• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రిటైరయ్యాక మరింత బిజీ ఆయ్యాను

By Staff
|

సహచరులనూ అనుచరులనూ సావకాశంగా కలిసేందుకుగాను డాక్టర్‌ రామమనోహర్‌ లోహియా ఢిల్లీలోని ఇండియా కాఫీ హౌస్‌లో కొలువు తీర్చేవారని చెబుతారు. రాజకీయాల గురించీ, భావజాలాల గురించీ వేడివేడి, స్ట్రాంగ్‌ స్ట్రాంగ్‌ వాదోపవాదాలు ఎడతెరిపి లేకుండా సాగేవట. ఒక దశలో ఇండియా కాఫీ హౌస్‌ యాజమాన్యం నష్టాలు భరించలేక దుకాణం మూసేసిందట. లోహియా నడుం కట్టి దాన్ని తెరిపించి, కార్మికుల సారథ్యంలో కో ఆపరేటివ్‌ సంస్థగా కొన్నాళ్లు నడిపించారట. మన భాగ్య వశాన తెలుగువాడయిన ఎం. చలపతి రావు అప్పట్లో నేషనల్‌ హెరాల్డ్‌లో లోహియా కొలువుకూటం గురించి సర్దాగా రాశారు కూడాను. పశ్చిమ యూరప్‌లోని సోషల్‌ డెమొక్రాట్లను కాపీ కొట్టి లోహియా ఢిల్లీలో కాఫీ హౌస్‌ కల్చర్‌ ప్రవేశపెట్టారన్నది ఎం.సి. అభియోగం. అది ఎంత వరకు నిజమో తెలీదు కానీ, లోహియాను కాపీ కొట్టి కె.శివారెడ్డి హైదరాబాద్‌లో- ద్వారకా బ్రాండ్‌- కాఫీ క్లబ్‌ సంస్కృతి ప్రవేశపెట్టి పాతికేళ్లకు పైగా పోషించారని ఎవరయినా అంటే నమ్మడానికి నేను సిద్ధంగా వున్నాను.

ఇటీవలే లెక్చరర్‌ ఉద్యోగం నుంచి రిటైరయిన కె. శివారెడ్డికి సీరియస్‌ సాహిత్య చర్చను వేడి, స్ట్రాంగ్‌ కాఫీతో నంజుకోవడమంటే బలే ఇష్టం. కవిత్వం గురించి- అందునా మన ఆధునిక (?) తెలుగు కవిత్వం గురించి- గంటల తరబడి చర్చించాల్సిన గొప్ప విషయాలేమున్నాయని అబ్బురపడేవాళ్లను అలా ఉంచండి. ( ఇంతకీ వాళ్ల ఆశ్చర్యం అంత నిరాధారమేం కాదు. అయితే అది వేరే విషయం) తన్మయావస్థలో తెలుగు కవిత్వం గురించి చర్చిండగలగడం ఒక అదృష్టం. అందుకు ఎంతో తీరికా, మరెంతో ఓపికా కావాలి. కె. శివారెడ్డిలో ఈ రెండు శక్తులూ ఇప్పుడు ద్విగుణీకృతమయ్యాయి- రొడ్డ కొట్టుడు అధ్యాపక వృత్తి నుంచి విరమించిన తర్వాత.

''నాకు రిటైర్‌మెంటేమిటి? మరింత బిజీ అయ్యానిప్పుడు'' అంటున్న శివారెడ్డి ఈ మధ్యే పెద్ద కూతురు తులసి పెళ్లికి గుంటూరు వచ్చినప్పుడు ఆయనతో చేసిన ఇంటర్వ్యూ సారాంశం ఇది:

