వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతపట్ల క్విక్‌బాక్సింగ్: నేనెవరిని?

|
Google Oneindia TeluguNews

ఒకడున్నాడు. ఒకడికి ఒక్క తల వుంది. ఒకడికి వున్న ఒక్క తలలో ఒక్క ముక్కుంది. ఒకడికి వున్న ఒక్క తలలో వున్న ఒక ముక్కుకి రెండు పక్కలా చెవులున్నవి అవీ ఒక్కొక్కటే కుడివైపూ ఎడం వైపూ. ఒకడికి వున్న ఒక్క తలలో వున్న ఒక్క ముక్కుకి రెండు వైపులా ఒక్కొక్కటే వున్న చెవులకి రెండు పక్కలా కళ్లున్నయి అవీ ఒక్కొక్కటే కుడివైపూ ఎడంవైపూ. ఒకడికి వున్న ఒక్క తలలో వున్న ముక్కుకి రెండు వైపులా ఒక్కొక్కటేవున్న చెవులకి రెండు పక్కలా ఒక్కొక్కటిగా కళ్లున్న ఒక్కడికి ఒక్క నోరూ ఒక్క మెడా వున్న ఒక్కడికి రెండు వైపులా ఒక్కొక్కటిగా రెండు చేతులు రెండువైపులా వున్న ఒకడికి రెండు వైపులా ఒక్కొక్క కాలూ వున్నయి కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి. ఒక్కడికి వున్న ఒక్క తలని మోస్తూ నడిచే ఆకాళ్ల మీద నడుస్తున్న ఆ ఒక్కడు అలా ఒక్కడే నడుస్తున్నాడు అడవి దారంట.

ఆ ఒక్కడికీ తను ఎవడినో తెల్సుకోవాలనే ఆరాటం- ఆ ఒక్కడూ అలా నడుస్తూ నడుస్తూ నడవలేక అలిసిపోయి ఓ పెద్ద చెట్టుకింద బండరాయి చూసుకుని దాని మీద ముందు చతికిలబడ్డాడు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వున్న అన్నింటినీ కలిపి ఒక్కటిగా ఒక్క దగ్గర ముడ్చుకుపడుకున్నాడు. మో చేతిని దిండుగా పెట్టుకున్నాడు. కాస్సేపయిందో లేదో చేతి వేలు మీద ఎవరో చురుకు పెట్టినట్టయ్యింది. మంట పుట్టింది. మంటోమంట అనరస్తూ లేచి కూచున్నాడు. దిండుగా పెట్టుకున్న చేతి వేలొకటి భగభగ మంటున్నది. బండమీద నించి మెల్లమెల్లగా పాకిపోతున్నదదేదో!

అదే ఏదో చేసింది అనుకున్న ఒక్కడు ఆగు ఆగు ఆగక్కడ అని అరిచాడు. బండరాయి మీద అల్లా నిలబడి పోయిందా ప్రాణి.

ఎవర్నువ్వు? నా వేలుని ఏం చేశావు? అనడిగాడు ఆ ఒక్కడు తను ఎవడినో తెల్సుకోవడానికి బయల్దేరిన వాడు.

నన్ను తెలుగులో తేలు అంటారు సంస్కృతంలో వృశ్చికం అంటారు. ఆంగ్లంలో స్కార్పియో అంటారు అన్నదా ప్రాణి. అదో తేలు.

మరి నా రెండవ ప్రశ్నకు జవాబేదీ అన్నాడు ఒక్కడు మంటపుచ్చుకున్న వేలు వైపు చూస్తూ.

నీ వేలుని నేను కాటేశాను. అన్నది తోకెత్తిన తేలు.

chintapatla quick boxing on man's behavior

అంటే! అన్నాడు ఒక్కడు. ఏముంది నా దారికి అడ్డం వచ్చింది నీ వేలు. నేను తేలుని కనుక కుట్టానా వేలు అన్నదా తేలు.

మరిప్పుడెలా! వేలు మంట తగ్గేదెలా? అన్నాడు ఒక్కడు తను ఎవడో తెల్సుకోవాలనే ఆరాటం వున్నవాడు.

నాకున్నది ఒక్క తోక, దాన్నిండా వుండేది విషం. కొండితో కుట్టి ఆ విషాన్ని నీ వేలులోకి పంపా ఇక నువ్వుండవు లేప్పా! అన్నది తేలు.

అరెరే! అదెలా! నేనెవరినో తెల్సుకోవడానికి అడవులంట పడ్డాను. ప్లీజ్ నేను బ్రతికుండే మార్గం చెప్పు అన్నాడు ఒక్కడు.

సరే! నిన్ను ‘సేవ్ చేస్తాను'. ఆ ఎదురుగ్గా పొదలో ఎర్రటి ఆకులు కనపడ్తున్నయే అవి నమిలి మింగు ‘యూ విల్ బీ ఒకే' అన్నది తేలు.

నన్ను కుట్టిన నువ్వే బ్రతికే మార్గం చెప్పావు థ్యాంక్స్ అన్నాడు ఒక్కడు.

విషం వున్నది ఒక్క తోకలోనే నాకు అని వెళ్లిపోయింది తేలు.

ఒక్క తలలో అనేక ఒక్కట్లు వున్న ఒక్క తలను మోసే రెండు ఒక్కట్లూ మోసుకెళ్తుంటే ఎర్రటి ఆకులు నమిలి మింగి బతికిపోయి నడిచి పోయేడు ఒక్కడు.

అలా తనేవరో తెల్సుకోవాలనే ఆరాటంతో ముందుకు వెళ్తున్న ఆ ఒక్కడు దారి పక్కన ఓ మట్టి పుట్టని చూశాడు. అలా చూస్తూ నుంచుని వున్నాడు. ఎక్కడ్నించో సరసరా వచ్చిందో పొడుగాటి గోధుమ రంగు ప్రాణి. ఆ ఒక్కటి పక్కనించి కాస్త ముందుకు వెళ్లి ఒక్కసారి తలెత్తి ఆ ఒక్కడి వైపు చూసి ఎవరైతే మనకేంటి అనుకుంటూ పుట్ట వైపు పాకి తన ఇంటి మెయిన్ డోర్‌లో తలదూర్చి నెమ్మదిగా లోపలికి జారిపోసాగింది. దాన్ని చూసిన ఒక్కడికి వున్న ఒక్క తల్లో ఏదో ఒక్క పురుగు తిరిగింది గిరగిరా. అంతే తన యింట్లోకి తాను జారిపోతున్న ప్రాణి తోకను పట్టుకున్నాడు పరుగెత్తి వెళ్లి ఒక్కడు. అది లోపలికి లాగుతుంటే తాను బయటకు లాగసాగాడు. విసుగెత్తిన ఆ ప్రాణి వెనక్కి తిరిగి జెట్ స్పీడ్‌తో బయటకు వచ్చింది. తోకను పట్టుకున్న తన్ను సతాయిస్తున్న ఒక్కడి చేయి మీద అంతెత్తున తల ఎత్తి బుస్సుమంటూ కస్సుమంటూ కాటేసింది. ఇంకేముంది అభ్బా అంటూ కూలబడి పోయాడు ఒక్కడ దాన్ని వదిలేసి.

ఈ సారి పుట్టలోకి పూర్తిగా వెళ్లిపోయి తల మాత్రం బైటికి పెట్టిందా ప్రాణి.

ఎవర్నువ్వు? నా చేతిని ఏం చేశావు? అనడిగాడు ఆ ఒక్కడు తను ఎవడినో తెల్సుకోవడానికి బయల్దేరిన వాడు.

నన్ను తెలుగులో పాము అంటారు. సంస్కృతంలో సర్పం అంటారు. ఆంగ్లంలో స్నేక్ అంటారు అన్నదా ప్రాణి. అదో పాము.

మరి నా రెండవ ప్రశ్నకు జవాబేదీ అన్నాడు ఒక్కడు రంగు మారుతున్న తన చేతి వైపు చూస్తూ.

నీ చేతిని నేను కాటేశాను అన్నది పాము. పడగెత్తిన పాము.

అంటే! అన్నాడు ఒక్కడు. ఏముంది నా మానాన నేను నా ఇంట్లోకి వెళ్తుంటే నన్ను తోక పట్టుకు లాగావు. నేను పాముని కనుక కుట్టానా చేతిని అన్నదా పాము.

మరిప్పుడెలా? నా చేయి బాగు పడేదెలా? అన్నాడు ఒక్కడు తను ఎవడో తెల్సుకోవాలనే ఆరాటం వున్నవాడు.

నాకున్నది ఒక్క తల. ఆ తలలో వున్నవి కోరలు. ఆ కోరల్లో వుండే విషాన్ని నీ చేతిలోకి దింపా. ఇక నువ్వుండవులే అప్పా! అన్నది పాము.

అరెరే! అదెలా! నేనెవరినో తెల్సుకోవడానికి అడవులంట పడ్డాను. ప్లీజ్ నేను బ్రతికుండే మార్గం చెప్పు అన్నాడు ఒక్కడు.

సరే! నిన్ను ‘సేవ్ చేస్తాను'. ఆ ఎదురుగ్గా వుండే పొదలో ఆకు పచ్చటి ఆకులు కనపడ్తున్నయే అవి నమిలి మింగు ‘యూ విల్ బీ ఆల్‌రైట్' అన్నది పాము.

నన్ను కుట్టిన నువ్వే బ్రతికే మార్గం చెప్పావు థ్యాంక్స్ అన్నాడు ఒక్కడు.

విషం ఉన్నది ఒక్క కోరల్లోనే నాకు అంటూ వెళ్లిపోయింది పాము.

ఒక్క తలలో అనేక ఒక్కట్లు వున్న ఒక్క తలను మోసే రెండు ఒక్కట్లూ మోసుకెళ్తుంటే ఆకుపచ్చ ఆకులు నమిలి మింగి బతికిపోయి నడిచి పోయేడు ఒక్కడు.

అలా తనెవరో తెల్సుకోవాలనే ఆరాటంతో ముందుకు వెళ్తున్న ఆ ఒక్కడు యికనడిచే ఓపిక లేక ఓ మైదానం మధ్యలో నిలబడి పదే పదే నేనేవడిని నేనెవడిని అని అవరసాగాడు.

అరవకు! అపకారం చేస్తావేమోనని భయపడి కుట్టింది తేలు. దానికి ఒక్క తోకలోనే విషం. తనకు అపకారం చెయ్యవులే అని తన ఇంట్లోకి వెళ్లిపోయిన దాన్ని తోక పట్టుకు లాగావు గనక మరో దారి లేక కుట్టింది నిన్ను పాము. దానికి ఒక్క తలలోనే విషం. ఉపకారికి అపకారం చేస్తావు. నమ్మినవాడి గొంతుకోస్తావు పైకి పళ్లికిలిస్తావు కానీ తలతోకా కాదు, నీ ఒళ్లంతా విషమే. నిలువెల్లా విషమే అన్నది ఆకాశవాణి.

అయితే నేనెవరిని అనరిచాడు ఒక్కడు. ‘నువ్వు మనిషివి' అన్నది ఆకాశవాణి.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in his column Quick Boxing tells about man's behavior.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X