• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విద్యార్థుల ఆత్మహత్యలు: కార్పోరేట్ కాలేజీలా, పేరెంట్సా...

By Pratap
|

హైదరాబాద్‌: నారాయణ కాలేజీని మూసేయాలని డిమాండ్ చేస్తూ లేఖ రాసి పెట్టి అదృశ్యమైన సాయి ప్రజ్వల జాడ తెలిసింది. దాంతో ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం చిక్కింది. కానీ ఆమె తాను అదృశ్యం కావడం ద్వారా ఓ చర్చను మాత్రం ముందుకు తెచ్చింది.

కార్పోరేట్ విద్యాసంస్థల తీరుపై ఆమె అదృశ్యమైనప్పటి నుంచి తీవ్రమైన చర్చ సాగుతోంది. ఒత్తిడి భరించలేకనే ఆమె కనిపించకుండా పోయినట్లు నిర్ధారణ అయింది. కార్పోరేట్ సంస్థల్లో విద్యార్థులపై ఒత్తిడి దండిగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.

అయినా, తల్లిదండ్రులు ఆ విద్యాసంస్థల్లోనే తమ పిల్లలను చేరుస్తున్నారు. అందుకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు కూడా. తమ జీవితమంతా కూడా పిల్లల కోసమే ఖర్చు చేస్తున్నారు. డబ్బులు, సమయం వారి కోసం పెడుతున్నారు.

30 దాకా ఆత్మహత్యలు....

30 దాకా ఆత్మహత్యలు....

ఈ ఏడాది జనవరి నుంచి మొదలు పెడితే ఒకటి, రెండు తగ్గిస్తే 30 మంది విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో ఎక్కువ మంది ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులే. చదువు ఒత్తిడి తట్టుకోలేకనే వారు ఆ తీవ్రమైన చర్యకు పాల్పడ్డారనేది కాదనలేని విషయం. తల్లిదండ్రుల ప్రేమను కాదని భవిష్యత్తును ఊహించుకోలేక వారు ఆత్మహత్యలు చేసుకున్నారని భావించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదాన్ని సాయిప్రజ్వల లేఖ తెలియజేస్తోంది.

కార్పోరేట్ కాలేజీలు....

కార్పోరేట్ కాలేజీలు....

విద్య మొత్తంగా వ్యాపారంగా మారిపోయింది. ప్రైవేట్ విద్యాసంస్థలు దండిగా వచ్చాయి. వాటి మధ్య పోటీ కూడా పెరిగింది. ఆ కాలేజీలకు ర్యాంకులు వస్తున్నాయనే ఉద్దేశంతో వాటినే తల్లిదండ్రులు ఎంచుకుని తమ పిల్లలను వాటిలో చేరుస్తున్నారు. అయితే, ఫలితాల కోసం ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నాయి. పుస్తకాలు పట్టుకుని చదువుతూ ఉండడం, రోజూవారీ లేదా వారం వారీ పరీక్షలు రాయడం మాత్రమే వారి జీవితంగా మారిపోయింది. బాహ్య ప్రపంచంతో దాదాపుగా సంబంధాలు తెగిపోయి ఓ నిర్బంధ జీవితాన్ని గడుపుతున్న స్థితి ఉంది. దాంతో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి వల్ల విద్యార్థులు కోల్పోతున్న మానసిక స్థయిర్యాన్ని అటు తల్లిదండ్రులు గానీ ఇటు విద్యాసంస్థలు గానీ పట్టించుకోవడం లేదు.

 తల్లిదండ్రుల అత్యాశ...

తల్లిదండ్రుల అత్యాశ...

తమ పిల్లలు డాక్టర్ కావడమో, ఐఐటి సీటు కొట్టడమో కావాలనే ఆశతో తల్లిదండ్రులు కార్పోరేట్ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంతకు ముందు ఇంజనీరింగ్ చదువులపై మోజు చూపేవారు. కానీ, ఇంజనీరింగ్ విద్య మామూలు డిగ్రీ విద్య స్థాయికి దిగజారిపోయింది. లెక్కకు మిక్కిలి ఇంజనీరింగ్ కాలేజీలు రావడంతో మామూలు విద్యార్థి కూడా ఎలాగో అలాగా ఇంజనీరు అవుతున్నాడు. దాంతో నిరుద్యోగం కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ను పీడిస్తోంది. దీంతో డాక్టర్ చదువుపై మక్కువ పెరిగింది. అదే విధంగా ఐఐటిపై కూడా మోజు ఉంది. తమ పిల్లల స్థాయిని అంచనా వేయకుండా వారి ఇష్టానిష్టాలతో ప్రమేయం లేకుండా తల్లిదండ్రులు కార్పోరేట్ కాలేజీల్లోకి తమ పిల్లలను నెడుతున్నారు. పిల్లల అభిప్రాయాలను కూడా వినడానికి వారు సిద్దపడడం లేదు.

పోల్చుకోవడం....

పోల్చుకోవడం....

ప్రతిభ గల విద్యార్థులతో తమ పిల్లలను పోల్చుకోవడం కూడా తల్లిదండ్రులు చేస్తున్నారు. ఐఐటి వచ్చిన పిల్లలను లేదా మెడిసిన్‌లో చేరిన పిల్లలను చూపించి తమ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇతరుల పిల్లలకు వచ్చే మార్కులను చూపించి తమ పిల్లలను నిలదీస్తున్నారు. దీంతో పిల్లలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇతరులతో పోల్చడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మార్కులు సాధించకపోతే జీవితమే లేనట్లుగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. దాంతో తమ పిల్లలను 24 గంటలు పుస్తకాలు ముందు పెట్టుకుంటే తప్ప వారు శాంతించడం లేదు. టీవీ సెట్లను అటకెక్కిస్తున్నారు. ఇది పిల్లలకు తల్లిదండ్రుల పట్ల వైముఖ్యాన్ని కూడా పెంచుతోంది. ఇందులో తల్లులు పిల్లల ఆగ్రహానికి తీవ్రంగా గురువుతున్న విషయం కూడా కాదనలేం. తల్లులను చాలా మంది పిల్లలు వ్యతిరేకిస్తున్నారు.

ఆటలూ... పాటలూ...

ఆటలూ... పాటలూ...


ఆటలు, పాటలు, సరదాలు అన్నీ బందవుతున్నాయి. ప్రధానంగా ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు ఈ హింసకు గురవుతున్నారు. ఇంటర్మీడియట్ విద్య భవిష్యత్తుకు కీలకం. దాంతో ఇంటర్మీడియట్ విద్యార్థులపై ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. లేలేత నూనూగు మీసాలతో పలు విషయాలపై మనసు అయోమయంలో పడే వయస్సు అది. దేని మీద కూడా స్పష్టత వచ్చే వయస్సు కాదు. పైగా, బాహ్య ప్రపంచం అనేది లేకపోవడం, ఇతరులతో సామాజిక సంబంధాల్లోకి వచ్చే వెసులుబాటు లేకపోవడం వారిని అంతర్ముఖులుగా తయారు చేస్తోంది. చదువులో పోటీ పడలేని నిస్సహాయ స్థితికి విద్యార్థులు చేరుకుంటున్నారు. విద్యాసంస్థలు, తల్లిదండ్రులు వారికి చాయిస్ లేకుండా చేస్తున్నారు. చదవడమో, చావడమో అనే అంతిమ స్థితికి వారిని నెట్టేయడం అసలు ప్రమాదస్థితికి కారణం.

స్థాయిని బట్టే....

స్థాయిని బట్టే....


అభిరుచి ఉన్న రంగంలో కాలుపెడితే ఆ రంగంలో పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించి, ఆ రంగంలో ఎదుగుతారనే భావన తల్లిదండ్రుల మనసుల నుంచి దాదాపుగా తొలిగిపోయింది. తమ పిల్లల అభిరుచిని బట్టి, చదువులో వారి స్థాయిని బట్టి కోర్సులను ఎంచుకోవాలనే వివేకం పూర్తిగా నశించింది. అందరూ డాక్టర్లో, ఇంజనీర్లో, ఐఐటియన్లో కాలేరనే వివేచనా శక్తిని కోల్పోతున్నారు. అందుకే కార్పోరేట్ కాలేజీల వెంట పడుతున్నారు.

కాలేజీలు ఇలా...

కాలేజీలు ఇలా...

గతంలో విద్యాసంస్థలకు విశాలమైన ఆట స్థలం ఉండేది. క్రీడా పరికరాలు విద్యాసంస్థల్లో ఉండేవి. ఓ ఆటల పీరియడ్ కూడా ఉండేది. దానికో టీచర్ కూడా ఉండేవాడు. పంద్రాగస్టో, జనవరి 26 వస్తుందంటే సాంస్కృతి కార్యక్రమాల సందడి ఉండేది. వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు ఉండేవి. ఆటల పోటీలు ఉండేవి. ఇవన్నీ విద్యార్థులు ఆయా రంగాల్లో జాతీయ స్థాయిలోనో, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తారని కాదు. పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఎదగడానికి పనికి వస్తాయని మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు అపార్టుమెంట్లలో కూడా విద్యాసంస్థలు నడుస్తున్నాయి. గాలీ వెలుతురు సోకని ఇరుకు గదులు. పిల్లలకు ఏ రకంగానూ ఊపిరాడని వాతావరణం ఉంటోంది.

ఏం మాట్లాడితే...

ఏం మాట్లాడితే...

ఏం మాట్లాడితే ఏ ముప్పు వస్తుందో అనే భయం మధ్య విద్యార్థులు చదువుకొంటున్నారు. రేపు తమ తల్లిదండ్రులు కోరుకున్న సీట్లు రాకపోతే తాము ఎదుర్కోబోయే పరిస్థితి ఏమిటనే భయాందోళనలకు గురవుతున్నారు. ఎదురు మాట్లాడడం కాదు, తమ అభిప్రాయాలను వెల్లడించడానికి కూడా అవకాశం లేని నిర్బంధ స్థితిని వారు ఎదుర్కుంటున్నారు.

గతంలో ప్రభుత్వ సంస్థలే....

గతంలో ప్రభుత్వ సంస్థలే....

గతంలో పదో తరగతి తర్వాత ప్రభుత్వ కాలేజీల్లో సీటు వస్తే అదృష్టం పండినట్లు బావించేవారు. హైదరాబాదులోని ఆలియా కాలేజీలో సీటు వస్తే గోల్డ్ మెడల్ సాధించినట్లు ఉండేది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ కాలేజీల్లోనూ చదివినవారు చాలా మంది ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు. పెద్దగా డబ్బులు ఖర్చు కాకుండా గ్రామాల్లోని పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో చదివినవారు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఇప్పటి జాఢ్యం అప్పుడడు లేదు. తమ పిల్లవాడు చదువులో రాణించలేకపోతున్నాడని భావించినప్పుడు తల్లిదండ్రులు వేరే రంగానికి పంపించేవారు. కానీ, ఇప్పుడు కార్పోరేట్ భూతం ఆవహించిన పాడు కాలం దాపురించింది. దీన్ని గుర్తించి, తమ పిల్లలను సంఘజీవులుగా మలుచుకోవాలనే కోరిక తల్లిదండ్రులకు కలగకపోతే పరిస్థితి మరింత విషమిస్తుంది.

- కె. నిశాంత్

English summary
Corprate colleges and parents pressure is forcing the students to take unwanted extreme steps in Telangana and Andhra Pradesh states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X