''ఉద్యోగం బాదరబందీ కూడా ఒదిలిపోయింది. మన టైమ్‌ మన చేతిలో ఉందిప్పుడు. ఎటొచ్చీ వనస్థలిపురం నుంచి రోజూ ద్వారక దాకా వెళ్లి రాలేకపోతున్నాను. మంచి వెన్యూ- దాదాపు మూడు దశాబ్దాల పాటు కష్టపడి కల్టివేట్‌ చేసింది- మిస్‌ అవుతున్నామన్న బాధ పీడిస్తోంది'' అన్నారు శివారెడ్డి. నిజానికి ఈ బాధ శివారెడ్డి మిత్రులనూ అనుచరులనూ అంతేవాసులనూ మరింతగా పీడిస్తోంది. ''హైదరాబాద్‌ వచ్చి వెళ్లే సాహిత్య మిత్రులకు- ముఖ్యంగా కవిత్వోపజీవులకు-ఒక శాశ్వత చిరునామాగా, ఒక ''రెందేవూ''గా ద్వారకను అలవాటు చేశాం. ఆధునిక అభ్యుదయ భావాలున్న రచయితల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఇటు వచ్చి వెళ్లినవారేనంటే అతిశయోక్తి కాదు. కొద్ది మంది కేవలం కుతూహలంతో తొంగి చూసి పొయ్యేవాళ్లు. మరి కొందరు పెర్మనెంటుగా ఇక్కడే సెటిలయిపోయారు. ఇంకా కొందరు ద్వారకా బృందాన్ని కలిసేందుకే పనిగట్టుకుని హైదరాబాద్‌ వచ్చేవాళ్లు'' అంటూ ఏకరువు పెట్టారాయన. ద్వారక శివారెడ్డి జీవితంలో ఎంత ప్రాధాన్యం కలిగి వుందో దీన్ని బట్టి ఊహించుకోవచ్చు.

కవిగా శివారెడ్డి శైలి గురించి సతీష్‌ చందర్‌ ఒకసారి రాశారు. అయనది వక్తృత్వశైలిగా అభివర్ణించారు సతీష్‌. నన్నడిగితే శివారెడ్డిది ప్రవక్తృత్వశైలి అంటాను. నాలుగు వైపులా ఫోకస్‌ చేసిన ఫ్లడ్‌లైట్ల మధ్యలో ఏర్పాటు చేసిన ఎత్తయిన వేదిక మీంచి, లక్షలాది మంది అమాయకులను ఉద్దేశించి గంభీరోపన్యాసం చేసే ప్రాసంగికుడి గొంతు శివారెడ్డి కవిత్వంలో పదేపదే తొంగి చూస్తుంటుంది. ఎంఫసైజ్‌ చెయ్యాలని అనుకున్న విషయాన్ని ఒకటికి పదిసార్లు చెప్పడం, హైలెట్‌ చెయ్యాలనుకున్న సంగతిని హెచ్చు స్వరంతో పలికించడం ఆయన కవితలలో అడుగడుగునా కనిపిస్తుంది. ఆ విషయాన్ని కవిగారేం కాదనడం లేదు.

''భారమితిలో వచ్చిన కవితలతోనే ఈ ధోరణి మొదలయిందని నా అభిప్రాయం. నిజానికి ఈ ఉపన్యాస ధోరణి నా ఫార్మేటివ్‌ డేస్‌లోనే నాకు అబ్బింది. మా ఊళ్లో మాల (కులం పేరు) కొండదాసు అని ఒకాయన వుండేవాడు. కథలు చెప్పడం ఆయన వృత్తి కాదు-మనఃప్రవృత్తి. అలాగే జీళ్లు అమ్ముకునే ఆయన-జీళ్ల సాయిబు-ఒకతను వుండేవాడు. నెరేటివ్స్‌ చెప్పడంలో మహాదిట్ట. ఇక నన్ను వామపక్ష భావాల వైపు మళ్లించి పుణ్యం కట్టుకున్న మహానుభావుడు మంగలి (కులం పేరు) రాఘవులు కూడా మంచి వాగ్ధాటి కలిగినవాడే. అతను ఒక్కడు నాలాంటివాళ్లు పదిపదిహేను మంది కుర్రాళ్లను చుట్టూ తిప్పుకోగలిగేవాడు. (అతనెవరో కాదు-మన జి. లక్ష్మీనర్సయ్య తండ్రే). వీళ్లు ముగ్గురూ నన్ను తొలినాళ్లలో బాగా ఇంప్రెస్‌ చేసి ఇన్‌ఫ్లుయెన్స్‌ చేసినవాళ్లు. ముగ్గురిదీ నువ్వు చెప్పిన ''ప్రవక్తృత్వ'' శైలే. అందరూ నెరేటివ్స్‌ ద్వారా మెసేజ్‌ కన్వే చేసే శైలిని అనుసరించినవాళ్లే. బహుశా వాళ్ల ధోరణే నాకూ అలవడి వుంటుంది. తొలి రోజుల్లో కవిత్వాన్ని కళాత్మకంగానూ, ఆడంబరంగానూ రాయాలన్న తపన వుంటుంది. అది బాల్యావస్థ. ఆ స్థితి గడిచిన తర్వాతే పాఠకుడికి ఏ ధోరణి తేలిగ్గా అర్థమవుతోందో గ్రహించికోగలిగే పరిణతి, పరిపక్వత వస్తుంది. 'భారమితి' కవితలు రాసేనాటికి నేనీ స్థితికి చేరుకోలేదనిపిస్తుంది'' అని శివారెడ్డి వివరించారు.

''నాకు ఇన్‌స్పిరేషన్‌ ఇంట్లోంచే వచ్చిందని చెప్పాలి'' అంటారు శివారెడ్డి. ''నాకు స్ఫూర్తినిచ్చినవాళ్లలో మా నాన్న ముఖ్యుడు. నేనూ తమ్ముడూ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే అమ్మ పోయింది. మా నాన్న మంచి అందగాడు. స్థితిమంతుడు. ఆరోగ్యవంతుడు కూడాను. కాయపారు మనిషి. దానికి తోడు కాయకష్టం చేసే వ్యక్తి కూడా కావడం చేత ఎప్పుడూ వర్కింగ్‌ కండిషన్‌లో వుండేవాడు. వయసు తెలిసేది కాదు. ( మేం కాలేజీ చదువులకొచ్చే నాటికి మా ఫ్రెండ్స్‌ నాన్నను మా అన్నయ్య అనుకునేవాళ్లు. ఇప్పుడు నాకూ మా పిల్లలతో అదే అనుభవం అవుతోంది). నాన్నను మళ్లీ పెళ్లి చేసుకోమని బంధువులందరూ బలవంతం చేశారు. కానీ మా కోసం అలాగే వుండిపోయాడాయన. జీవితాంతం మాకు చేసి పెడుతూనే ఉన్నాడు. అదాయన క్యారెక్టర్‌. ఆయన వారసత్వంగా దాన్నే అందుకోవాలని నా ప్రయత్నం. ఇవాళ శివారెడ్డి ఇలా వున్నాడంటే అది ఆయన చలవే''-కళ్లల్లో లేతచెమ్మ మిలమిలలాడుతుండగా శివారెడ్డి అన్న మాటలివి.

మరో విషయం-ఏ పనయినా నీట్‌ అండ్‌ టైడీగా చెయ్యాలన్నది మా నాన్న ప్రిన్సిపుల్‌. మాకు ఆయనే వండి పెడుతుండేవాడు.మాతో కూడా వంట చేయించేవాడు. అప్పట్లో ప్రెషర్‌ కుక్కర్లు లేవుగా. చిల్లుల పళ్లెం అడ్డం పెట్టి గంజి వార్చే వాళ్లం. అలా చేసినప్పుడు పళ్లేనికి ఒక్క మెతుకు అంటుకున్నా మా నాన్న ఊరుకునేవాడు కాడు. అలాగే దుక్కి దున్ని నీరు పెట్టి దమ్ము చేసేటప్పుడు ఎక్కడున్నా చిన్న మట్టిగడ్డ కనిపిస్తే ఊరుకునేవాడు కాడు. పైరు కోసి, కుప్ప వేసి, నూర్చి, గడ్డివాములు వేసేటప్పుడు ఒక్క పరక ఇటూఅటూ అయితే ఒప్పుకునేవాడు కాడు. చిన్నప్పుడు మేం ఆయనది చాదస్తమనుకునేవాళ్లం. కానీ ఏ పని చేసినా కుదురుగా ఒద్దికగా చెయ్యాలన్న పట్టింపు నాకు ఆయన దగ్గర్నుంచే సంక్రమించింది. కవిత్వ నిర్మాణం విషయంలో నా పట్టింపు గురించి చాలామంది మిత్రులు విసుక్కుంటారు. బహుశా ఈ లక్షణం కూడా నాకు నాన్న దగ్గర్నుంచే వచ్చింది'' అంటారు శివారెడ్డి.

''మా నాన్న పౌరాణిక నాటకాలు వేసేవాడు. చెప్పాగా, మనిషి బావుండేవాడని. గొంతు కూడా మంచి గొంతు. నాకు తెలిసిన తొలి కళాకారుడు మా నాన్నే. ఆయన ప్రభావం నా మీద గట్టిగానే పడింది. దాని వల్ల మంచే జరిగింది. అలాగే నాకు పరిస్థితులను తట్టుకుని నిలబడే శక్తినీ పోరాడే తత్వాన్నీ ఇచ్చింది కూడా నాన్నే. ''ూశగnగ శ షసషగగ| శ ూ|శషస| n ష|ౌ'' అన్న స్పృహ కూడా ఆయనే కల్పించాడు. నేను పిల్లలకు అదే ఇవ్వాలని ప్రయత్నించాను. ఎంతవరకు సఫలమయ్యానో వాళ్లూ మీరు చెప్పాలి'' అన్నారు శివారెడ్డి.

''నా జీవితంలో నలుగురు స్త్రీలు నన్ను గాఢంగా ప్రభావితం చేశారు. నా బాల్యంలోనే చనిపోయిన అమ్మ మొదటిది. రెండు, మా నాయనమ్మ. ఆమె గురించిన నా భావాలను ''మంచు'' కవితలో వ్యక్తం చేశాను. తర్వాత నా చిన్నప్పుడు 'ఆడదంటే ఈమెరా' అనిపించిన స్త్రీ మాల (కులం పేరు) కొండమ్మ. మగతనమున్న స్త్రీ! మేమంతా ''చెక్కు, చెక్కు'' అని పిలిచేవాళ్లం-శకుంతల అని- నాకంటే అయిదారేళ్లు పెద్దది-ఆమె నా కౌమారంలో నన్నెంతో ప్రభావితం చేసింది. ఈ నలుగురు స్త్రీలు నాకు, ఆడవాళ్లని ఎలా గౌరవించాలో-ప్రేమించాలో-పూజించాలో-ఆరాధించాలో నేర్పించారు. వాళ్లకి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను'' స్వల్పంగా కంపించే గొంతుతో చెప్పుకొచ్చారు శివారెడ్డి.

''గతంతో సంబంధం కలుపుకుని, కొనసాగించాలే తప్ప, దాన్ని పూర్తిగా కాదనుకోకూడదన్నది నా అభిప్రాయం. అయితే ఈ సందర్భంగా స్పిరిట్‌ నిలబెట్టుకోవడం చాలా అవసరం. ఆ స్పిరిట్‌ యూత్‌ఫుల్‌గానే ఉండాలి'' అని సూత్రీకరించారు శివారెడ్డి. ''నన్ను చాలామంది స్వదేశీ, విదేశీ సీనియర్‌ కవులు ప్రభావితం చేశారు. సమకాలికులయిన కవుల నుంచి కూడా స్ఫూర్తి పొందాను. అంతేకాదు, నన్ను కొందరు జూనియర్‌ కవులు సైతం ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశారు. నువ్వు కవిగా బతికుండాలంటే, జీవన స్పందనలకు బ్లంట్‌ కాకుండా కొనసాగాలనుకుంటే ఈ లెర్నర్స్‌ స్పిరిట్‌ను పోషించుకోక తప్పదన్నది నా నిశ్చితాభిప్రాయం. అలాగే కేవలం కవులు సాహిత్య జీవుల నుంచే కాక జీవితంలో మనకి ఎదురయ్యే అన్ని రకాల మనుషుల నుంచీ సందర్భాల నుంచీ ఎంతో కొంత నేర్చుకోగలిగి వుండాలి'' అన్నారాయన.

''నా వరకు నేను అనుకునేదేమంటే కవిత్వ సంబంధమయిన కార్యకలాపాలకు అధ్యాపక వృత్తి బాగా దోహదం చేస్తుంది. ఎన్నిసార్లు పాఠం చెబితే అన్ని సార్లు నేను ఆ పద్యాన్ని-కీట్స్‌ రాసిందే కావచ్చు-షేక్‌స్పియర్‌ రాసిందయినా కావచ్చు-

మళ్లీ మళ్లీ తిరగరాసినట్లే భావిస్తాను. నాకు ఒక్కోసారి ఒక్కో కోణంలోంచి ఒక్కో దృశ్యం కనిపిస్తూంటుంది. దాన్ని నా సొంత మాటల్లో పునర్నిర్మిస్తుంటాను. అలాగే సాహిత్య సమావేశాల్లో మాట్లడేటప్పుడు కూడా రకరకాల శ్రోతలు ఎదురవుతుంటారు. వాళ్ల నుంచి భిన్నమైన స్పందనలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆంధ్రరాష్ట్రంలోని అన్ని మూలల్లోనూ సభలూ సమావేశాల్లో పాల్గొన్న అనుభవం నాకుంది. ఆ అనుభవం ప్రాతిపదికగానే నేను నా కవిత్వశైలిని మల్చుకుంటూ వచ్చాను. ఆ రకంగా నేను సాటి కవుల చేతనే కాక పాఠకుల చేత, శ్రోతల చేత కూడా ఇన్‌ఫ్లుయెన్స్‌ అయినట్లు భావిస్తా''నని వినయం ఉట్టిపడుతుండగా పేర్కొన్నారు శివారెడ్డి.

అసలింత వరకూ ఏ కవీ, మరే కవి రచననూ నూటికి నూరు పాళ్లుగా అనువదించనే లేదన్నది నా నిశ్చితాభిప్రాయం'' అని తేల్చి చెప్పేశాడు శివారెడ్డి. ఆ మధ్యన గ్యుంథర్‌ గ్రాస్‌ మన దేశం వచ్చినపుడు శివారెడ్డి ఆయన కవితలు కొన్నింటిని తెలుగులోకి అనువాదం చేసి అచ్చు వేశారు. వాటిల్లో కొన్నింటి మీద చర్చ కూడా జరిగింది. దాన్ని ప్రస్తావిస్తూ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. ''అనువాదకుడిగా శ్రీశ్రీ నాకు మార్గదర్శి. ''ఖడ్గసృష్టి''లోని కవిత్వానువాద ప్రక్రియ నాకు శిరోధార్యం. మయకోవ్‌స్కీ లెనిన్‌ కావ్యాన్ని శ్రీశ్రీ అనువదించిన తీరును నేను ఫాలో అయ్యాను-అవుతాను. గ్రాస్‌ పద్యం అనువదిస్తూ నేను 'కిరస్తానీ'అనే మాట వాడాను. అది డెరగేటరీ ప్రయోగం అని సిధార్థ అభ్యంతరం చెప్పాడు. కోస్తాంధ్ర వ్యవహారంలో-నాకు తెలిసినంత వరకూ- కిరస్తానీ అన్న మాట క్రిస్టియన్‌కి సమానార్థకం మాత్రమే. అందులో నిందార్థం ఉందని నేను అనుకోవడం లేదు-ఇప్పటికీ. నేను జనవ్యవహారానికి మాత్రమే విధేయుడిని. దానికే కట్టుబడి వుంటాను. కవిత్వం అనువదించడమంటే దాన్ని తిరిగి రాయడమనే నా ఉద్దేశం. అదే నేను చేసింది. ఛాయానువాదమే సాధ్యం తప్ప, అక్షరమక్షరం అనువదించడం అక్షరాలా అసాధ్యం!-కవిత్వానువాదానికి సంబంధించి నా కన్విక్షన్‌ ఇది'' అన్నారు శివారెడ్డి.

