అందుకోసమే పవన్ కళ్యాణ్ కవాతు...ఏర్పాట్లు ఇలా!:27 ఎల్ఈడీ స్క్రీన్ లు,1200 మంది వాలంటీర్లు
రాజమండ్రి:దేశరక్షణకోసం సైనికులు కవాతు చేస్తారని, అంతర్గత భద్రత కోసం పోలీసులు కవాతు చేస్తారని, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసే కవాతు మాత్రం రాజకీయ వ్యవస్థలో మార్పు, రక్షణ కోసం చేస్తున్నారని కవాతు కో-ఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ చెప్పారు.
రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ ఈనెల 15న ధవళేశ్వరం బ్యారేజ్‌పై పవన్ నిర్వహిస్తున్న కవాతుకు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. 15న మధ్యాహ్నం మూడు గంటలకు పిచ్చుకలంక నుంచి కవాతు ప్రారంభం అవుతుందని, ఈ కవాతులో మోకులతో 1000మంది గీత కార్మికులు, వలలతో 1000 మంది మత్స్యకారులు, 1000మంది బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు, 1000మంది మైనార్టీలు భాగస్వాములగా పాల్గొంటారన్నారు.
కవాతు ధవళేశ్వరం కాటన్ విగ్రహం వరకు సాగుతుందని, అక్కడ సాయంత్రం 5 గంటలకు సభ ఉంటుందని స్పష్టం చేశారు. ధవళేశ్వరం-వేమగిరి రోడ్డు ఫేసింగ్‌లో సభ నిర్వహిస్తామని కందుల దుర్గేష్ చెప్పారు. ఈ సభకు వచ్చేవారందరూ నేరుగా పవన్‌కల్యాణ్‌ను చూసే అవకాశం ఉండదు కాబట్టి ఆ దారిలో 27 ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

పశ్చిమగోదావరి దిశ నుంచి వచ్చేవారికి విజ్జేశ్వరంవద్ద, ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవారికి వేమగిరివద్ద వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం కేటాయించామన్నారు.
ఎక్కడికక్కడ తాగునీరు, భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కవాతుకు సంబంధించి ఇరిగేషన్, పోలీస్, మత్స్యశాఖ, రెవెన్యూశాఖల నుంచి అనుమతులు తీసుకున్నామన్నారు. బ్యారేజ్వద్ద రివిట్మెంట్ వాల్ ఎత్తు తక్కువగా ఉండడంవల్ల దానివైపు కాకుండా మధ్యభాగాన కవాతు జరిగేలా చూస్తామన్నారు.
బ్యారేజ్‌కు ఇరువైపులా గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కవాతుకు వచ్చినవారు క్షేమంగా ఇంటికి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామని,అందుకోసం 1200మంది వలంటీర్లను నియమంచామని వెల్లడించారు. కవాతు జరిగే ప్రదేశం నుంచి సభ జరిగే ప్రాంతం వరకు 15 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు.