వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహిత్య పెద్దమనిషి - కెవిఎస్‌ వర్మ

By Staff
|
Google Oneindia TeluguNews

''విరసం ఏర్పడకముందు అభ్యుదయ రచయితల సంఘంలో ఉన్నాను. క్రమంగా విరసం వైపు మొగ్గాను. 1978లో నేను రాసిన 'రోత' కథలో విప్లవకారుల మీద, ఉద్యమం మీద అభిమానం - దాన్ని వెన్నుపోటు పొడిచే స్వార్ధపరుల మీద అసహ్యం వెల్లడయ్యాయి. అలాగే నేను రాసిన 'అంతేమరి' 'శిక్ష' 'నవజీవనం' లాంటి కధల్లో కూడా విరసం భావజాలం కనిపిస్తుంది. 'న్యాయంకోసం' అనే కథలో సైతం అదే ఐడియాలజీ ప్రతిఫలిస్తుంద''న్నారాయన.

''జర్నలిజంలోకి వచ్చింతర్వాత దాదాపు ఆరేళ్ళపాటు కథలు రాయలేదు. 1984లో నా 'యుద్ధం' కథాసంకలనం ఆవిష్కరణ తర్వాతే మళ్ళీ కలం పట్టాను. కాళీపట్నం రామారావు మేష్టారితో నా పరిచయం, స్నేహం ఈ పరిణామానికి ప్రేరణనిచ్చింది. వరసనే 1990 దాకా పాతిక పైగా కధలు రాశాను. ఆ తర్వాత మళ్ళీ ఊపు కాస్త తగ్గింది. ఆర్నెల్లుగా ఏమీ రాయలేదు - రాయాలనిపించక'' అని వివరించారు వర్మ. ''నేను ఏ సిద్ధాంత గ్రంథాలూ లోతుగా చదివి అభిప్రాయాలు ఏర్పర్చుకున్న వాణ్ణి కాదు. నా జీవితానుభవాలు పరిసరాల్లోని పరిణామాల్లోంచే నా విలువలు రూపొందించుకున్నాను. నాకు ఏ దివ్య శక్తుల మీదా నమ్మకం లేదు - హేతువాదిని. అయితే నా హేతువాదం సొంత అనుభవాల ప్రాతిపదికగా ఏర్పడింది.

నేను ఎస్సెల్సీ పరీక్ష పాసయ్యాక తిరపతి వెళ్ళి గుండు చేయించుకొచ్చాను. ఆ తర్వాత ఏడేళ్ళ వయసున్న నా చిన్న చెల్లి చచ్చిపోయింది. తనతో నాకు అటాచ్‌మెంట్‌ ఎక్కువ. మా చెల్లెల్ని ఎవరన్నా ఏమన్నా అంటే తను అమ్మకు చెప్తా - నాన్నతో చెప్తా అనేది కాదు - అన్నయ్యతో చెప్తాననేది. అదీ మా ఇద్దరి మధ్య అనుబంధం. అలాంటి చెల్లెల్ని తిరుపతి మొక్కు తీర్చుకున్న తర్వాతే చనిపోవడంతోనాకు దివ్యశక్తి ప్రభావం మీద అవిశ్వాసం మొదలైంది. అదే క్రమంగా పాతుకుపోయిం''దన్నారు వర్మ. ''సత్యసాయిబాబా మీద తొలిరోజుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. ఇప్పటికీ నా దృష్టిలో ఆయన ప్రజల్ని మోసం చేస్తున్న వ్యక్తే. పీసీ సర్కార్‌ మీద నాకు అమిత గౌరవం. ఎందుకంటే ఆయన మేజిక్‌ చేస్తూ ఆ విషయం చెప్తున్నారు. సత్యసాయిబాబా అలా చెయ్యడం లేదు. అయితే తొలిరోజుల్లో ఉన్నంత తీవ్రమైన ఆగ్రహం బాబా మీద ఇప్పుడు లేదు నాకు. ఎందుకంటే ఆయన ప్రజలకు ఉపయోగపడే పన్లు కొన్ని చేస్తున్నాడు కదా'' అన్నారు వర్మ.

''నా దృష్టిలో మినీ కవిత వల్ల కవిత్వానికి హాని జరిగింది. నిర్వచనాలూ, యుక్తులు, సూక్తులూ కూడా కవితలుగా చెలామణీ అయ్యాయి. అలాగే హైకూలో కూడా బలంగా చెప్పే స్కోప్‌ ఎక్కువ లేదన్నది నా అభిప్రాయ''మన్నారు వర్మ. ''అయితే మినీ కధల వల్ల మాత్రం మంచే జరిగింది. ముఖ్యంగా ఆంధ్రభూమి దినపత్రికలో కాళీపట్నం మేష్టారు నిర్వహించిన 'నేటి కథ' కాలమ్‌ వల్ల ఎందరో కొత్త కథకులు జన్మించి వెలుగులోకి వచ్చా''రన్నారు వర్మ.

''విశాఖలో సాహిత్యవాతావరణం ఉత్తమశ్రేణికి ఉన్నతస్థాయికి చెందినది. రాజమండ్రిలో అనారోగ్యకర సాహిత్య వాతావరణం ఉన్నా అది ప్రొడక్టివ్‌. హైదరాబాద్‌ సాహిత్య వాతావరణం మరీ డల్‌'' అని తేల్చేశారు కెవిఎస్‌ వర్మ. ''గోర్కీ, చెహోవ్‌, రావిశాస్త్రి, కాళీపట్నం, కొడవటిగంటి, రంగనాయకమ్మ గార్లు నా అభిమాన రచయితలు. సమకాలికుల్లో కెఎన్‌వై పతంజలి అంటే ఇష్టం. శ్రీశ్రీ, తిలక్‌ల కవిత్వమంటే ఇష్టం'' అన్నారు వర్మ. ''కార్టూనిస్టు, జర్నలిస్టు మోహన్‌ కళ అంటే నాకు అభిమాన''మన్నారాయన.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X