Karthika purnima 2022: కార్తీక పౌర్ణమి ఈసారి చాలా స్పెషల్.. ఎప్పుడు.. ఎందుకో తెలుసా!!
2022 వ సంవత్సరంలో దీపావళి అమావాస్యనాడు సూర్య గ్రహణం పట్టిన విషయం తెలిసిందే. దీంతో దీపావళి పండుగను ఒకరోజు ముందే జరుపుకున్నారు. ఇక ప్రస్తుతం కార్తీక పౌర్ణమి నాడు ఈ సారి చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దీంతో కార్తీక పౌర్ణమి జరుపుకోవడం పైన కూడా ప్రజలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కార్తీక పౌర్ణమి ఎప్పుడు ఏడో తారీఖా? ఎనిమిదో తారీఖా అన్నది ఇప్పుడు భక్తులలో చర్చగా మారింది.

8వ తారీఖు కార్తీక పౌర్ణమి చేసుకోలేము ఎందుకంటే
ఎనిమిదో తారీకు ఉదయం నుంచి సాయంకాలం వరకు కార్తీక పౌర్ణమి తిధి ఉంది. అయితే పౌర్ణమి ఘడియలు చీకటి పడేవరకు లేవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ సంవత్సరం ఇదే సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పబడుతున్న, చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగా కొద్ది నిమిషాలు మాత్రమే, అది కూడా మధ్యాహ్న సమయంలో వస్తుందని అది కూడా మనకు కనపడదని చెబుతున్నారు. ఇక సాయంత్రం గ్రహణం విడిచి పూర్ణచంద్రుడు బయటకు వచ్చేసరికి పౌర్ణమి ఘడియలు ఉండవు కాబట్టి అప్పుడు కార్తీకపౌర్ణమి జరుపుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. సహజంగా చాలామంది ఉదయం వచ్చిన తిధిని ప్రామాణికంగా తీసుకొని, ఆ రోజంతా అదే తిధిని పరిగణిస్తారు. కానీ కార్తీక పౌర్ణమి విషయంలో ఇది సాధ్యం కాదని చెబుతున్నారు. దీంతో 8 వ తారీకు కార్తీక పౌర్ణమి, పౌర్ణమి ఘడియలు ఉండవు కాబట్టి జరుపుకో లేమని సూచిస్తున్నారు.

కార్తీక పౌర్ణమి తేదీ.. సమయం ఇదే
ఇక దృక్ పంచాంగం ప్రకారం నవంబరు 7వ తారీకు సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాలకు పౌర్ణమి తిధి ప్రవేశిస్తుందని, ఎనిమిదో తేదీ సాయంత్రం నాలుగు గంటల 31 నిమిషాలకు ఇది ముగుస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి కి పూర్ణ చంద్రుడు కనిపించడమే ప్రాధాన్యత కాబట్టి, 8 వ తారీకు రాత్రి పౌర్ణమి ఘడియలు ఉండడం లేదు కాబట్టి, ఏడవ తారీఖునే ప్రామాణికంగా తీసుకొని కార్తీక పౌర్ణమి నిర్వహించుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వచ్చే కార్తీక సోమవారం నాటి సాయంత్రం, కార్తీక పౌర్ణమిగా 365 వత్తుల దీపాలను, ఉసిరిక దీపాలను వెలిగించి భగవంతుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు.

కార్తీక పౌర్ణమి.. 365 వత్తులతో దీపారాధనతో విశేష ఫలితాలు
కార్తీక పౌర్ణమి నాడు, అందునా కార్తీక సోమవారం కావడంతో చాలా స్పెషల్ అంటున్నారు. ఆ రోజు ఉదయం భక్తులు నదీస్నానమాచరించి, శివునికి అభిషేకం చేసి, విష్ణువుకి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి , ఉపవాస దీక్షను ఆచరించి చంద్రోదయం తరువాత 365 వత్తులు వెలిగించి దీపారాధన చేస్తే, 365 రోజులలో మనం ఎప్పుడైనా పూజలలో చేసిన లోపాలు తొలగిపోయి, అంతా మంచి జరుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేస్తారు. ఇక ఈ రోజు దాన ధర్మాలు చేస్తే కూడా విశేషమైన ఫలితం ఉంటుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు.

కార్తీక పౌర్ణమి రోజు విశిష్టత ఇదే
శివుడికి, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు శ్రీ మహా విష్ణువు మత్స్య అవతారం దాల్చారని, ఇక శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించి త్రిపురారి గా పూజలు అందుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. త్రిపురాసుర సంహారం ఆనందంలో దేవతలందరు దివి నుంచి దిగి వచ్చి దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని చెబుతారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు అలంకార ప్రియుడైన శ్రీమహావిష్ణువుని భక్తులు విశేషంగా పూజిస్తారు. ఇదే సమయంలో అభిషేక ప్రియుడైన శివునికి పాలు తేనెతో అభిషేకాలు చేసి ఆరాధిస్తారు. ఇక కార్తీక దీపాలను వెలిగించి పూజ చేయడం వల్ల వెయ్యి యుగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications