
బదిలీపై వెళ్తున్న గన్ మెన్ల కోసం సీతక్క కంటతడి, భావోద్వాగానికి గురైన గన్ మెన్లు
ములుగు ఎమ్మెల్యే సీతక్క... కాంగ్రెస్ పార్టీ నుండి ములుగు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసే నిస్వార్థ రాజకీయ నాయకురాలు. ఎమ్మెల్యేను అన్న అహంకారం ఏ మాత్రం లేకుండా ప్రజలతో మమేకమైపోయె సీతక్క తెలంగాణ ఐరన్ లేడీగా గుర్తింపు పొందారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాక్షేత్రంలో ఆమె చేసే సేవలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. కరోనా కష్టకాలంలో మారుమూల ఏజెన్సీ గ్రామాలకు, అక్కడి ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులను మోసుకెళ్ళి వారికి అండగా నిలబడిన సీతక్క చేసిన సాహసం అంతా ఇంతా కాదు.

గన్ మెన్లు బదిలీపై వెళ్ళటంతో సీతక్క కన్నీటి పర్యంతం
సీతక్క అంటే ఓ సాహసం, సీతక్క అంటే ప్రజల సమస్యల కోసం పోరాటం చేసే ఓ ఆయుధం, సీతక్క అంటే ప్రజాప్రతినిధికి సరైన అర్థం. ఇది మాత్రమే కాదు సీతక్క అంటే ఓ భావోద్వేగం అని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రజల కష్టాలు చూస్తే చలించే వ్యక్తి. అంతేకాదు తనతో సన్నిహితంగా ఉన్నవారు తనకు దూరంగా వెళుతున్నా అమితంగా బాధపడే వ్యక్తి.
ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే తాజాగా జరిగిన బదిలీలలో ఇంతకాలం తనకు సెక్యూరిటీ ఇచ్చిన గన్ మెన్లు బదిలీ కావడంతో, వారు తనను వదిలి వెళ్లిపోతున్నారని సీతక్క కన్నీటిపర్యంతమయ్యారు. వారు తనను కంటికిరెప్పలా చూసుకుంటారని భావోద్వేగానికి గురయ్యారు.
గన్ మెన్లు సొంత సోదరిగా చూశారన్న సీతక్క
తన కుటుంబంలో వారంతా కలిసిపోయారని, తనను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదని, బదిలీపై వారు వెళ్లిపోవడం తన మనసుకు ఎంతో కష్టంగా ఉందన్నారు సీతక్క. ఇన్నేళ్ల కాలంలో వారితో కుటుంబ బాంధవ్యం ఏర్పడిందని పేర్కొన్న సీతక్క తాను యుద్ధ రాజకీయం నుండి వచ్చానని, అయినప్పటికీ వారు తననెంతో గౌరవంగా చూసేవారని, తన గౌరవాన్ని పెంచేలా ప్రవర్తించే వారిని సీతక్క పేర్కొన్నారు. గన్ మెన్లు తనను సొంత సోదరి మాదిరిగా చూసుకున్నారని సీతక్క భావోద్వేగానికి గురయ్యారు.

సీతక్క భావోద్వేగం ..గన్ మెన్లు సైతం ఎమోషనల్
ఇన్ని సంవత్సరాల పాటు వారు తనకు అందించిన సేవలకు కన్నీటితో ధన్యవాదాలు చెబుతున్నానని సీతక్క బాగా ఎమోషనల్ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. వారు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సీతక్క పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న గన్ మెన్లను శాలువాలు, పూలమాలలతో సత్కరించిన సీతక్క వారి కోసం కన్నీరు పెట్టుకోగా, గన్ మెన్ల కళ్ళు సైతం చెమర్చాయి. ఎంతోమంది రాజకీయ నాయకులకు సేవలందించే గన్ మెన్లు బదిలీపై వెళ్తే వారి కోసం ఇంతగా కన్నీరు పెట్టుకునే నాయకులను ఇప్పటివరకు మనం ఎప్పుడూ చూడలేదు. కానీ సీతక్క వారిని తన సోదరుల్లాగా భావించి వారి వెళ్లిపోతుంటే కన్నీరు పెట్టుకున్నారు.

సీతక్క గన్ మెన్ లపై చూపించిన అభిమానంపై నెటిజన్లు ఫైర్
సీతక్క తనపై చూపించిన ప్రేమకు గన్ మెన్లు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క గన్ మెన్ల కోసం ఎమోషనల్ అవడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత నిస్వార్ధంగా పనిచేసే రాజకీయ నాయకురాలిని, తన దగ్గర పనిచేసే వారిపై ఆప్యాయతానురాగాలు చూపించే వారిని సీతక్కలోనే చూస్తున్నామని కొనియాడుతున్నారు. ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిజమైన ప్రజా ప్రతినిధి అంటూ ఆమెకు అభినందనలు చెప్తున్నారు. సీతక్క లాంటి ఎమ్మెల్యే ఉండటం గర్వకారణం అంటున్నారు. గొప్ప ప్రజా నేత సీతక్క తన దగ్గర పనిచేసిన పోలీసుశాఖ వారిని సన్మానించటం మంచి పరిణామం అంటున్నారు.