• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వరంగల్‌లో టిఆర్ఎస్‌కు భారీ మెజారిటీ: మరో కోణం

By Pratap
|

హైదరాబాద్: అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు మెజారిటీని కూడా ఆయన అధిగమించారు. ఈ క్రెడిట్ కెసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందా, ఆయన నాయకత్వానికి దక్కుతుందా అనే విషయం పక్కన పెడితే ఇందులో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి.

17 నెలల కాలంలో కెసిఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత దండిగా పెరిగిపోయిందనే ప్రతిపక్షాల అంచనాలు తప్పు అని తేలింది. ప్రతిపక్షాలకు తెలంగాణ విషయంలో ఉన్న విశ్వసనీయత ఏమిటనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. తెలంగాణ విషయంలో కాంగ్రెసు, బిజెపి, తెలుగుదేశం, వామపక్షాలు అనుసరించిన గత వైఖరుల జాడలు ప్రజల మనస్సుల్లోంచి అంతగా తేలికగా చెరిగిపోయావేనా అనేది ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ఆ పార్టీలు నిర్వహించిన పాత్ర వల్ల తెలంగాణ ప్రజల్లో ఆ పార్టీలు విశ్వసనీయతను కోల్పోయాయనేది నిజం. ఈ పార్టీలకు ఓటేస్తే తమ కోసం పనిచేస్తాయా అనేది ప్రజలకు ఉన్న సందేహం.

Warangal Lok Sabha bypoll: Another angle in TRS majority

మరో విషయం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ నిర్వహించిన పాత్ర ప్రతిపక్షాలన్నింటిపై ప్రభావం చూపింది. తెలంగాణ ఉద్యమమనేది ప్రధానంగా సీమాంధ్ర పెత్తందారీ, ఆధిపత్య, పెట్టుబడీదారు వర్గాలకు వ్యతిరకంగా జరిగింది. వారి కనుసన్నల్లో నడుస్తున్న పార్టీలపైనా ప్రధానంగా తెలంగాణవాదులు అస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇందులో ప్రథమ శత్రువుగా తెలుగుదేశం పార్టీనే చూశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ గానీ, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గానీ ఆ ఆధిపత్య ధోరణిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు.

తాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నట్లుగానే కెసిఆర్ కూడా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారనే సమాన గౌరవంతో చంద్రబాబు చూసినట్లు కనిపించలేదు. ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కెసిఆర్ విషయంలో చేసిన ప్రకటనలు కూడా తెలంగాణ ప్రజలకు బిజెపి, టిడిపి కూటమి పట్ల వ్యతిరేకతను పెంచాయి. ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత చంద్రబాబు కెసిఆర్‌పైనా, టిఆర్ఎస్‌పైనా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో వ్యతిరేక భావనను కలిగించాయి.

Warangal Lok Sabha bypoll: Another angle in TRS majority

తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాదుపై ఆధిపత్యాన్ని తిరిగి సంపాదించుకోవాలనే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వర్గం ప్రయత్నాలు చేస్తోందని ఇక్కడి ప్రజల మనస్సుల్లో నాటుకుపోయి ఉంది. తెలంగాణలోని పలువురు మేధావులు, రచయితలు వివిధ సందర్భాల్లో మాట్లాడుతున్న విషయాలు కూడా ఈ విషయాన్ని పట్టిస్తాయి. ఆంధ్ర ఆధిపత్యవాదుల నుంచి కాంగ్రెసు పార్టీ తమను కాపాడలేదని తెలంగాణ ప్రజలు భావిస్తూ వస్తున్నారు. దీన్నే టిఆర్ఎస్ బలంగా ప్రచారంలో పెడుతూ వస్తోంది.

తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచి తిరిగి ఆంధ్ర ఆధిపత్యవాదులు తెలంగాణపై తిరిగి పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉన్నారని చెప్పడానికి గత 17 నెలల కాలంలో వరుసగా జరిగిన సంఘటనలు, తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కాంగ్రెసు, వామపక్షాల నాయకులు మాట్లాడిన మాటలు ధ్రువపరుస్తున్నాయి. చంద్రబాబు వరంగల్, మహబూబ్‌నగర్ బహిరంగ సభల్లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలకు పాదులు వేశాయి. అదే నిజమన్నట్లుగా నోటుకు ఓటు కేసు వెలుగులోకి వచ్చింది.

Warangal Lok Sabha bypoll: Another angle in TRS majority

ఈ 17 నెలల కాలంలో కెసిఆర్‌పై వ్యతిరేక భావనలు ప్రజల్లో ఏర్పడలేదని చెప్పడం కూడా సరి కాదు. కెసిఆర్ పాలనలోని కొన్ని విషయాల పట్ల తెలంగాణ మేధావులు గానీ, ప్రజలు గానీ పూర్తి ఏకీభావంతో లేరు. కానీ, మొత్తంగా కెసిఆర్ పాలనను తిరస్కరించడానికి సిద్ధంగా లేరు. అంతేకాకుండా కెసిఆర్ కాబట్టే ఈ మాత్రం తెలంగాణ ఉందనే భావన కూడా ఉంది. వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్ర ఆధిపత్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారడమో, తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చిందా అని బాధపడడమో జరిగి ఉండేదని భావిస్తున్నారు.

ఆ రకంగా చూసినట్లు తెలంగాణలోని ప్రతిపక్షాల విశ్వసనీయత తీవ్రమైన ప్రమాదంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల విశ్వసనీయతను పొందడానికి ఆ పార్టీలు ప్రయత్నాలు చేయకపోగా, కెసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడడమే పనిగా పెట్టుకున్నాయి. పార్టీ నిర్మాణాలను పునరుద్ధరించుకుని, వ్యవస్థాగతంగా బలపడి, కనీసం మూడేళ్లయినా వేచి చూసిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపాల్సి ఉండిందని, చాలా తొందరగా ఆ పార్టీలు కెసిఆర్‌పై దాడికి పూనుకున్నాయనే భావన బలంగా ఉంది. ఈ స్థితిలోనే వరంగల్ లోకసభ ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు భారీ మెజారిటీ లభించిందని భావించాల్సి ఉంటుంది. నిజానికి, దీన్ని 2006లో కెసిఆర్ రాజీనామా చేసి తిరిగి పోటీ చేసిన కరీంనగర్ లోకసభకు జరిగిన ఉప ఎన్నికతో పోల్చవచ్చు.

- కె. నిశాంత్

English summary
K Nishanth says Telangana Rastra Samithi (TRS) candidate Pasunuri Dayakar won the Warangal Lok sabha seat with thumping majority as the opposition parties credibility is stake in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X