న్యూ ఇయర్ వేడుకలపై ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరిక.. ఏమన్నారంటే
మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత జోష్ గా వేడుకలను నిర్వహిస్తారు. అయితే న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించడం పై చాలా కాలంగా హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కొత్త సంవత్సరం మన సంస్కృతి కాదని, వేడుకలను నిర్వహించాల్సిన అవసరం లేదని, అది పాశ్చాత్య సంస్కృతి అని ఎంతోకాలంగా చాలామంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాజాగా త్వరలో జరగనున్న న్యూ ఇయర్ వేడుకలపై భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవద్దని ఆయన సూచించారు. డిసెంబర్ 31 రాత్రి, జనవరి ఒకటవ తేదీన ఎవరు ఎటువంటి వేడుకలు నిర్వహించవద్దని, యువకులు జాగ్రత్తగా ఉండాలని రాజా సింగ్ అభిప్రాయపడ్డారు. ఇది మన సంస్కృతి కాదని పేర్కొంటూ ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

మనం మనం పుట్టిన స్థలాన్ని, మన సంస్కృతిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్న రాజాసింగ్, భారతీయులకు సొంతం కాని ఎలాంటి వేడుకలను జరుపుకోవాల్సిన అవసరం లేదన్నారు. రెండు వందల ఏళ్ల పాటు భారత దేశాన్ని పాలించిన బ్రిటిష్ పాలకుల సంస్కృతి ఇది అని రాజా సింగ్ పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడం చెడ్డ ఆనవాయితీ అని పేర్కొన్న ఆయన యువకులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి అన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ ఈ వేడుకలు చేసుకోకూడదని ఆయన హెచ్చరించారు.
కాగా ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్త ను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. ఇక వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు మళ్లీ న్యూ ఇయర్ వేడుకలపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితులలోను న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోకూడదని ఆయన యువతను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications