ఏపీలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు రెడీ: రీఓపెన్ ఎప్పుడంటే?: గుర్తు పట్టలేనంతగా మార్పు
అమరావతి: రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు రీఓపెన్ కాబోతోన్నాయి. జగన్ సర్కార్ వాటిని ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చిన అనంతరం తొలిసారిగా పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం దీనికి ముహూర్తాన్ని ఖరారు చేసింది. వచ్చేనెల 1వ తేదీన ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఆరంభించడానికి సన్నాహాలు చేపట్టింది. నాడు-నేడు పథకం కింద ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా బదలాయించింది. ప్రభుత్వ పాఠశాలల తరహాలో మౌలిక సదుపాయాలను కల్పించింది. అన్ని వసతులతో పాటు పౌష్టికాహారం అందించబోతోంది.

నాడు-నేడు కింద..
రాష్ట్రంలో మొత్తం 55,608 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి ద్వారా 3 నుంచి 6 ఏళ్ల వయసున్న దాదాపు తొమ్మిది లక్షల మంది చిన్నారులకు ప్రీ స్కూల్ విద్యా బోధనను అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, విద్యా బోధన ప్రమాణాలను మెరుగుపర్చడానికి గత ఏడాదే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించింది. నాడు-నేడు పథకంలో దీన్ని చేర్చింది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల స్వరూపాన్ని మార్చివేసింది. మౌలిక సదుపాయాలను కల్పించింది.

మౌలిక వసతులు భారీగా నిధులు..
శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా అందుబాటులోకి తీసుకొచ్చింది. మరుగుదొడ్లను నిర్మించింది. ఫర్నిచర్, ఫ్యాన్లను సమకూర్చింది. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అంగన్వాడీలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా బదలాయించింది. ఇందులో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ-1, వైఎస్సార్ ప్రీ ప్రైమరీ-2, వైఎస్సార్ ప్రీ ఫస్ట్ క్లాస్ తరగతులను ఏర్పాటు చేసింది. నాణ్యమైన విద్యాబోధనతో పాటు పిల్లలకు పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని అందించడానికి నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించింది. అంగన్వాడీలలో ప్రీప్రైమరీ దశ నుంచే చిన్నారులకు తెలుగుతోపాటు ఇంగ్లిష్‌లో కూడా ప్రావీణ్యం కల్పించేలా చర్యలను చేపట్టింది.

సృజనాత్మకతను పెంపొందించేలా.
ప్రతి చిన్నారికి పుస్తకాలు, ప్రీ స్కూల్ కిట్స్, కలర్ కార్డులు, బిల్డింగ్ బ్లాక్స్, ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, చార్ట్స్, లెర్నింగ్ కిట్స్‌ను ప్రభుత్వం అందజేయనుంది. అంగన్వాడీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ప్రీ స్కూల్ సమయాన్ని నిర్ధారించారు. మధ్యలో చిన్నారులు విశ్రాంతి తీసుకోవడానికి గంటన్నర పాటు విరామం ఇస్తారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సమయంలో స్వల్పంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం లేకపోలేదు. రీడింగ్, స్టోరీ టైం, స్టోరీ టెల్లింగ్, క్రియేటివ్ యాక్టివిటీ తదితర అంశాలతో వారికి విద్యాబోధన సాగుతుంది.