• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'ఇన్‌సైడర్‌' తో మాటా మంతీ...!

By Staff
|

ఢిల్లీలో..... అది డిసెంబర్‌ ఆరు కావడం కేవలం యాధృచ్ఛికం. సాయంకాలం.

సూర్యుడి బలహీనమైన కిరణాలన్నింటినీ తుడిచి పెట్టేస్తూ గాలి వీస్తుంది చలిగా, పొడవాటి అర్జున చెట్ల మధ్య నుంచి నడిచి వెళ్తున్నాం. శరీరం మెల్లిగా కంపిస్తోంది. మాటల హోరులో నేనూ కృష్ణుడు. అరున్నరకి పి.వి.తో అప్పాయింట్‌మెంట్‌. అత్యంత కట్టుదిట్టమైన భద్రతలోంచి, నిఘాలోంచి పీవి ఒక మాజీ ప్రధాన మంత్రి అన్న హోదా గుర్తుకు వస్తున్నా లోపల్లోపల ఆయనతో నా సంభాషణ గురించి ఆలోచించుకుంటున్నాను. మేం లోపలికి వెళ్లి కూర్చున్నాం. చిన్న గది. గోడల మీద భారతీయ జానపద శైలిని ప్రతిబింబించే రెండు పెయింటింగ్స్‌ రెండు వేపులా, పరీక్షగా చూస్తే ఒకే కాన్వాస్‌ మీద అనేక పురాణ గాధల్ని చిత్రించిన పెయింటింగ్స్‌ అవి. మరో వైపున ఎత్తున పీవీ వర్ణచిత్రం. దాని నేపథ్యంలో తిరుపతి కాంగ్రెస్‌ ప్లీనరీ పతాకాల నీడలున్నా, ఆ పెయింటింగ్‌ పీవీలోని రాజయకీయవేత్తని కాకుండా పండితుడి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తోంది. పీవి చెయిర్‌ పక్కన గాంధీజీ వెండి విగ్రహం మెరుస్తోంది. పక్కన ఎప్పటిదో పాత కాలం నాటి అలారం. ఆయనకు ఆ అలారంతో ఎంతో అనుబంధం ఉండే ఉండాలి. క్రమశిక్షణాయుతమైన ఆయన దిన చర్యల్ని గమనించి గుండెల్లో పదిలపరుచుకున్నట్టుగా ఉంది అది. పీవీ కూర్చోవాల్సిన కుర్చీ మాకు మరీ దగ్గరగా ఉంది. ఆయనతో సన్నిహితంగానే మాట్లాడవచ్చన్న ఫీలింగ్‌ కలిగింది. అప్పటికే ఆయనతో ఒక రచయితగా మాత్రమే మాట్లాడి రావాలని మనసుకి చెప్పి ఉంచాను. కాని అది ఆయన వీలు పడనివ్వలేదు, అది వేరే సంగతి.

కుశల ప్రశ్నలు అయ్యాక మా మాటలు 'ఇన్‌సైడర్‌'లోకి వెళ్లాయి. ఆయన ఇప్పుడు ఇన్‌సైడర్‌ రెండో భాగం రాయడంలో నిమగ్నమై ఉన్నారు. దానికి సంబంధించిన సామగ్రి గురించే ఆయన ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపించింది. 'ఇన్‌సైడర్‌' రచనా శిల్పాన్ని గురించి ఆయన మాట్లాడితే వినాలని నా ప్రయత్నం. ఇన్‌సైడర్‌ ఒక ఆత్మకథాత్మక చరిత్ర. సమాజం, రాజకీయాలు, వ్యక్తులూ, సంస్థలూ ఇన్నిటి సమిష్టి సంఘర్షణా రూపం. అందునా ఒక దక్షిణాది రాజకీయ పాత్ర సాహిత్యంలో అంతటి ప్రాముఖ్యాన్ని పొందటం బహుశా ఇదే మొదటి సారి కావచ్చు. వివిధ చారిత్రక, సామాజిక సందర్భాల్లో దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తులు ఆయా సృజనాత్మక సాహిత్య రూపాల్లో ఉండే వుంటారు. కాని వాటన్నిటికీ భిన్నంగా నిర్దిష్టమైన రాజకీయ పునాది ఉన్న ఓ వ్యక్తి నవలకు కేంద్ర బిందువుగా నిలిచి, చుట్టూ వున్న సమాజాన్నీ, రాజకీయాల్ని, గతాన్నీ, వర్తమానాన్ని గాఢంగా ఒక లోపలి మనిషిలా చెప్పడం, ఆ పాత్రకు ఎంతో కొంత అనివార్యమైన అంతర్ముఖీనత వుండటం 'ఇన్‌సైడర్‌'కి అదనంగా బలాన్నిచ్చిన అంశం. వివిధ సంక్లిష్ట మానసిక సంఘర్షణలకు ప్రతిరూపంగా వుండే నవల ఇది. అందులో శిల్పసౌందర్యం నన్ను ఆకట్టుకుంది.

