తాడిపత్రిలో టీడీపీ జెండా..? రాష్ట్రంలో ఏకైక మున్సిపాలిటీ దక్కించుకోనున్న ప్రతిపక్షం..
తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీకి లైన్ క్లియర్ అయింది. ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఓటు హక్కు కల్పించాలని ఎమ్మెల్సీలు చేసుకున్న దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ తిరస్కరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు మహమ్మద్ ఇక్బాల్, శమంతకమణి, గోపాల్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అభ్యర్థనను ఎన్నికల నియమావళి సెక్షన్ 5(2) 4A ప్రకారం తిరస్కరిస్తున్నట్లు నరసింహ ప్రసాద్ వెల్లడించారు.
రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?
ఎక్స్ అఫిషియో మెంబర్లతో కలిపి వైసీపీ బలం 18, సీపీఐ, ఇండిపెండెంట్‌తో కలిపి టీడీపీ బలం 20గా ఉంది. మున్సిపల్ చైర్మన్ స్థానం కైవసం చేసుకోవాలంటే కావలసిన ఓట్లు 19. దీంతో తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీకి అనుకూలంగా మారిపోయింది. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి 'సేవ్ తాడిపత్రి' నిర్ణయం వల్ల మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగిరింది. పట్టణంలో 36 వార్డులు ఉండగా రెండు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 34 వార్డులకు ఎన్నికలు జరగ్గా 18 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.

టీడీపీ మిత్రపక్షం సీపీఐ ఒక వార్డును గెలుచుకుంది. స్వతంత్రులు ఒక వార్డులో విజయం సాధించారు. మిగిలిన 14 వార్డులు వైసీపీకి దక్కాయి. దీంతో మెజార్టీ వార్డులు టీడీపీ, ఆ పార్టీ మిత్రపక్షానికి దక్కడంతో తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి పోటీ చేసిన 24వ వార్డులో ఆయన గెలుపొందారు. రాష్ట్రంలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్న ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రి కావడం గమనార్హం.