హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చింతపట్ల క్విక్ బాక్సింగ్: ది డే ఆఫ్ ది డెడ్

By Pratap
|
Google Oneindia TeluguNews

మళ్లీ మరో అమావాస్య రాక పోదు కదా. మళ్లీ అర్ధరాత్రి కాకపోతుందా.

ఈసారి కారులో నలుగురున్నారు. నలుగురిలో ఇద్దరాడవాళ్లు. మగవాళ్లిద్దరిలో ఒకడు కారు తోలుతున్నాడు. తార్రోడ్డు మీద కారు రైయ్ రైయ్ మంటూ సాగింది. అసలు అర్ధరాత్రవగానే కార్లకి ఏ మాయ రోగం వస్తుందో కానీ దీనికీ వచ్చినట్టుంది. ఉన్నట్టుండి ఉయ్యాల్లా వూగి చతికిలపడింది. నలుగురూ కిందకి దిగారు. చీకట్లో కూడా బెనెట్లో ఏదో కెలుకుతున్నాడు ఒకడు. ఒక ఆడ మనిషి ఎవరు చూడాలనో ఏమి కావాలనో జుత్తు సవరించుకుంటూ నిలబడ్డది. మరొక ఆడ మనిషి ముఖాన్ని చేతుల్తో వొత్తి అందం చెడకుండా చూసుకుంటున్నది. మరో మగాడు ఈల వేస్తున్నాడు. బానెట్ వదిలి ఓ మగాడివతలకి వచ్చి లాభం లేదు ప్చ్ అన్నట్టు ఆవలించాడు.

ఇప్పుడేలా అన్నది వో ఫిమేల్ వాయిస్. దూరంగా ఏదో వెలుతురు కనిపిస్తున్నది. అటువేపు చూవారందరు. ఒకరితోపాటు మరొకరు ఒకరి వెనక ఒకరుగా ఆ వైపుకు నడిచారు ఆ నలుగురు. పెద్ద గేటు కిర్రున తెర్చుకుంది. అదో పెద్ద రాజ మహల్‌లా వుంది. తలుపు బాదారు. తలుపు హఠాత్తుగా కిరకిర మంది. చేతిలో కొవ్వొత్తి స్టాండు పట్టుకు నుంచున్నాడో వృద్ధుడు. ఒక కన్నుమెల్ల ఎటు చూస్తున్నాడో తెలీదు. లోపలికి రండి అన్నాడు. నలుగురూ లోపలికి నడిచారు. గోడలకి పులుల తలలూ ఎలుగుబంటి తలావున్నయి. గోడ మీద ఎవరో రాజా వారి నిలువెత్తు పెయింటింగ్ వుంది. వీళ్లు మెట్లెక్కి మేడ పైకి వెళ్తుంటే రాజావారు పెయింటింగ్ లోంచి కళ్లు విప్పి వాళ్లనే చూడసాగాడు. ఆ తర్వాత గదిలో కిటికీలు ధడాల్‌న కొట్టుకోసాగేయి. టేబిల్ మీద నీళ్ల కూజా ఎగిరి కింద పడింది. నల్ల పిల్లి ఒకటి కిటికీలోంచి తొంగి చూస్తూ మ్యావ్ మంది.

నాకు భయంగా ఉంది అంది వో అమ్మాయి. ఎక్కడ్నించో పిచ్చినవ్వు విన వచ్చింది. ఆ తర్వాత దయ్యాలు ఆ నలుగురినీ ఫుట్‌బాల్ ఆడుకున్నాయి.

దయ్యాలకు చాలా కళలున్నట్టు చూసిన వారు చెప్పిన భోగట్టా వున్నది. కొన్ని దయ్యాలు పాడ్తాయి. కొన్ని ఆడ్తాయి కూడా. కొన్ని దయ్యాలు తలగిర్రున తప్పితే కొన్ని దెయ్యాలు నాలుకని లుంగీలా చాపుతయి. కొన్ని దయ్యాలు గొంతు పిసికి చంపుతాయి. కొన్ని పడుకుంటే వచ్చి మీద కూచుని వత్తి పట్టి హింసిస్తయి.

దయ్యాలు గాల్లో ఎగుర్తయి. తలుపులు పెట్టున్నా లోపలికి వచ్చేస్తయి. మనకు తెల్సిన వాళ్ల రూపంలో వచ్చి హఠాత్తుగా గొంతు మార్చి వణికిస్తయి. దయ్యాల్లో పిల్ల దయ్యాలుంటయి ఆడపిల్ల దయ్యాలుంటయి ముసలి దయ్యాలు ఆడవీ మగవీ కూడా వుంటయి.

 Chintapatla quick boxing: The day of the dead

అసలు దయ్యాలన్నింటికీ బలమైన ఆయుధం నవ్వే. నవ్వే దయ్యాలు నవ్వుతూనే దడ పుట్టిస్తయి. ఏడ్చే దయ్యాలు మూలిగే దయ్యాలూ వుంటయి కానీ అవికూడా నవ్వడానికి ముందాపని చేస్తయి.

దయ్యాల్లో ఆడ దయ్యాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తేలుతుంది. సకల దెయ్యాల సర్వే గనక చేసి నట్టయితే ఈ విషయం తప్పక రుజువవుతుంది. ఇక యే దయ్యాలకయినా ‘బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్' కంపల్సరీ అనిపిస్తుంది. తలుపు కిర్రులు కిటికీల ధడాళ్లు, ఇక ఇకలు పక పకలు, పిడుగుపాట్లు, డఢాం ఢంలు నేపథ్య తీతాలు గజ్జెల చప్పుళ్లు కనక లేకపోయినట్టయితే దెయ్యాల అప్పియరెన్స్‌కి యే విలువా వుండదు. కనపడిందాని కంటే వినపడే దానితో ఎక్కువ హడలిఛస్తారు దయ్యోపహతులు.

దయ్యాలనేవి అస్సలు లేనే లేవని ఏ వూళ్లో నన్నా దయ్యాల గోల ఎక్కవయి జనం ఖాళీ చేస్తే వెళ్లి వాటిని పట్టుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అదేం ఖర్మమో ఒక్క దయ్యం కూడా వాళ్లకి కనపడి చావదు ఆల్ రడీ చచ్చిందే కనక.

దేవుడయినా దయ్యమైనా అందరికీ కనపడరు కదా! కనపడకపోయినా దేవుడి మీద భక్తి వున్నట్టే చాలా మంది దయ్యమంటే చస్తామన్న చచ్చేంత భయం వుంటుంది.

‘హలో వీన్ డే' జరుపుకుంటున్నారు గనక శ్వేత భవనంలో విచ్చలవిడిగా తిరిగే మాజీ అధ్యక్షుల ఆత్మలు ఎవరినీ యేమీ అండం లేదు. మనం కూడా వేరే దేశాల వాళ్లని చూసి జరుపుకుంటున్నట్టే మనమూ అనేక ‘దినా'లు జరుపుకుంటున్నాం గనక ‘దెయ్యాల దినం' కూడా ‘సెలబ్రేట్' చేసుకోవడం వల్ల దెయ్యాల్ని మన ఇంట్లోకి వంట్లోకి దూరకుండా చెయ్యవచ్చునేమో!

- చింతపట్ల సుదర్శన్

English summary

 Prominent columnist Chintapatla Sudarshan in column Quick Boxing wants a perticular day for dead. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X