'ఇది మనకు కొత్తే. కాని ఇంగ్లీషులో కొత్త కాదనుకుంటా. ఇంగ్లీషులో చాలా వచ్చినట్టున్నాయి. ప్రత్యేకించి ఫిక్షన్‌ చదవడంలో నాకు ఉన్న ఆసక్తి ఈ శిల్పానికి బాగా ఉపయోగపడి వుంటుంది' అన్నారు పీవి. నిజానికి ఒక్కో వాక్యం ఆయన అలవోకగా రాసిందేమీ కాదు. ఆ వయసులో ఇంకొకరికి 'డిక్టేట్‌' చేయడం (ఆయన విశేషంగా గౌరవించే విశ్వనాథ వారి పద్ధతిలో) తప్ప అలాంటి సృజనాత్మక సంఘర్షణని ఎదుర్కొనే శక్తి సాధ్యమా అనిపిస్తుంది. 'కలం పట్టుకుని రాస్తే ఎక్కడయ్యేది? కంప్యూటర్‌ ముందు నేనే కూర్చుని గంటల తరబడి చేసిన తపస్సు అది. ఒక ధ్యానమే అనుకోండి. ఒక్కో వాక్యం ఎన్ని సార్లు రాసి ఎన్నిసార్లు డీలిట్‌ చేశానో! మనసులో ఉన్నదంతా వాక్యంలోకి రావాలి కదా! కంప్యూటర్‌ ముందు కూర్చున్న తర్వాత అన్నీ మరచిపోయి అందులో లీనమై రాసింది అది. ఆ సందర్భాలూ ఆ సన్నివేశాలూ ఏవీ వాస్తవానికి దూరం కావు' అంటారాయన.

