హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం ఉదయం అదృశ్యమైన ఏవియేషన్ హెలికాప్టర్ నల్లగొండ జిల్లాలో క్షేమంగా దిగినట్లు సమాచారం అందింది. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ డిగ్రీ కళాశాలలో ఇది క్షేమంగా దిగింది. దీంతో అధికారులు ఊపిరి తీసుకున్నారు. రాష్ట్రంలో శుక్రవారం ఉదయం ఏవియేషన్ హెలికాప్టర్ ఒకటి అదృశ్యమైంది. రైల్వే మార్గం సర్వే కోసం శుక్రవారం ఉదయం 9 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరిన హెలికాప్టర్ తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి హెలికాప్టర్ నుంచి సిగ్నల్స్ అంద లేదు.
ఖమ్మం, కృష్ణా జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఈ హెలికాప్టర్ అదృశ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అది తిరుపతి నుంచి బయలుదేరినట్లు సమాచారం అందింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, చిల్లకల్లు ప్రాంతాల్లో హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొట్టినట్లు కూడా స్థానికులు చెప్పారు. హెలికాప్టర్ ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.