కెసిఆర్ 'ఆక్రమణ' పోరు

తెలంగాణలో జమీందార్లు, భూస్వాముల చేతుల్లో ఉన్న భూముల కోసం సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమాలు సాగాయి, సాగుతున్నాయి. ఈ ఉద్యమాలు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇప్పుడు పట్టణ, పట్టణ శివారు ప్రాంతాల భూకబ్జాలను వెలికి తీసే ఉద్యమానికి కెసిఆర్ శ్రీకారం చుట్టారు. లక్ష్మీనగర్ భూపోరాటమే తెలుగుదేశం వైఖరిని బయటపెట్టింది. లక్ష్మీనగర్ కబ్జాను పూర్తిగా తెలుగుదేశం శాసనసభ్యుడు హనుమంతరావు వెనకేసుకొచ్చారు. ఇది కేవలం చిన్న సంఘటన మాత్రమే. మిగతా భూముల వ్యవహారాలు కూడా బయట పడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పనలవి కాదు.
సినిమా ప్రముఖులకు భూములకు గల అవినాభావ సంబంధాన్ని కూడా కెసిఆర్ బయట పెడుతున్నారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో సినీ పరిశ్రమను నెలకొల్పడానికి స్టూడియోలకు భూములిచ్చారు. భూముల విలువ ఏపాటిదే ఆ రకంగా సినీ ప్రముఖులకు తెలియవచ్చింది. దాంతో సినీ ప్రముఖులు చాలా మంది తెలంగాణ భూములపై పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర భూముల వ్యాపారంలో కొంత మంది సినీ ప్రముఖులు పీకల దాకా మునిగి ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ భూముల లావాదేవీలు బయటకు వస్తే చాలా విషయాలు బయటపడతాయి. ఈ విషయాలను వెలికి తీయడానికి కెసిఆర్ పూనుకున్నట్లే ఉన్నారు. మొత్తం మీద కెసిఆర్ అత్యంత ముఖ్యమైన సమస్యను ముందుకు తెచ్చి పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. ఇది ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడే చెప్పలేం.












Click it and Unblock the Notifications