వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్లక్ష్యమే ఇంత పని చేసిందా? ఉత్కల్ రైలు ప్రమాద ఘటనలో నలుగురు అధికారులపై వేటు

పూరీ నుంచి హరిద్వార్‌ వెళ్తున్న కళింగ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదానికి గురి కావడానికి కారణం సిబ్బంది నిర్లక్ష్యమేనా అనే అనుమానం బలపడుతోంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ ముజఫర్ నగర్: ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వేశాఖ చర్యలకు ఉపక్రమించింది. రైల్వే బోర్డు కార్యదర్శి స్థాయి అధికారితోపాటు ముగ్గురు అధికారులను సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. మరో నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన రైల్వేశాఖ, ఒక అధికారిని బదిలీపై పంపింది. రైల్వే బోర్డు సభ్యుడు (ఇంజినీరింగ్) ఆదిత్య కుమార్ మిట్టల్, నార్త్రన్ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్‌కే కుల్‌శ్రేష్ఠ, డివిజినల్ రీజనల్ మేనేజర్ (ఢిల్లీ) ఆర్‌ఎన్ సింగ్‌లను సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. దర్యాప్తు పూర్త య్యే వరకూ సెలవుల్లో వెళ్లాలని పేర్కొంది.

ఆదిత్య కుమార్ మిట్టల్ రైల్వే బోర్డులో కార్యదర్శి స్థాయి అధికారి. ఢిల్లీ డివిజన్ సీనియర్ డివిజనల్ ఇంజినీర్ ఆర్‌కే వర్మ, మీరట్ అసిస్టెంట్ ఇంజినీర్ రోహిత్‌కుమార్, ముజఫర్‌నగర్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఇందర్‌జిత్ సింగ్, ఖాతౌలీ జూనియర్ ఇంజినీర్ ప్రదీప్‌కుమార్‌లను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. పూరీ నుంచి హరిద్వార్‌ వెళ్తున్న కళింగ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదానికి గురి కావడానికి కారణం సిబ్బంది నిర్లక్ష్యమేనా అనే అనుమానం బలపడుతోంది.

అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, కారణాలను నిగ్గు తేల్చడానికి రైల్వే మంత్రిత్వశాఖ రంగంలో దిగింది. రైల్వే భద్రత కమిషనర్‌ శైలేష్‌కుమార్‌ పాఠక్‌ నేతృత్వంలో సోమవారం నుంచి దర్యాప్తు మొదలు కానుంది. చీఫ్ ట్రాక్ ఇంజినీర్ అలోక్ అన్సాల్‌ను బదిలీపై పంపింది. కార్యదర్శి స్థాయి అధికారి సహా ఏడుగురు అధికారులపై రైల్వేశాఖ చర్యలు తీసుకోవడం అసాధారణమనే రైల్వే అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

రైల్వే బోర్డు చైర్మన్‌కు మంత్రి సురేశ్ ప్రభు ఆదేశాలు

రైల్వే బోర్డు చైర్మన్‌కు మంత్రి సురేశ్ ప్రభు ఆదేశాలు

కాగా, ఇంతకుముందే ఈ ప్రమాదానికి కారణం ఎవరన్న సంగతి తక్షణం తేల్చాలని బోర్డు చైర్మన్‌ను రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు ఆదేశించారు. ప్రమాదంపై ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా తక్షణం బాధ్యులను నిర్ధారించాల్సిందేనని స్పష్టంచేశారు. రైల్వేల నిర్వహణలో ఎటువంటి మెతక వైఖరి ఉండబోదని ఆయన ట్వీట్ల వర్షం కురిపించారు. ట్రాక్ సి బ్బంది నిర్లక్ష్యమా? రైలు ఇంజిన్ డ్రైవర్ తప్పిదమా? సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమా? అన్న విషయాలు తేల్చాలన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంతోపాటు గుర్తు తెలియని దుండగులపై రైల్వే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 23 బోగీల్లో 14 బోగీలు పట్టాలు తప్పడంతో 200 మీటర్ల పొడవునా ట్రాక్ పూర్తిగా దెబ్బ తిన్నది. 22 మంది మృతి చెందగా, 156 మందికి పైగా గాయపడ్డారని రైల్వే బోర్డు సభ్యుడు మహ్మద్ జంషెడ్ తెలిపారు. క్షతగాత్రుల్లో 26 మంది పరిస్థితి విషమంగా ఉన్నదన్నారు. ఇప్పటివరకు 15 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Recommended Video

Utkal Express derails in Uttar Pradesh, 6 coaches affected, Watch Video | Oneindia News
నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఓ అధికారి వ్యాఖ్య

నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఓ అధికారి వ్యాఖ్య

ప్రమాద స్థలంలో ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతున్నాయని రైల్వే బోర్డు సభ్యుడు జంషెడ్ అంగీకరించారు. మరమ్మతు పనుల సమయంలో అనుమతి లేకుండా నిర్వహణ పనులు చేపట్టారా అనేది తేలాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించినట్లు తెలిపారు. ఇ-టికెట్‌ కింద 40%మందికి బీమా వర్తిస్తుందనీ, ఇది కాకుండా రైల్వే కూడా పరిహారం చెల్లిస్తుందని చెప్పారు. ‘సాధారణంగా ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు పెట్టెలు బోల్తాపడడం, పట్టాలు తప్పడం, ధ్వంసం కావడం వంటివి జరుగుతాయి. ఈ ఘటనలో 200 మీటర్ల మేర పట్టాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమగ్రంగా విచారణ జరపాలి. అన్ని లెక్కలూ తేల్చి, ప్రతీ వైఫల్యాన్ని పరిగణనలో తీసుకుంటాం'అని జంషెడ్‌ వివరించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామన్నారు. ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి పేర్కొన్నారు.