''సాహిత్యానికి, ముఖ్యంగా కవిత్వానికి, పత్రికలు చేసిన- చేస్తున్న సేవ అపారం. ఇప్పటికీ ప్రధానంగా పత్రికలను ఆశ్రయించే కవిత్వం మనుగడ సాగిస్తోంది. ఇవాళ్టి ప్రముఖ కవులంతా పత్రికల ద్వారా పాప్యులర్‌ అయినవాళ్లే. అందుకే తెలుగు కవిత్వానికి సంబంధించినంత వరకూ పత్రికలు ఎప్పుడూ మేజర్‌ రోల్‌ ప్లే చేస్తూనే ఉన్నాయంటాన్నేను'' అన్నారు శివారెడ్డి. ''శిష్‌ట్లా నవమిచిలుక-విష్ణుధనువు 'ఆంధ్రభూమి'లో అచ్చయినప్పుడే నేను చదివింది. ఆ తర్వాతే ఏటుకూరి ప్రసాద్‌ నడుం బిగించి శిష్‌ట్లా కవిత్వాన్ని ఒక సమగ్రసంకలంగా వేశాడు. ఒక పత్రికతోనే గా ఈ పని మొదలయింది? దీన్ని బట్టి చూస్తే తెలియడం లేదు, పత్రికలు కవిత్వానికి చేస్తున్న సాయమేమిటో?'' అని ప్రశ్నించారాయన. పత్రికల్లో కవిత్వానికి పాఠకులు తక్కువ అన్న వాదన ఒకటుంది. నిజమే కావచ్చు. ఆ మాటకొస్తే పత్రికల్లో సంపాదకీయాలకు కూడా పాఠకులు చాలా తక్కువ. బహుశా కవిత్వానికే ఎక్కువ మంది పాఠకులుంటారేమో. అంత మాత్రం చేత పత్రికల్లో సంపాదకీయాలు అవసరం లేదనగలమా? కవిత్వం విషయంలో కూడా అంతే. నెమ్మదిగా సాహిత్య సంప్రదాయంగా స్థిరపడిపోయింది పత్రికల్లో కవిత్వం. దాన్ని కాదనలేరు ఎవరూ. పైగా ప్రతి కదలికనూ రికార్డ్‌ చేసే విషయంలో పత్రికలకీ కవిత్వానికీ సామ్యం ఉంది. ఆ రెండూ కూడా చిన్న పరిణామానికి సైతం స్పందించే స్వభావం కలిగి వుంటాయి. అంచేత వాటి మధ్య వైరుధ్యం వెతకడం అనవసరం-అన్యాయం కూడా'' అన్నారు శివారెడ్డి.

''కవిత్వంతో సహా అన్ని రంగాల్లోనూ మౌఖిక సంప్రదాయానికి ఈ రోజున మరింత ప్రాముఖ్యం లభిస్తోంది. అలనాడు నాజర్‌ నిర్వర్తించిన పాత్రనే ఈ రోజు గద్దర్‌ కూడా పోషిస్తున్నాడు. లక్షలాది మంది మూగ ప్రజల మనోభావాలకు గొంతునిచ్చిన మహానుభావులు వాళ్లు. వాళ్ల ప్రభావం ప్రజల మీద అపారంగా ఉండడం సహజం-ముమ్మాటికీ న్యాయం కూడా. నా మట్టుకు నేను చిన్నతనంలో నాజర్‌ చేత ప్రభావితుణ్నయ్యాను. పెద్దయ్యాక గద్దర్‌ ప్రభావంలో పడ్డాను. అందుకు అప్పుడూ-ఇప్పుడూ కూడా గర్విస్తూనే ఉన్నాను. మట్టికీ మనిషికీ సంబంధం నానాటికీ తెగిపోతున్న ఈ రోజుల్లో మౌఖిక సంప్రదాయం ప్రాముఖ్యం పెరుగుతోంది-పెరగాలి కూడా'' అన్నారు శివారెడ్డి. అంతగా మౌఖిక సంప్రదాయాన్ని ప్రేమించే మనిషి కావడం చేతనే, కూతురు పెళ్లి పనులు ముంచుకొచ్చిన ఘడియల్లో కూడా మూడు గంటల సేపు నాతో ముచ్చటించగలిగారాయన.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more