వున్న దేవుణ్ణే యిష్టదైవంగా సెటిల్ చేసుకుని ప్రదక్షిణాలు చెయ్యమంటాడు. ఆరు వారాలు, నలభై రోజులు, ఎనభై ఆరు రోజులు టైం యిస్తాడు. లచ్చిందేవి రావడానికి, పోస్టింగ్ అవడానికి, మ్యారేజి సెటిలవడానికి సంతానం కెవ్వుమని యేడవడానికి వంట్లో జబ్బు పత్తా లేకుండా పోడానికి.

ముందేం జరగబోతున్నదో తెల్సుకోవాలనే ఆరాటం మనిషిలో ఎప్పుడుపుట్టిందో కానీ దానికి మాత్రం చావు అనేదే లేదు. జ్యోతిషం శాస్త్రం అయితే అయివుండచ్చు. గ్రహాల ప్రభావం మనిషి మీద వుంటే వుండచ్చు. కానీ మనిషిలోని ఈ ఆరాటాన్ని ఒక నయంకాని జబ్బుని చేసి డబ్బు చేసుకునే వాళ్లెందరో! దీన్ని ఓ కార్పొరేట్ బిజినెస్‌ని చేసి అడిగేవాడికి లచ్చిందేవి అడ్రస్ యివ్వకుండా తమ విజిటింగ్ కార్డులిచ్చుకునే వాళ్లెందరో!

స్టోన్ శాస్త్రం, ఫింగర్‌లో రింగు శాస్త్రం, అంకెల్లో అదృష్ట శాస్త్రం, పేర్లల్లో రిపేరు శాస్త్రం ధనరాశులు కురిపించే యంత్రం అర్ధరాత్రి అదృష్టం తలుపు బాదే యంత్రం.. బ్రతుకు బండిని రిపేరు చెయ్యడానికి లేనివంటూ లేవు.

చిలక లేకుండానే చిలక జ్యోతిష్యం టీవీల్లో దిన దినాభివృద్ధిగా వర్ధిల్లుతోంది.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about the Astrology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X