వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతపట్ల క్విక్‌ బాక్సింగ్: దొరికితే దొంగలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Quick Boxing: story of theives
ఈ లోకంలో ఎవరెవరు ఉంటారు? అని పోలీసుల్ని అడగండి.

ఇంకెవరు? దొంగలే అంటారు పోలీసులు.

ఈ లోకంలో ఎవరెవరు ఉంటారు? అని దొంగల్ని అడగండి.

ఇంకెవరు? పోలీసులే అంటారు దొంగలు.

ఎవరేం అంటేనేం. లోకం వున్నంత కాలం పోలీసులూ పోలీసులున్నంత కాలం దొంగలూ వుంటారు. ఒక లీడరు నేను లీడర్నని గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు దొంగ నేనొక దొంగనని సగర్వంగా తల ఎత్తుకుని ఎందుకు చెప్పకూడదు తలదించుకునే ఆ రోజులు చెల్లిపోయినయి అంటున్నాడు. ఈ రోజుల్లో దొరలందరూ దొంగలవునో కాదు కానీ దొంగలందరూ దొరలయి పోతున్నారన్న మాట నిజమే కాదు పచ్చినిజం కూడా!

కాలచక్ర మనబడే జెయింట్ వీల్ ‘బ్రేక్' తీసుకోకుండా తిరుగుతున్నందున్న అన్ని వృత్తుల్లోనూ మార్పు వచ్చినట్టే దొంగలకూ ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ వచ్చింది. గజ దొంగ, ఘరానా దొంగల్తోపాటు లేడీ దొంగలు, చైన్ స్నాచర్లు జేబు దొంగల్తోపాటు తాళాలేస్తున్న ఇళ్ల దొంగల్తోపాటు డోర్ బెల్లు కొట్టి వచ్చే దొంగలు, నట్ట నడిరేయి దొంగల్తోపాటు మిట్ట మధ్యాహ్నం దొంగలూ బ్యాంకుల ముందర చిల్లర పారేసుకునే దొంగలూ, మోటర్ల స్కూటర్ల టైర్లు పంచరు చేసే దొంగలూ, ఏటిఎం దొంగలే కాదు ఎనీటైం దొంగలూ ‘పట్టుకో' ‘పట్టుకో'మంటూ పోలీసులని ఆటాడిస్తున్నారు.

కన్ను ముక్కు చెవీ ఇలా పార్టు పార్టు కో డాక్టర్‌లాగా ఒక్కో రకం దొంగ తనానికి స్పెషలిస్టు దొంగలు తయారయ్యేరు. అన్ని వృత్తుల్లోకి లాగానే దొంగల వృత్తిలో కూడా బోలుడు సెంటిమెంట్లు కూడా సెటిలయ్యేయిట.

దొంగలు దొంగలు అనడమే కాని దొంగలెక్కడ అనకండి. న్యూస్ పేపర్ తీసి చూడండి. దొంగల ప్రసక్తి ప్రతిష్ట తెలియచెయ్యని పేపరుందేమో వెదికి చూడండి. పేపర్లోనేనా అని నిట్టూర్చకండి. ఈ దొంగలు తమ డ్యూటీ ఎంత సక్రమంగా సజావుగా డిగ్నిఫైడ్‌గా చేసుకుపోతున్నారో కళ్లారా కనండి.

హల్లో ఏదో చప్పుడవుతోందే అన్నాడు మొగుడూ ఇంటి యజమాని.

వెధవ పిల్లి మళ్లీ వచ్చి వుంటుంది. పడుకుందురూ. పొద్దుట్నించీ చాకిరీ చేసి ఒళ్లు నెప్పుల్తో ఛస్తుంటే అంది పెళ్లామూ ఇంటి ఇల్లాలూ.

నిజంగానే హాల్లో చప్పుడయ్యింది. మళ్లీ మళ్లీ.

మీసాలూ గడ్డలూ వున్నోళ్లు యిద్దరూ బోడిగుడో డొకడు హాలంతా కలయ తిర్గుతున్నాడు. నాకు నిద్దరొస్తున్నది రా. అదే బుద్ధిరా నీకు సెకండ్ షో చూసింతర్వాత కానీ ‘వర్కు స్పాట్'కి రావు అన్నాడొకడు వాడి గడ్డం పిల్లింది మీసం రొయ్యది. గుండుగాడు ఊరుకోబే.. అది నా సెంటిమెంట్. బాగా అచ్చొచ్చిన సెంటిమెంట్ అన్నాడు బుర్ర గోక్కుంటూ.

అల్లా బుర్ర గోక్కోక పోతే ఎదురుగ్గా బెడ్‌రూం కనబడుతున్నది లోపల జొరబడ్తే‌పోలా అన్నాడు మేక గడ్డమూ పెరిగీ పెరగని మీసమూ వున్నవాడు.

తొందరొద్దు. యింకా చాలా టైం వుంది. ముందు భోజనాలు కానిద్దాం అన్నాడు గుండుగాడు ఫ్రిజ్ వైపు అడుగేస్తూ మళ్లీ యిదో సెంటిమెంటీడికి. ఏ కొంపకి కన్నం వేస్తాడో ఆ ఇంట్లో అన్న తిని తీరాలి అన్నాడు పిల్లిగడ్డం.

అవును మరి. ఆ పద్ధతి పాటించడం వల్లే పదేళ్లనించీ ఫీల్డులో వున్నా. హిట్టవుతున్నా నన్నాడు గుండుగాడు.

