దగ్గరపడుతున్న పరీక్షలు.. పూర్తికాని సిలబస్.. SSC విద్యార్థులకు టెన్షన్

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల భయం పట్టుకుంది. ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నా.. సిలబస్ పూర్తికాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అకాడమిక్ ఇయర్ మొదలు ఇప్పటిదాకా అడుగడుగునా సమస్యలే దర్శనమిస్తున్నాయి. పరీక్షలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే మిగిలిఉండటంతో పదో తరగతి విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వాస్తవానికి డిసెంబర్ నాటికే సిలబస్ పూర్తికావాల్సి ఉంది. అంతేకాదు ఈపాటికి రివిజన్ తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ చాలా చోట్ల బోధన కూడా పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి.

పాఠాలతో 10 భయం..!
10వ తరగతి పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు సరిగ్గా 2నెలల సమయం మాత్రమే మిగిలిఉంది. అయితే సిలబస్ పూర్తికాక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. పరీక్షలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. 10 ఫలితాలు పాఠశాలల గ్రేడింగ్ లో కీలకంగా మారడంతో ఉత్తమ ఫలితాల కోసం ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. జూన్ మొదటివారంలోనే స్కూల్స్ ప్రారంభమైనా.. ఉపాధ్యాయుల బదిలీల కారణంగా మొదటి రెండు నెలలు బోధన సరిగా జరగలేదనే వాదనలున్నాయి. అదలావుంటే పర్యవేక్షించేవారు లేక విద్యావ్యవస్థ గాడి తప్పిందనే ఆరోపణలున్నాయి.

ఎన్నికల ఎఫెక్ట్..!
ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు కూడా 10వ తరగతి విద్యార్థులకు శరాఘాతంగా మారాయి. టీచర్లు ఎలక్షన్ల డ్యూటీలకు వెళ్లడంతో పాఠాలు సరిగా బోధించలేదు. దీంతో సిలబస్ పూర్తికాలేదు. అలా స్పెషల్ క్లాసులకు కూడా ఛాన్స్ లేకుండా పోయింది. తాజాగా పంచాయతీ ఎన్నికలు కూడా రావడంతో బోధన అటకెక్కుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అటు సిలబస్ పూర్తికాక.. ఇటు టీచర్లకు తీరిక లేక పదో తరగతి విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది 10 ఫలితాల్లో గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి దయనీయంగా మారనుందనే వాదనలు జోరందుకున్నాయి. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా 10 భయం వెంటాడుతోంది.

పది ఫలితాల మాటేంటి?
సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల కొరతతో పాటు విద్యావలంటీర్ల నియామకం ఆలస్యమైందనే కారణాలు సిలబస్ పూర్తికాకపోవడానికి నిదర్శనంలా నిలుస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు లేకపోవడంతో ఉపాధ్యాయులపై ఆజమాయిషీ లేకుండా పోయిందని.. దీని కారణంగా కొందరు అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. మొత్తానికి ఇన్ని అడ్డంకుల మధ్య 10వ తరగతి పరీక్షలు సాఫీగా జరుగుతాయా అన్నది ప్రశ్నార్థకమే. ఫలితాలు కూడా ప్రతికూలంగా వచ్చే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.