వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీ కూర్మ జయంతి: శ్రీమహావిష్ణువు యొక్క రెండవ అవతారం..శ్రీకూర్మం పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శ్రీ కూర్మ జయంతి నాడు "శ్రీకూర్మం" క్షేత్రాన్ని దర్శించుకుని తరించాలి అంటారు పెద్దలు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో రెండో అవతారం కూర్మావతారం. కృతయుగంలో దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువు వేడుకున్నారు.

అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అబేధాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది.

Kurmavatar is the second incarnation of lord Vishnu

శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. కళింగరాజైన అనంగభీముడు కూర్మనాధస్వామి ఆలయాన్ని పున:నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కర్పూరేశ్వరుడు, హఠకేశ్వరుడు, సుందేశ్వరుడు, కోటేశ్వరుడు, పాతాళ సిద్దేశ్వరుడు అనే అయిదుగురు ఈశ్వరులు క్షేత్రపాలకులుగా వున్న ఈ క్షేత్రం కళింగరాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిందనీ, కళింగ రాజుల కాలంలో అత్యంత విశిష్టతను చేకూర్చిందని చరిత్ర చెబుతోంది.

కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు అతని భార్య వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి.

ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు. ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట.

దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రివేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా వుంటాయని ఒక కథనం. శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించినవారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు.

ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ వున్న విష్ణుపాదాల దగ్గర పిండప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం ఇక్కడ చేసిన పితృకర్మలకు గయలో పితృకర్మలు చేసిన ఫలితం లభిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక శ్రీ కూర్మ జయంతి రోజున స్వామివారిని దర్శించుకునే వారికి సకల పాపాలు హరింపవేయబడుతాయని విశ్వాసం. అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో హోళీ పున్నమినాడు పెద్దఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామికి కల్యాణోత్సవం, కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని ఇక్కడి పురోహితులు చెబుతున్నారు.

శ్రీ కూర్మ స్తోత్రం :-
నమామి తే దేవ పదారవిందం
ప్రపన్న తాపోప శమాతపత్రం
యన్మూలకేతా యతయోఽ౦జసోరు
సంసారదుఃఖం బహిరుత్క్షిపంతి

ధాతర్యదస్మిన్భవ ఈశ జీవా
స్తాపత్రయేణోపహతా న శర్మ
ఆత్మన్లభంతే భగవంస్తవాంఘ్రి
చ్ఛాయాం స విద్యామత
ఆశ్రయేమ

మార్గంతి యత్తే ముఖపద్మనీడై
శ్ఛన్దస్సుపర్ణైరృషయో వివిక్తే
యస్యాఘమర్షోదసరిద్వరాయాః
పదం పదం తీర్థపదః ప్రపన్నాః

యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా
సంమృజ్యమానే హృదయేఽవధాయ
జ్ఞానేన వైరాగ్యబలేన ధీరా
వ్రజేమ తత్తేఽ౦ఘ్రి సరోజపీఠమ్

విశ్వస్య జన్మస్థితిసంయమార్థే
కృతావతారస్య పదాంబుజం తే
వ్రజేమ సర్వే శరణం యదీశ
స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్

యత్సానుబంధేఽసతి దేహగేహే
మమాహమిత్యూఢ దురాగ్రహాణాం
పుంసాం సుదూరం వసతోపి పుర్యాం
భజేమ తత్తే భగవన్పదాబ్జమ్

తాన్వా అసద్వృత్తిభిరక్షిభిర్యే
పరాహృతాంతర్మనసః పరేశ
అథో న పశ్యన్త్యురుగాయ నూనం
యేతే పదన్యాస విలాసలక్ష్మ్యాః

పానేన తే దేవ కథాసుధాయాః
ప్రవృద్ధభక్త్యా విశదాశయా యే
వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం
యథాఞ్జసాన్వీయురకుంఠధిష్ణ్యమ్

తథాపరే చాత్మసమాధియోగ-
బలేన జిత్వా ప్రకృతిం బలిష్ఠాం
త్వామేవ ధీరాః పురుషం విశన్తి
తేషాం శ్రమః స్యాన్న తు సేవయా తే

తత్తే వయం లోకసిసృక్షయాద్య
త్వయానుసృష్టాస్త్రిభిరాత్మభిః స్మ
సర్వే వియుక్తాః స్వవిహారతంత్రం
న శక్నుమస్తత్ప్రతిహర్తవే తే

యావద్బలిం తేఽజ హరామ కాలే
యథా వయం చాన్నమదామ యత్ర
యథో భయేషాం త ఇమే హి లోకా
బలిం హరన్తోఽన్న మదన్త్యనూహాః

త్వం నః సురాణామసి సాన్వయానాం
కూటస్థ ఆద్యః పురుషః పురాణః
త్వం దేవశక్త్యాం గుణకర్మయోనౌ
రేతస్త్వజాయాం కవిమాదధేఽజః

తతో వయం సత్ప్రముఖా యదర్థే
బభూవిమాత్మన్కరవామ కిం తే
త్వం నః స్వచక్షుః పరిదేహి శక్త్యా
దేవ క్రియార్థే యదను గ్రహాణామ్

ఇతి శ్రీమద్భాగవతే కూర్మస్తోత్తం

English summary
Kurmavatar is the second incarnation of lord Vishnu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X