వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెడ్లంతా జగన్ వైపేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
రెడ్లంతా కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వైపు ఉంటారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో మొదటి నుంచీ రెడ్లదే ఆధిపత్యం. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కమ్మ వర్గం కూడా ఆధిపత్యంలోకి వచ్చింది. ఈ రెండు అగ్రకులాలు రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో కమ్మ అధిపత్య వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీని అధికారం నుంచి దించేసి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తెచ్చారు. అప్పటి నుంచి రెడ్ల ఆధిపత్యం కొనసాగుతూ వస్తోందని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి రెడ్ల మద్దతు పెద్ద యెత్తున్నే లభించింది. ఇప్పుడు వైయస్ జగన్ రాష్ట్ర రాజకీయాల్లో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పాత్రను పోషించాలని అనుకుంటున్నారు. కానీ, ఆయనకు సొంత పార్టీ అధిష్టానం నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదరవుతోంది. అందుకు ప్రధాన కారణం వైయస్ జగన్ ను దళిత, బహుజన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడమేనని అంటున్నారు. వి. హనుమంతరావు, కె. కేశవరావు వంటి నాయకులు అధిష్టానానికి జగన్ పై ఫిర్యాదు చేస్తున్నారని, జగన్ పై చాడీలు చెప్పి అధిష్టానానికి దూరం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అటువంటి నాయకులకు ప్రజల మద్దతు కూడా లేదని చెబుతున్నారు.

వైయస్ జగన్ కాంగ్రెసుకు దూరమై సొంత పార్టీని పెట్టుకుంటే ఏర్పడే పరిస్థితి ఏమిటనే అంచనాలు కూడా సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఏర్పడిన పరిస్థితే ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడుతుందనే విశ్లేషణ ఒకటి ఉంది. రెడ్లంతా వైయస్ జగన్ వైపు ఉంటారని, కమ్మలు కాంగ్రెసు వైపు వచ్చే అవకాశం ఉండదని, దానివల్ల కాంగ్రెసు రాష్ట్రంలో పూర్తిగా బలహీన పడుతుందని అంటున్నారు. కానీ పరిస్థితి అలా ఉన్నట్లు కనిపించడం లేదు. రెడ్డి వర్గానికి చెందిన పలువురు కాంగ్రెసు నాయకులు వైయస్ జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. జగన్ వ్యవహారంలో రెడ్డి సామాజిక వర్గం కోణం కన్నా రాజకీయంగా ప్రోత్సాహం, అణచివేత అనే కోణాలే ఎక్కువగా పనిచేస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ద్వారా లబ్ధి పొందినవారు వైయస్ జగన్ వెంట ఉంటారు, అణచివేతకు గురైన వారు జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా, కమ్మవర్గం ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి వైయస్ జగన్ అనుభవం సరిపోదని, కాంగ్రెసు ద్వారా మాత్రమే అధికారంలో కొనసాగగలమని భావిస్తున్న రెడ్డి వర్గానికి చెందిన నాయకులు చాలా మంది ఉన్నారు. కాంగ్రెసులో ఉంటే జగన్ కు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులందరి మద్దతు లభించే అవకాశం ఉంది. అలా కాకుండా కాంగ్రెసు నుంచి వెళ్లిపోయి జగన్ సొంత పార్టీ పెడితే వారి మద్దతు కోల్పోయే పరిస్థితి ఉంది.

అదే సమయంలో తెలంగాణ, సీమాంధ్ర అంశాలు కూడా పనిచేస్తున్నాయి. జగన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటులో బహిరంగంగా వ్యతిరేకించడం వల్ల తెలంగాణ నాయకులు ఆయన వెంట నడవలేని పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రజల ఒత్తిడి తెలంగాణ నాయకులపై విపరీతంగా ఉంది. తెలంగాణ సెంటిమెంట్ తీవ్రత బలంగా లేకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంత మంది తెలంగాణ నాయకుల మద్దతు ఆయనకు లభించి ఉండేది. కానీ ఇప్పుడు ఆయనకు తెలంగాణలో శాసనసభ్యురాలు కొండా సురేఖ, మరి కొద్ది మంది మద్దతు తప్ప ఎక్కువగా మద్దతు లభించే అవకాశం లేదు. పై కారణాల వల్ల వైయస్ దూరమై, జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు చాలా మందే ఉన్నారు. వారు ప్రజలను ప్రభావితం చేయగల నాయకులు కూడా.

తెలంగాణలో కె. జానారెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు జగన్ నాయకత్వాన్ని అంగీకరించే స్థితిలో లేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి కొద్ది మంది జూనియర్ల మద్దతు ఆయనకు ఉండవచ్చు. కానీ తెలంగాణ సెంటిమెంటు వల్ల వాళ్లు కూడా జగన్ ను బలపరిచే స్థితిలో లేరు. రాయలసీమలో శాసనసభ్యులు జెసి దివాకర్ రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి వంటి సీనియర్లు జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఒక రకంగా జగన్ ను ఎదుర్కునేందుకు వారు సమాయత్తమవుతున్నారు. కోస్తాంధ్రలో నెల్లూరు, ప్రకాశం వంటి జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సగం మంది నాయకులు మాత్రమే జగన్ ను బలపరుస్తున్నారు. మిగతా కోస్తా జిల్లాల్లో ఆయనకు ఇదే రకమైన మద్దతు లభించే అవకాశాలున్నాయి. కోస్తాలోని ప్రధానమైన జిల్లాల్లో కాపు, కమ్మ సామాజిక వర్గాలు పోటాపోటీగా ఉంటాయి. ఆ రెండు వర్గాల్లో కమ్మలు తెలుగుదేశం వైపు ఉంటే, కాపులు ప్రజారాజ్యం పార్టీ వైపు ఉండే అవకాశాలున్నాయి. చిరంజీవి కాంగ్రెసుకు మద్దతిస్తే కాపుల బలం వైయస్ జగన్ కు మైనస్ అవుతుంది.

వైయస్ జగన్ కు ఇప్పటి వరకు రెడ్లే ప్రధానంగా అండగా నిలుస్తున్నారు. మేకపాటి సోదరులు, రాయలసీమలోని కొంత మంది శాసనసభ్యులు ఆయనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ రకంగా రెడ్ల ప్రధానమైన బలం కాంగ్రెసు వెంటే ఉండే అవకాశం ఉంది. దళిత, బహుజన వర్గాలకు చెందిన నాయకులు కాంగ్రెసు వైపే ఉంటారు. అయితే, జగన్ సొంత పార్టీ పెడితే కాంగ్రెసు బలం తప్పకుండా తగ్గుతుంది. అది జగన్ ను అధికారంలోకి తెచ్చేంత బలంగా ఉండదనేది నిస్సందేహం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X