ఆయన ఉద్దేశించినట్టుగా 'ఇన్‌సైడర్‌' చదివిన పాఠకుడు ముందుగా ఆ పాత్రల నిజరూపాన్ని శోధిస్తాడు. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ నవల పాఠకుడ్ని పట్టి నిలిపే ఉత్కంఠ అదే. ఆ శిల్పంలో వాస్తవికతా, కాల్పనికతా వొక విచిత్రమైన బిందువు దగ్గిర కలుస్తాయి. వాస్తవికత ఎక్కడ అంతమైందా? కాల్పనికత ఎక్కడ ఆరంభమైందా అని పాఠకుడి 'రెస్పాన్స్‌'ని తానే మనసులో రికార్డు చేసుకుంటూ, మాటి మాటికీ మననం చేసుకుంటూ ఆయన ఈ శిల్పాన్ని రూపొందించుకున్నట్టు అనిపిస్తుంది. అదే విషయం నేను ఆయనతో ప్రస్తావించాను. 'కొన్ని ప్రశ్నలు రీడర్‌ తరఫున నేను వేసుకున్నాను. కొంత మంది ఇతరేతర సందర్భాల్లో పరోక్షంగా వేసిన ప్రశ్నల్ని రికార్డు చేసుకున్నాను. ఆ ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు దొరికాయా లేదా అని వెతుక్కుంటూ రాసుకుంటూ వెళ్లాను. ఆ రకంగా ఇది ఆత్మశోధన, చరిత్ర శోధన కూడా!' అన్నారాయన. థీమాటిక్‌గా ఇన్‌సైడర్‌ని ఒకే ఒక కోణం నుంచి చూడడం సాధ్యపడదు. వ్యక్తిగా పీవి బహుముఖాల విస్తృత రూపం ఈ నవల. సున్నితమైన వైయక్తిక కోణం మొదలుకుని కర్కశమైన రాజకీయ దృక్కోణం వరకూ విస్తరించిన ఈ ఇతివృత్త పరిధిలో నవలారూపం ప్రయోగ మార్గాన్ని అనుసరించింది. కథనంలోని సాధికారికత ఆ ప్రయోగానికి సార్థకతనిచ్చింది. అయితే, అదొక రూప ప్రయోగంగా పరిణమిస్తున్న విషయం రచయితకి సృజన క్రమంలో తెలిసి వుండకపోవచ్చు. సృజనకి అనుభవం ముడి సరుకు. అనుభవాన్ని కేవలం అనుభవంగా చెప్పడం ఒక పద్ధతి. అనుభవాన్ని సమకాలీన వాస్తవికతలో ఒక అంశంగా భావించి చెప్పడం మరో పద్ధతి. ఈ రెండో పద్ధతినే 'ఇన్‌సైడర్‌' రచయిత అనుసరించాడు. రెండో పద్ధతి రచయిత బాధ్యతని రెట్టింపు చేస్తుంది. నిర్దిష్టమైన ఒక అనుభవాన్ని సాధారణీకరిస్తున్నప్పుడు పరిసరాలకు సంబంధించిన అనే పార్శ్వాల్ని రచయిత వ్యగ్రంగా పట్టించుకోవలసి వుంటుంది. అనేక అంశాల్ని ఒక 'నిర్మాణం'గా స్వీకరించాల్సి వుంటుంది. ఆ నిర్మాణం సామాజికతకి కొలమానంగా వుంటుందా లేదా అన్నది గమనించుకోవాలి. అలా గమనంలో వుంచుకోవడానికి వీలుగా, అనేక కోణాలు మనసులోంచీ, మెదడులోంచి జారి పోకుండా ఉండేందుకే పీవి ప్రశ్నోత్తరాల కూర్పుని ఏర్పర్చుకున్నారని అనిపిస్తుంది.

'నవలా రచన సృజనాత్మక ప్రక్రియ కదా, ఇందులో ప్నశ్నోత్తరాల కూర్పు డ్రైగా వుండదా?' అన్న నా ప్రశ్నకు ఆయన 'ప్రతి రచయితా ఒక నిర్మాణ పద్ధతిని ఏర్పర్చుకుంటాడు కదా, వాస్తవికతని చేరుకోవడానికీ, సత్యాన్ని అన్వేషించడానికీ తలా ఒక పద్ధతి. నేను ఈ పద్ధతి సబబుగా వుంటుందని అనుకున్నాను. ఇందులో అయితే మనల్ని మనం జాగ్రత్తగా చెక్‌ చేసుకుంటాం. అన్ని కోణాల నుంచీ, అందరి నుంచీ వచ్చే ప్రశ్నల్నీ మనమే వేసుకుని, రచన క్రమంలో వాటికి జవాబులు వెతుక్కుంటాం. పాత్రల రూప కల్పనలో అవి ఉపయోగిస్తాయి'' అన్నారాయన.

'ఇప్పటికి నేను ఇ-మెయిల్‌ చెక్‌ చేసుకుంటున్నప్పుడు అలాంటి ప్రశ్నల్ని వెతుక్కుంటాను. ఇన్‌సైడర్‌ మొదటి భాగం పూర్తయినా, దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇప్పటికీ వస్తుంటాయి. వాటి గురించి కూడా నేను ఆలోచించుకుంటాను. ఇప్పుడు రెండో భాగానికి సిద్ధమవుతున్న సమయంలో ఇప్పటికి యాభై అరవై మౌలికమైన ప్రశ్నలు నా దగ్గిర వున్నాయి. వాటి గురించి నేను వీలైనప్పుడల్లా ఆలోచిస్తుంటాను. ఇంకా ఎన్ని ప్రశ్నలు వస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటాను. ఆ ప్రశ్నల్లోంచి నేను నవలలోకి వెళ్తాను' అని అన్నారాయన.

పీవిలో ఉన్న సృజనశీలికి కేవలం ఉద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోయే తత్వం లేదని ఈ అన్వేషణ వల్ల మనకు అర్థమవుతోంది. ఉద్వేగాలకు ఎదురీదే తత్వం వున్నవాడే మంచి వచనం రాయగలడు. 'ఇన్‌సైడర్‌' వాక్య నిర్మాణంలో ఇంత లాజికల్‌ స్ట్రక్చర్‌ ఇలాగే సాధ్యపడిందని నాకు అర్థమైంది. సృజన జీవి ఏవేవో సీమల్లో సంచరిస్తూ, ఒక మెరుపులా మెరిసే భావాన్ని చటుక్కున పట్టుకుంటాడన్న కాల్పనిక సృజనాత్మక భావనని 'ఇన్‌సైడర్‌' రచయిత తొలగించారు. సృజనాత్మకత అసిధారావ్రతం. రచనా క్రమం అంతా ఎడతెగని అన్వేషణ. అయితే ఇది సత్యాన్వేషి అయిన రచయితకు మాత్రమే. అలవోకగా, వృత్తిగా రాసేవాళ్ల విషయం కాదు. ప్రొఫెషనల్‌ ఈజ్‌ చాలా సుఖంగా సౌకర్యంగా వుంటుంది. దేనికీ జవాబుదారీతనాన్ని ఇవ్వదు. దేనికీ బాధ్యత వహించదు. హృదయ స్పందనలు తెలియని ఉలిలా అన్నిట్నీ చెక్కుతూ వెళ్లిపోతుంది. అలాంటి చిత్రిక 'ఇన్‌సైడర్‌'లో మనకు కనిపించదు. ఆలోచన, నిగ్రహం, తార్కికత, తాను చెబుతున్న సత్యాల సాధికారికత, వాస్తవ విధేయత అవన్నీ వచన రచనకు ప్రధానమైన సామగ్రి. వాటన్నిటి పైనా అదుపు సాధించిన సృజనాత్మక రచయిత పీవి.

'మీరు అధికారంలో ఉన్న అయిదేళ్ల ప్రస్తావన ఈ రెండో భాగంలో వుంటుందా?' అని అడిగాను నేను. 'ఉండదు' అని నిక్కచ్చిగా చెప్పారాయన. 'నేను కేవలం నా జ్ఞాపకం మీదనో, ఊహ మీదనో ఆధారపడనన్న విషయం మీకు అర్థమై వుండాలి. నేను అధికారంలో ఉన్న ఆ అయిదేళ్ల కాలం గురించి రాయాలంటే నాకు ఆ డాక్యుమెంట్సు తప్పనిసరిగా అవసరం. అవి లేకుండా రాయడం వాస్తవికతనూ, నిజాలనూ దెబ్బ తీసినట్టవుతుంది. నేను ఒక విషయం మాట్లాడుతున్నానంటే ఆ విషయానికి సంబంధించి ప్రతి చిన్న వివరం నా దగ్గిర వుండి తీరాలి. లేకపోతే మాట్లాడను, రాయను' అన్నారు. అంటూనే 'మీరూ కొన్ని ప్రశ్నలు పంపండి. అవి నాకు ఉపయోగపడుతాయి. ఎన్ని ప్రశ్నలకు జవాబు ఇచ్చుకోగలిగితే అంత సులువవుతుంది నా పని' అన్నారు.

'కాని కొన్ని ప్రశ్నలకు మీరు బాధపడతారేమో?'

'బాధ దేనికి? ఇది నా వొక్కడి విషయం కాదు, నా వొక్కడి విషయం కాదు. ప్రజల విషయం. ప్రజల డబ్బు. నేను అధికారంలో వున్నది ప్రజల డబ్బు మీద. వాళ్లకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. దానికి బాధపడడం అంటే తప్పించుకోవడమే' అన్నారాయన. 'ఇన్‌సైడర్‌' లోపలి మనిషి రూపం నాకు తెర తీసినంత స్పష్టంగా కనిపించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X