కథ మళ్లీ మొదటికి: ప్రజల చేతుల్లో అంత నగదా... ఎటిఎంలు ఖాళీ....

Written By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ఎటీఎంలు కాదు.. బ్యాంకుల్లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నగదు కొరత వెంటాడుతున్నది. గత ఏడాది నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్లు రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారన్న అభిప్రాయం నెలకొంటున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నగదు కొరత సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

రోజువారీ నగదు డిపాజిట్లు తగ్గడంతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. దీనికి తోడు నెలరోజులుగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) నుంచి రాష్ట్రానికి నగదు రాక ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలు తారాస్థాయికి చేరాయి. రెండు వారాలుగా ఏటీఎం కేంద్రాలు నగదు లేక మూతపడ్డాయి. ఇక బ్యాంకుల్లో ఖాతాదారులు పరిమితంగా నగదు పంపిణీ చేస్తున్నారు.

పేరుకు ఈ నెల 13 నుంచి నగదు విత్‌డ్రాలపై ఆర్‌బీఐ ఆంక్షలు ఎత్తివేయడమైతే ఎత్తేసింది. కానీ బ్యాంకుల్లో నగదు నిల్వలు హరించుకుపోయాయి. ఫలితంగా నగదు కోసం వచ్చే ఖాతాదారులకు బ్యాంకులు మొండిచేయి చూపుతున్నాయి.

ప్రజల వద్ద అంత డబ్బు...

ప్రజల వద్ద అంత డబ్బు...

బ్యాంకుల నుంచి ఖాతాదారుల చేతికి వచ్చిన రూ.2000 విలువైన నోట్లు తిరిగి డిపాజిట్‌ కావడం లేదు. ఇలా సుమారు రూ.20 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు ప్రజల వద్దే ఉండిపోయాయని బ్యాంకర్లు అంటున్నారు. దీంతో నోట్ల చలామణి భారీగా తగ్గింది. మార్కెట్‌లో లావాదేవీలు జరుగుతున్నా బ్యాంకుల్లో డిపాజిట్‌ కాక నగదు కొరత సమస్య తీవ్రమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో ‘లో క్యాష్‌'బోర్డులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు నెలరోజులుగా రాష్ట్రానికి కొత్త నోట్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. అడపాదడపా పంపిణీ చేస్తున్నా డిమాండ్‌కు తగినట్లు లేకపోవడంతో వివిధ బ్యాంకుల శాఖల్లో నగదు కొరత ఏర్పడుతున్నది.

తెలంగాణలో లోటు రూ.35 వేల కోట్లు

తెలంగాణలో లోటు రూ.35 వేల కోట్లు

గత ఏడాది నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలంగాణలో దాదాపు రూ.80 వేల కోట్ల విలువైన రూ.500, రూ.1,000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యాయి. వీటిలో ఇప్పటివరకు ఆర్‌బీఐ కేవలం రూ.45 వేల కోట్లే రాష్ట్రానికి పంపిణీ చేసింది. దీంతో దాదాపు రూ.35 వేల కోట్ల నగదు కొరత ఉత్పన్నమైంది. వివిధ బ్యాంకుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 8,642 ఏటీఎం యంత్రాలు ఉన్నాయి. వాటిలో 977 కేంద్రాల్లోని ఎటిఎం యంత్రాలు ఇప్పటికీ పూర్తిగా పనిచేయడం లేదని ఆయా బ్యాంకుల అధికారులే అంగీకరిస్తున్నారు. మిగతా వాటిలో 90 శాతానికి పైగా ఏటీఎంలలో డబ్బు లేక పోవడంతో వాటి ముందు ‘ఔట్ ఆఫ్ ఆర్డర్', ‘నగదు లేదు' అని బోర్డులు తగిలిస్తున్నారు.

 హైదరాబాదులోనే కాదు, అంతటా...

హైదరాబాదులోనే కాదు, అంతటా...

మరి కొన్ని ఎటిఎం కేంద్రాల్లో ‘టెంపరర్లీ ఔట్ ఆఫ్ సర్వీస్' అనే సందేశాలు వస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంతోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఏటీఎంలు పని చేయడం లేదు. నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. కానీ ఈ నెల మొదటి వారం నుంచే ఏటీఎంలన్నీ డబ్బు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర నగదు కొతర సమస్యను బ్యాంకులు ఇప్పటికే ఆర్‌బీఐకి నివేదించాయి. దీంతో ఈనెలాఖరు నాటికి రూ.4 వేల కోట్లు ఇస్తామని ఆర్‌బీఐ రాష్ట్రానికి భరోసా ఇచ్చింది. మూడ్రోజుల్లో అత్యవసరంగా రూ.1,100 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ డబ్బు వచ్చే వరకు ఏటీఎంలలో నగదు కష్టాలు తప్పవని బ్యాంకర్లు అంటున్నారు.

అలా ‘నో ట్రాన్సాక్షన్‌ డే'

అలా ‘నో ట్రాన్సాక్షన్‌ డే'

నగదు డిపాజిట్లు, లావాదేవీలపై బ్యాంకులు సరికొత్త ఆంక్షలకు తెరలేపాయి. నెలలో ఖాతాదారుడి లావాదేవీలు మూడింటికి మించితే ప్రతి ట్రాన్సాక్షన్‌పై అదనపు చార్జీ వసూలు చేయనున్నట్లు తెలిపాయి. అలాగే ఖాతాలో కనీస నిల్వలు లేకున్నా చార్జీలు వసూలు చేస్తామని తేల్చేశాయి. వచ్చే నెల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించాయి. ఈ అదనపు చార్జీల భారం ఎందుకు భరించాలనే ఉద్దేశంతో ఖాతాదారులు కనీస నిల్వ మినహా మిగిలిన మొత్తం కూడా విత్‌డ్రా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో నగదు విత్‌డ్రాల సంఖ్య భారీగా పెరుగుతోంది. అటు చార్జీలపై సోషల్‌ మీడియాలో బ్యాంకుల వైఖరిపై నిరసనలు తీవ్రం అవుతున్నాయి. బ్యాంకుల అడ్డగోలు చార్జీల వసూళ్లను నిరసిస్తూ ఖాతాలోని నగదు మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని, ‘నో ట్రాన్సాక్షన్‌ డే'జరపాలన్న అంశాలు వాట్సప్, ఫేస్‌బుక్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad: Cash crunch problem arises again after notes ban. Atm's running with out cash & banks also limitedly given money to dipositors.
Please Wait while comments are loading...