చప్పుళ్లు విని నిద్దర పట్టలేదు ఇంటి యజమానికి, బలవంతంగా యిల్లాల్ని లేపి బయటికి వచ్చాడు. హాల్లో ముగ్గురు ఆగంతకులనగా స్ట్రేంజర్సనగా నిదివరకెన్నడూ చూసి వుండని శాల్తీల్ని చూసి అదిరిపడి పెద్దగా అరుద్దామనుకున్నాడు. కానీ అతని నోరే అతని మాట వినలేదు. నాలుక మందమయి దవడల మధ్య యిరుక్కు పోయింది.

వచ్చారా! మీకోసమే వెయిటింగిక్కడ. ఏమ్మా ఒంటావార్పు రాదాయేం. ఫ్రిజ్జిలో తిండానికేమీలేవు. గిన్నెలన్నీ బోర్లించావు. నువ్వేం ‘హోంమేకర్‌వమ్మా' అన్నాడు త్రీ తీవ్స్ ఆర్మీ లీడర్ గుండేశ్వర్రావు.

ఎఎఎవరు అంది ఆమె ఆడ మనిషయినా ధైర్యం చేసి. పకా పకా నవ్వారు ముగ్గురు మరాటీలు కాదు దొంగలు.

అర్ధరాత్రి దాటాక కొంపలో జొరబడ్డ కొత్తా ముఖాలని చూసి కూడా పోల్చుకోలేరా ఎవరో! మేం ముగ్గురం దొంగలం ఎందుకొచ్చామో కూడా చెప్పాలా అన్నాడో దొంగ ఎక్కిరింతగా.

నగానట్రా మూటాముల్లే అన్నీ మా బ్యాగుల్లో సర్ది పెడ్దువు గానీ నువ్వేముందు తిండానికేమన్నా పెట్టు అన్నాడు గుండుగాడు.

అన్నం ముట్టకుండ మా బాస్ దొంగతనం చెయ్యడు చెయ్యనివ్వడు అన్నాడొక అనుచరుడు.

ఎలెక్ట్రి పొయ్యిలో అన్నం పడెయ్యి. మా వాడు బెండకాయలు తరగిస్తాడు పోపున పడెయ్యి పెరుగుంది కదా అడ్జస్టయి పోతాం అన్నాడు ఇంకొక అనుచరుడు.

భార్యాభర్తా ముఖాలు చూచుకున్నారు. ఎప్పుడూ చూసుకునే ముఖాలే కదా మేం వేళ్లాక మళ్లీ చూసుకుందురు గానీ ముందు వంటగానీ తొరగా అన్నాడు గుండు బాసు.

సెల్‌ఫోన్ రింగయ్యింది. ఇంటి యజమాని గదిలోకి తొంగిచూశాడు.

అదినీ రింగు కాదు నా రింగు. ఖాన్‌తో గేమ్‌లాడద్దు పోలీసులకి నా పేరు ఖాన్ అని చెప్పేవ్- డైలాగు బాగుందని లాగా అంటూ ఫోన్‌ని చెవికి ఆనించాడు గుండూ భాయ్.

హలో! ఆ చెప్పన్నా! ఏందన్నా! రోకలా? అవును గదన్న? అదేం కొంపన్నా రోకలి కూడా లేదా.. థూ.. సరే పెట్టేయ్ అని యింటి యజమాని వైపు చూశాడు.

మీ ఇంట్లో రోకలుందా.. రోకలి.. యజమాని లేదన్నట్టు తల అడ్డంగా ఆడించాడు.

మాయన్న పక్క లేన్‌లో డ్యూటీ మీదున్నడు. ఆడిదో సెంటిమెంట్. ఏ కొంపలో ఆపరేషన్‌కి పోతే అక్కడ రోకలి పూజ చేస్తాడు. ఇప్పుడా ఇంట్ల రోకలే లేదంట. రోకలి లేకపోతే దొంగతనం చెయ్యడానికి వీల్లేదు. డ్యూటీకి వెళ్లేప్పేడే వో రోకలి చంకనెట్టుకు పోతే పూజకీ బుర్ర బద్దలు కొట్టడానికీ పనికొస్తుందంటే వినడు గదా అన్నాడు గుండూరావు సోఫాలో కూచుని కాళ్లాడిస్తూ.

రోకలి సెంటిమెంటెలా కుదురుద్ది బాసూ ఈ రోజుల్లో రోళ్లూ రోకళ్లూ ఎక్కడున్నయి. ‘మిక్సీ' పూజ చేసుకోమను అని కిసుక్కున నవ్వాడు మేక గడ్డపోడు.

షాప్‌లు దోచుకునే మా బావక్కూడా సెంటిమెంటే. సిసి కెమెరా ముందు నిలబడి ఫొటో సెషన్ చేస్తాడు ఫోజుల మీద ఫోజులిస్తాడు. తర్వాతనే జాబ్ అటెండయితడు అన్నాడు పిల్లిగడ్డపోడు.

ఈ ఇంట్లో ఈ ముగ్గురు దొంగలూ బెండకాయ ఫ్రైతో భోజనం చేశారా లేదా? ఈ ఇంట్లో ఎంత బంగారం, ఎంత క్యాష్ కొట్టేశారు అన్న సంగతులన్నీ తెల్లారేక అన్ని పేపర్లల్లో తెలుస్తయి. మీరే చదూకోండి.

-చింతపట్ల సుదర్శన్

English summary

 Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about the thieves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X