హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విమానాల్లో వచ్చి ఏటీఎం దొంగతనాలు: నిఘా వేసి పట్టేసిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో అంతర్రాష్ట దొంగలు రెచ్చిపోతున్నారు. నగరానికి చెందిన కొందరు వ్యక్తులతో సహాయంతో ఏకంగా విమానాల్లో వచ్చి ఇక్కడి ఏటీఎంలో చోరీలకు పాల్పడుతుండటం గమనార్హం. ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు హబీబ్‌నగర్ పోలీసులు. ఇందులో హైదరాబాద్ నగరానికి చెందిన దొంగ కూడా ఉన్నాడు. కాగా, ఈ ముఠాకే చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

ఈ దొంగతనాలకు సంబంధించిన వివరాలను పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు మంగళవారం మీడియాకు వెల్లడించారు. వీళ్లు రెండు నెలల కాలంలో రూ.4.32 లక్షల మేర మోసం చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయని, బయటపడనివి ఇంతకు భారీగానే ఉండొచ్చని ఆయన తెలిపారు.

న్యూఢిల్లీకి చెందిన, ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న బిపిన్, సయ్యద్ అజారుద్దీన్, షేక్ అషద్ అలీ, ఇంతికాబ్ ఆలం, మహ్మద్ షాబాజ్ ఖాన్‌లతోపాటు హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. నిత్యం విమానాల్లో ఢిల్లీ నుంచి వస్తూ సిటీలో ఉన్న ఐదు బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాలను టార్గెట్‌గా చేసుకున్నారు.

సెక్యూరిటీగార్డులు లేని, ఒకే కేంద్రంలో రెండు మిషన్లు ఉన్న వాటిల్లోనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఐదుగురూ కలిసి వాటి దగ్గరకు వెళ్లి.. ముగ్గురు బయట కాపుకాయగా, ఇద్దరు లోపలకు వెళ్తారు.మొదటి పంథాలో చిప్ మాదిరిగా ఉండే ప్లాస్టిక్ ముక్కను వినియోగించి ఏటీఎం మిషన్ పని చేయకుండా చేసి వినియోగదారులు కార్డు పెట్టి తీసేదాకా వేచి చూస్తారు.

ఆపై సదరు మిషన్ పని చేయట్లేదని చెప్పి పక్కనే ఉన్న మిషన్ వినియోగించమంటారు. ఆ సమయంలో వారి పిన్ నెంబర్ తెలుసుకుంటారు. దీని ఆధారంగా మొదటి మిషన్‌ను వినియోగించి డబ్బు డ్రా చేస్తున్నారు. ఇక రెండో పంథాగా నిరక్షరాస్యులు, వృద్ధులతో పాటు ఏటీఎం వినియోగం తెలియని వాళ్లను ఎంచుకుంటున్నారు.

five thieves arrested in Hyderabad

ఏటీఎం కేంద్రాల వద్ద కాపు కాస్తూ అలాంటి వారికి సహాయం చేస్తున్నట్లు నటించి పిన్ నెంబర్ తెలుసుకుని డబ్బు డ్రా చేసి ఇస్తున్నారు. ఏటీఎం కార్డు తిరిగి ఇచ్చే సమయంలో దాన్ని మార్చేసి డూప్లికేట్ కార్డు అంటగడుతున్నారు. ఆపై సదరు కార్డు, తెలుసుకున్న పిన్ నెంబర్ సాయంతో డబ్బు డ్రా చేస్తున్నారు. ఈ రెండు పంథాల్లో పశ్చిమ మండల పరిధిలోని హబీబ్‌నగర్, ఆసిఫ్‌నగర్, ఎస్సార్‌నగర్‌ల్లో ఏడు నేరాలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి.

పోలీసుల దృష్టికి రాకుండా రూ.10 వేల కంటే తక్కువ మొత్తాలు తస్కరించినవి దీనికి రెండు రెట్లు ఉంటాయని చెప్పారు. .వీరి కదలికలపై సమాచారం అందుకున్న హబీబ్‌‌నగర్ పోలీసులు మంగళవారం తాడ్‌బండ్ చౌరస్తాలోని ఏటీఎం కేంద్రం వద్ద వీరిని పట్టుకున్నారు.

ముఠాలోని బిపిన్ పరారు కాగా... మిగిలిన ఐదుగురినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.1.5 లక్షల నగదు, సెల్‌ఫోన్లు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోషామహల్ ఏసీపీ రామ్‌భూపాల్‌రావు, హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్, డీఐలు ఆర్ సంజయ్‌కుమార్, సుమన్‌కుమార్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

English summary
Five thieves arrested in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X