24 గంటలు కష్టపడితేనే ఇలా

24 గంటలు కష్టపడితేనే ఇలా

పట్టాలు తప్పిన 14 పెట్టెల్లో ఆరు ఘోరంగా దెబ్బతిని, తుక్కుగా మిగిలాయి. వాటిని పట్టాలపైనుంచి తొలగించే పనులూ ఒక పట్టాన పూర్తికాలేదు. అధునాతన 140 టన్నుల క్రేన్లను, పెద్దఎత్తున కూలీలను రంగంలో దించి 24 గంటలకు పైగా కష్టపడితే గానీ శకలాలను తొలగించలేకపోయారు. ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైనప్పుడు గంటకు 100 కి.మీ. వేగంతో వెళ్తొందని ఢిల్లీ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆర్‌.ఎన్‌.సింగ్‌ వెల్లడించారు. రైల్లో 23 పెట్టెలు ఉంటే వాటిలో 13 పట్టాలు తప్పాయని తెలిపారు. జాతీయ విపత్తు నివారణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సహకారంతో చేపట్టిన సహాయ చర్యలు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు పూర్తికాగా ఆ తర్వాత రైలుమార్గం పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.

ఎర్రజెండా ఏర్పాటు చేయకుండానే మరమ్మతు పనులు

ఎర్రజెండా ఏర్పాటు చేయకుండానే మరమ్మతు పనులు

నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఇద్దరు రైల్వే ఉద్యోగుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆదివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 15 నిమిషాల సేపు సాగే ఈ ఆడియో క్లిప్‌ను ఇప్పటివరకు ధ్రువీకరించకున్నా, దాన్ని కూడా పరిశీలిస్తామని జంషెడ్ అన్నారు. ప్రమాద సమయంలో ట్రాక్‌ను దాటుతున్న ఒక ఉద్యోగి ‘ట్రాక్‌పై వెల్డింగ్ పని జరుగుతున్నది. కానీ కార్మికులు ట్రాక్‌ను బ్లాక్ చేస్తూ ఎటువంటి సంకేతం ఏర్పాటు చేయలేదు. క్రాసింగ్ వద్ద గేట్లు మూసేశారు. మరమ్మతు పని జరుగుతున్నట్లు ఎర్ర జెండా గానీ, బండిని నిలిపేందుకు సిగ్నల్‌గానీ ఏర్పాటు చేయలేదు. నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. ఈ మరమ్మతు పనుల్లో పాల్గొన్న ఉద్యోగులు సస్పెండ్ అవుతారు' అని అన్నట్లుగా ఆ ఆడియో క్లిప్‌లో ఉంది.

 అజాగ్రత్తగా ట్రాక్ కార్మికుల విధులు : స్థానికులు

అజాగ్రత్తగా ట్రాక్ కార్మికుల విధులు : స్థానికులు

పట్టాలు తప్పిన ఉత్కల్ ఎక్స్‌ప్రైస్ రైలు బోగి ట్రాక్ పక్కనే ఉన్న ఒక ఇంటిలోకి దూసుకెళితే, మరొకటి దాని పక్కనే ఉన్న పాఠశాల ప్రహరీ గోడను ఢీకొట్టింది. తాను శనివారం సాయంత్రం ఇంటి ముందు కూర్చుని ఉన్నప్పుడు పెద్ద శబ్దం వినిపించిందని, ఆ వెంటనే ఒక బోగీ ఇంట్లోకి దూసుకొచ్చిందని ఇంటి యజమాని చౌదరి జగత్‌సింగ్ చెప్పారు. నా కాలికి గాయమైంది. అదృష్టవశాత్తు నా కుటుంబం సురక్షితంగా బయటపడింది అని ఆయన మీడియాకు చెప్పారు. రైల్వే ట్రాక్‌పై మరమ్మతుచేస్తున్న కార్మికులు అజాగ్రత్తగా వ్యవహరించారని స్థానికులు ఆరోపించారు. డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు ట్రాక్‌పై ఎర్రజెండా ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపించారు. అయితే ట్రాక్ నిర్వహణా లోపమే కారణమా? అనేది దర్యాప్తు నివేదిక వచ్చాకే తేలుతుందని రైల్వేశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశామని రైల్వేశాఖ అదనపు డీజీ బిజాయా మౌర్య తెలిపారు.

English summary
KHATAULI, UTTAR PRADESH: Four railway officials have been suspended over the train accident on Saturday that left over 22 dead and injured over 200 in Uttar Pradesh's Muzaffarnagar district. Three others have been transferred and one has been sent on leave. Thirteen coaches of the Puri-Haridwar Utkal Express ran off the tracks around 5:45 pm in Khatauli, about 100 km from New Delhi. The move came on a day that Railways Minister Suresh Prabhu assured prompt action over the accident that appeared to have been caused due to negligence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X