క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు తగ్గిన గిరాకీ.. మూసివేత దిశగా ప్రైవేట్ ఇంజినీరింగ్ అడుగులు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గతంలో చాలా వరకు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు 100 శాతం ప్లేస్‌మెంట్‌ హామీ అని హోరెత్తించేవి. అదీ నిజమేనన్నట్లు క్యాంపస్ సెలక్షన్లు కూడా జరిగేవి. కంపెనీలు భారీ ఎత్తున ప్రాంగణ నియామకాలు చేపట్టేవి. అయితే ఇపుడా ధోరణి తగ్గిందన్నది విజ్డమ్‌ జాబ్స్‌ సర్వేలో తేలిన తాజా సత్యం. ఐఐటీ, ఐఐఎంల వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల భవితవ్యానికి ఎటువంటి ఢోకా లేదు. కానీ సాధారణ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు వాటి యాజమాన్యాలు సరైన వసతులు, టెక్నాలజీ అందుబాటులోకి లేకపోవడంతో నాణ్యత పెంచుకోలేకపోతున్నారు.
దేశంలోని మూడు శాతం ఇంజినీరింగ్ కాలేజీలు మూసివేత దిశగా అడుగులేస్తున్నాయి. గత మూడేళ్లుగా అడ్మిషన్లు సరిగ్గా జరక్కపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో 16 లక్షల మందికి పైగా విద్యార్థులను చేర్చుకోవాల్సి ఉండగా, కేవలం సగం మంది మాత్రమే అడ్మిషన్లు పొందుతున్నారు.

 ఈ సంస్థల్లో 75 శాతం మంది విద్యార్థులకు భవిత

ఈ సంస్థల్లో 75 శాతం మంది విద్యార్థులకు భవిత

ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ విద్యా సంస్థలు మాత్రం తమ విద్యార్థులకు భారీ ప్యాకేజీలు పొందడంలో ఎప్పటిలాగే దూసుకెళుతున్నాయి. ఇక వచ్చిన చిక్కంతా ప్రైవేట్ కళాశాలలతోనే. తమ విద్యార్థులను కంపెనీల్లో చేర్పించడానికి జాబ్‌ ఫెయిర్స్‌, ఇతరత్రా మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ విషయంలో ఫస్ట్ టైర్ సంస్థలు విజయవంతం అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే గతంలో పోలిస్తే ఎక్కువ క్యాంపస్ సెలక్షన్లనే ఆకర్షిస్తున్నాయి. సగటున 75 శాతం విద్యార్థుల భవితకు ఢోకా లేకుండా చేసుకుంటున్నాయి. అయితే రెండో, మూడో శ్రేణి సంస్థల్లోనే ఈ నియామకాలు మరీ 38 శాతానికి పరిమితం అయ్యాయి.

 ఐటీలో 23 శాతం, ప్రధాన ఇంజినీరింగ్ లో 26 % తగ్గుదల

ఐటీలో 23 శాతం, ప్రధాన ఇంజినీరింగ్ లో 26 % తగ్గుదల

గత రెండేళ్లలో రెండో, మూడో శ్రేణి సంస్థల్లో క్యాంపస్‌ ఫ్రెషర్‌ నియామకాలు దాదాపు 21 శాతం మేర తగ్గాయి. ఈ కళాశాలలను సందర్శించే కంపెనీల సంఖ్య కూడా 30 శాతం మేర తగ్గింది. ఐటీ సేవల్లో 23%; ప్రధాన ఇంజినీరింగ్‌ రంగంలో 26% చొప్పున నియామకాలు తగ్గాయి. ఐటీ రంగం, స్టార్టప్‌ల నుంచి ప్రతిష్ఠాత్మకేతర కళాశాలల నుంచి ఉద్యోగార్థులను నియమించుకోవడం బాగా తగ్గడం ఇందుకు నేపథ్యం. సాధారణంగానే నియామకాల ధోరణి తగ్గుముఖం పట్టడంతో కంపెనీలు రెండో, మూడో శ్రేణి సంస్థల వైపు వెళ్లకుండా.. ప్రధాన కళాశాలలతోనే సరిపెట్టుకుంటున్నాయి. బ్రాండ్‌ లేకపోవడంతో ఆయా కంపెనీలకు ఆకర్షించడంలో కళాశాలలు విఫలమవుతున్నాయి.

 సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ సంస్థలు

సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ సంస్థలు

కంపెనీలు కోర్సులు అభ్యసిస్తున్న వారిలో ప్రత్యేక నైపుణ్యాలను ఆశిస్తున్నాయి. వినూత్నతకు, కొత్త తరం సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ప్రైవేట్ ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి భారీగా నియామకాలను చేసుకోవడానికి బదులు ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి కొద్ది మందినే భారీ ప్యాకేజీలతో తెచ్చుకుంటున్నాయి. చాలా వరకు కంపెనీలు కృత్రిమ మేథ, మషీన్‌ లెర్నింగ్‌, డాటా సైన్స్‌, రోబోటిక్స్‌, ఆగుమెంటెడ్ ‌- వర్చువల్‌ రియాల్టీలలో ప్రవేశం ఉన్న విద్యార్థులకు 35-40 శాతం ఎక్కువ ప్యాకేజీని ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాయి. ప్రతిష్ఠాత్మకేతర సంస్థల్లో విద్యార్థులకు నైపుణ్యాలను జొప్పించడంలో వెనకబాటు వల్ల కూడా కంపెనీలు అటు వైపు వెళ్లడానికి జంకుతున్నాయి.

 19 శాతం మందికి మాత్రమే ఉద్యోగార్హత

19 శాతం మందికి మాత్రమే ఉద్యోగార్హత

ప్రాథమిక అంశాలైన భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, సాఫ్ట్‌ స్కిల్స్‌, విశ్లేషణా సామర్థ్యాలు లేకపోవడంతో పాటు.. ప్రధాన అంశాలను లోతుగా అర్థం చేసుకోలేకపోవడం, ప్రధాన సబ్జెక్టులతో పాటు.. ఇతర సబ్టెక్టులపై అవగాహన లేకపోవడం వంటివి ప్రాంగణ నియామకాలను ప్రభావితం చేస్తున్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం.. దాదాపు 73 శాతం మంది విద్యార్థులకు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు లేవు. 58 శాతం మందిలో విశ్లేషణ, పరిమాణాత్మక నైపుణ్యాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రతిష్ఠాత్మకేతర సంస్థల నుంచి విద్యార్థులను నియమించుకోవడానికి కంపెనీలు జంకుతున్నాయి. మొదటి శ్రేణి నగరాల్లో కూడా ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులైన వారిలో కేవలం 19 శాతం మందికి మాత్రమే ఉద్యోగార్హతలు ఉన్నాయి. ఇక చిన్న నగరాల విషయానికి వస్తే ఇది 14 శాతానికే పరిమితమవుతోంది. ఐఐటీల్లో కూడా 66 శాతం మంది (2016-17) మాత్రమే క్యాంపస్ సెలక్షన్లల్లో సత్తా చాటుతున్నాయి. గత రెండేళ్లలో ఐఐటీల నుంచి నేరుగా కంపెనీల్లోకి వెళ్లిన వారి శాతం వరుసగా 79%, 78 శాతంగా ఉంది.

 సిబ్బందికి సరిపడా వేతనాల చెల్లింపుల్లో నిర్లక్ష్యం

సిబ్బందికి సరిపడా వేతనాల చెల్లింపుల్లో నిర్లక్ష్యం

సిలబస్‌, టీచింగ్‌ విధానాలపై సంస్థలకు అవగాహన ఉండడం లేదు. సాంకేతికత, సైన్స్‌ విషయాల్లో బయట జరుగుతున్న మార్పులకు అనుగుణంగా సిలబస్‌ను మార్చుకోవడం లేదన్న అభిప్రాయం ఉంది. విద్యార్థులకు ఏం చెబుతున్నారు.. పరిశ్రమకు ఏం కావాలి అన్నదాని మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించుకోవడానికి చాలా వరకు విద్యా సంస్థలు విఫలం అవుతున్నాయి. కొత్త తరం నైపుణ్యాలు, అంశాలను బోధించే అర్హత గల సిబ్బంది కొరత కూడా ఒక కారణం. పరిశ్రమకు సమాన స్థాయిలో వేతనాలు ఇవ్వక చాలా మంది సిబ్బంది వలస బాట పడుతూ ఉంటారు. దేశంలోని 60 శాతం ప్రైవేట్ సంస్థల్లో అర్హత గల అధ్యాపకులు కొరత కొనసాగుతూనే ఉంటుంది. దీంతో విద్యార్థులు కళాశాలల నుంచి ఉత్తీర్ణులై బయటకు వచ్చిన తర్వాత కోర్సులు చేసి తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఖాళీ ఇంజినీరింగ్ కాలేజీల్లో టాప్‌టెన్ లోనే తెలుగు రాష్ట్రాలు

ఖాళీ ఇంజినీరింగ్ కాలేజీల్లో టాప్‌టెన్ లోనే తెలుగు రాష్ట్రాలు

దేశవ్యాప్తంగా మూడో వంతు ఇంజినీరింగ్‌ కళాశాలలు వచ్చే కొద్ది సంవత్సరాల్లో మూసివేయక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తాజా విద్యా సంవత్సరంతోపాటు 2014-15 విద్యా సంవత్సరం నుంచి వాటిలో 30 శాతం సీట్లు కూడా భర్తీ కాకపోవడంతో వాటిపై మూసివేత కత్తి వేలాడుతున్నట్టేనని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా 3,325 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సుమారు 16.3 లక్షల వరకు సీట్లుండగా.. అందులో ఏటా భర్తీ అవుతున్నది 8.5 లక్షలు మాత్రమేనని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తేల్చింది. 2017-18 లో తెలంగాణలోని 112 కళాశాలల్లో 41,628 సీట్లు ఉండగా 2874, ఆంధ్రప్రదేశ్‌లో 109 కళాశాలల్లో 47,640 సీట్లకు 5687 మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ గణాంకాల ఆధారంగా ఖాళీలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 4, ఏపీ 5వ స్థానాన్ని దక్కించుకున్నాయి.

ఫార్మసీ సీట్లలోనే 80 శాతం భర్తీతోనే సంస్థల మనుగడ

ఫార్మసీ సీట్లలోనే 80 శాతం భర్తీతోనే సంస్థల మనుగడ

అయిదేళ్లు వరుసగా 30 శాతం కంటే సీట్లు భర్తీ కాకుంటే వాటిని మూసివేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఏఐసీటీఈ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకారం దేశంలోని మూడో వంతు కళాశాలల భవిత అగమ్యగోచరమే.‘ఇంజినీరింగ్‌లో సీట్లు భర్తీ కాకున్నా ఫార్మసీలో దాదాపు 80 శాతం నిండుతున్నాయి. దానివల్ల చాలా విద్యా సంస్థలు మనుగడ సాగించగలుగుతున్నాయి' అని అఖిల భారత సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సాంకేతిక విద్యా సంస్థల సమాఖ్య ఉపాధ్యక్షుడు శ్రీని భూపాలం చెప్పారు. సీట్లు భర్తీకాని చాలా కళాశాలలు ఇప్పటికే మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయని, బీటెక్‌ నాలుగేళ్ల కోర్సు అయినందున మరో మూడేళ్లలో అవి మూతపడతాయన్నారు.

 గుడ్డిగా అనుమతులు మంజూరు చేసిన ఐఐసీటీఈ

గుడ్డిగా అనుమతులు మంజూరు చేసిన ఐఐసీటీఈ

ఐటీ హవా కొనసాగిన 2008-10 ప్రాంతంలో దేశవ్యాప్తంగా అధిక కళాశాలలు ఏర్పాటయ్యాయి. విద్యార్థుల లభ్యతపై అంచనాలు లేకుండానే..విద్యా సంస్థలు ఏర్పాటు కాగా ఏఐసీటీఈ సైతం దరఖాస్తు చేసిన వారందరికీ గుడ్డిగా అనుమతులు ఇచ్చింది. 2016-17 నాటికి తమిళనాడులో 526, మహారాష్ట్రలో 369, ఏపీలో 325 కళాశాలలు ఉన్నాయంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. నాణ్యత లేని కళాశాలల్లో చదివితే ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కాలేమని అభిప్రాయం, ఉద్యోగాలు రావన్న నమ్మకంతోనే విద్యార్థులంతా నాణ్యమైన విద్యా సంస్థల వైపే మొగ్గుచూపుతున్నారు. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలు 2 లక్షలకు తగ్గగా...డీమ్డ్‌, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో చేరికలు 2.40 లక్షల మేర పెరగడమే దీనికి నిదర్శనం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Past Two or Three years Campus selections decreases in Engineering sector. Companies prioritise to quality and update modern technology. Bus IIT's, IIM's get top share campus selections. Another side 33 to 50 % private engineering colleges to move closer because there no quality education. If regularly 5 years below which colleges gets 30 % admissions then those colleges will be closed.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి