
డిసెంబరు 1 నుంచి డిజిటల్ రూపాయి
దేశంలో డిజిటల్ రూపాయి వైపు అడుగులు వడివడిగా పడుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి రిటైల్ డిజిటల్ రూపాయిని (e₹-R) పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సహా నాలుగు బ్యాంకులు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ డిజిటల్ రూపాయికి సంబంధించి నవంబరు 1న పైలట్ ప్రాజెక్టుగా టోకు విభాగంలో ప్రవేశపెట్టారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా దీన్ని వ్యవహరిస్తారు.
ఎంపిక చేసిన ప్రాంతాల్లో వినియోగదారులు, వ్యాపారులతో కూడిన ఎంపిక చేసిన బృందాల మధ్య ఈ లావాదేవీలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కాగిత, నాణేలు ఉన్న విలువలతోనే డిజిటల్ రూపాయినీ జారీ చేయనున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా జారీ చేస్తారు. దీన్ని బ్యాంకులు అందించే డిజిటల్ వ్యాలెట్ సాయంతో లావాదేవీలు నిర్వహించొచ్చని ఆర్బీఐ పేర్కొంది. వ్యక్తులు, వ్యక్తుల మధ్య; వ్యక్తులు-వ్యాపారుల మధ్య ఈ లావాదేవీలు జరపొచ్చని తెలిపింది.

ఇప్పుడు చలామణిలో ఉన్న నగదు పట్ల ఉన్న నమ్మకం, భద్రతనూ రిటైల్ డిజిటల్ రూపాయికీ తీసుకురానున్నారు. ముందుగా ముంబయి, ఢిల్లీ, భువనేశ్వర్, బెంగళూరు నగరాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించనున్నారు. భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు, మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు.ప్రస్తుతం ఉన్న కరెన్సీ నోట్లకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ప్రస్తుతం ఉన్న నగదు కూడా కొనసాగుతుంది. అదనపు చెల్లింపు అవకాశాలను కల్పించడానికే సీబీడీసీని తీసుకొచ్చినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.