సబితా ఇంద్రారెడ్డికి 'సన్' స్ట్రోక్

పరిటాల రవి హత్య కేసులో నిందితులుగా ఉన్నవారు ఒకరి వెంట ఒకరు వరుసగా హత్యకు గురికావడానికి వెనుక ఉన్న గాడ్ ఫాదర్ ఎవరో తేలాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సీరియల్ హత్యల వెనుక ఉన్న గాడ్ ఫాదర్, జూనియర్ గాడ్ ఫాదర్ ఎవరో తేల్చడానికి న్యాయ విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర హోం మంత్రి నివాసం నుంచే క్రిమినల్ కార్యకలాపాలు జరుగుతున్నాయని బైరెడ్డి ఆరోపించారు. 'సూరి పక్కన తిరుగుతున్న భాను, మధుసూధన్ కు హోం మంత్రి కుమారుడు కార్తీక్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయని ప్రసార సాధనాల్లో అనేక కధనాలు వస్తున్నాయి. విజయవాడ సెటిల్మెంటు వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రదీప్ రెడ్డికి, కార్తీక్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధాలు కూడా తేలాలి. ఈ క్రిమినల్ గ్యాంగుల కార్యకలాపాలన్నింటికి హోం మంత్రి నివాసమే కేంద్రంగా మారింది' అని ఆయన అన్నారు. హోం మంత్రి కుమారుడు చేసే సెటిల్మెంట్ల వ్యవహారాల్లో ఏ పార్టీ వారికి సంబంధాలు ఉన్నా వారందరిపైనా చర్య తీసుకోవాల్సిందేనని, ముందుగా హోం మంత్రిని ఆ పదవి నుంచి తప్పించడం ద్వారా ప్రక్షాళన మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
సూరి హత్యతో సబితా ఇంద్రారెడ్డి కుమారుడికి లింక్ పెట్టడాన్ని డిజిపి అరవింద రావు ఖండించారు. అయినా అగ్గి చల్లారలేదు. మీడియా చానెళ్లు అన్నీ సబితా ఇంద్రారెడ్డి కుమారుడి పేరును ప్రముఖంగా ప్రస్తావిస్తూ వచ్చాయి. సూరిని హత్య చేశాడని భావిస్తున్న భాను కిరణ్, మధుసూదన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి గ్యాంగ్‌కు కార్తిక్ రెడ్డి అండదండలున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీతో స్వయంగా సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సూరి హత్యతో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అనవసరంగా ఈ వివాదంలోకి తమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. 'రాజకీయంగా తనను కలవటానికి చాలామంది వస్తుంటారు. అపుడు ఇంట్లోనే ఉండే నా కుమారుడిని కూడా కలుస్తూ ఉండవవచ్చు. అంతమాత్రాన మమ్నల్ని హత్య కేసులోకి లాగటం ఎంతవరకు సబబు?' అని ఆమె ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications