లీకేజీ విద్యార్థులకు సీఐడీ షాక్: ఎంసెట్-3లో నో ఛాన్స్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన విద్యార్థులకు సీఐడీ గట్టి షాకిచ్చింది. ప్రశ్నాపత్రాల లీకేజీకు పాల్పడి అక్ర మ ర్యాంకులు పొందిన విద్యార్థులు ఎంసెట్-3 రాయడం కుదరదని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో వీరు పాత్రధారులుగా ఉన్నందున, పరీక్ష రాయకుండా నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.

గతంలో పీజీ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో పట్టుబడ్డ వారిపై ఆ తర్వాత జరిగిన పరీక్షలు రాయకుండా నిషేధం విధించిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. దీంతో ఎంసె ట్-2 స్కాంలో ఇప్పటివరకు నిర్ధారణ అయిన 64మంది అక్రమ ర్యాంకర్లపై తాజాగా జరుగబోతున్న ఎంసెట్-3 రాయకుండా నిషేధం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

No chance for leakage students to write EAMCET-3

ఇప్పటికే ఈ 64మంది విద్యార్థుల జాబితాను సంబంధిత విద్యాశాఖకు పంపించినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. వీరు బెంగళూరు, పుణె, ముంబైలో శిక్షణ తీసుకున్నారని, వీరి సెల్‌ఫోన్ లొకేషన్, విమానాల్లో వెళ్లివచ్చిన టికెట్లు, హాల్‌టికెట్, ర్యాంకు కార్డులను కూడా తాము సేకరించినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. అయితే ప్రశ్నాపత్రాల లీకేజ్ కుంభకోణంలో 200మందికి పైగా విద్యార్థులు పాత్రధారులుగా ఉన్నారని సీఐడీ తన దర్యాప్తులో తేల్చింది.

ప్రస్తుతం అరెస్టయిన బ్రోకర్లను విచారించినప్పుడు వెల్లడైన అంశాల ఆధారంగా 64 మంది అక్రమ ర్యాంకర్లను సీఐడీ గుర్తించింది. మరో 140మందిని కూడా గుర్తిస్తామని దీనికి వారం రోజులు పడుతుందని, ఈలోపు మిగతా బ్రోకర్ల కోసం వేటసాగిస్తున్నామని సీఐడీ అధికారులు తెలిపారు. వారు వెల్లడించే అంశాల ఆధారంగా మిగతా విద్యార్థుల జాబితాను ప్రభుత్వానికి పంపిస్తామని వివరించారు.

గాలింపు ముమ్మరం

ప్రింటింగ్ ప్రెస్ నుంచే ఎంసెట్ పేపర్ లీక్ చేసిన ఇక్బాల్‌తోపాటు మిగిలిన ముగ్గురు ప్రధాన సూత్రధారుల కోసం వేట సాగిస్తున్నామని సీఐడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్‌లో మూడు దర్యాప్తు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయని చెప్పారు.

అయితే వీరితో సంప్రదింపులు జరిపిన ముగ్గురు బ్రోకర్లను బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామని, వారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి విచారించాల్సి ఉందని తెలిపారు. వీరి విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా ప్రధాన సూత్రధారుల గుట్టు తెలిసే అవకాశం ఉందని తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CID said that no chances for leakage students to write EAMCET-3.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి