వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యమాలు కవులను సృష్టించవుః వసీరా

By Staff
|
Google Oneindia TeluguNews

''కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటగలిగినవాడు కూడా కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేడు''- ఈ మినీ కవితని మనలో చాలా మందిమి చదివే వుంటాం; ప్రసంగవశాన ఎక్కడో కోట్‌ చేసి కూడా వుంటాం; కనీసం వేరెవరో ఉటంకిస్తే వినయినా వుంటాం. (ఎనభయి దశాబ్దిలో ఈ ''ద్విపద'' అంత పాపులరయింది!) అయితే దాన్ని రాసింది 'వసీరా' అనే వక్కలంక సీతారామారావు అనే సంగతి తెలిసిన వాళ్లు బహు తక్కువ. ఎందుకంటే ప్రచారార్భాటానికీ, సొంత డబ్బా మాట కచేరీలకీ వసీరా చాలా దూరం. ''మరీ అతి వినియం మనిషి!'' అనిపించే స్థాయిలో వుంటుంది అతని నమ్రత. దాదాపు దశాబ్దంనరగా పాత్రికేయ వృత్తిలో పడికొట్టుకుంటున్నప్పటికీ, వసీరా ''పల్లెటూరి గబ్బిడాయి''గానే మిగిలి ఉన్నాడు. (కేవలం ఆ ఒక్క కారణం చేతనే అతను అనేకుల ప్రేమాభిమానాలకు పాత్రుడు కాగలగుతున్నాడు) పట్నవాసపు పోకిరి పోకిళ్లు అతని తత్వానికి కానీ, కవిత్వానికి కానీ సోకకపోవడం విడ్డూరమే మరి.

ప్రజాసాహితి పత్రికలో వచ్చిన వసీరా కవితలు అతన్ని కొత్త తరం పాఠకులకు సన్నిహితుణ్ని చేశాయి. అందుకే అతని తొలి కవితాసంకలనం 'లోహనది'లో ముందుగా ఆ పత్రికకే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వసీరా రాసిన 'డీహ్యూమనైజేషన్‌' కవిత అతనికి సీరియస్‌ కవి ప్రతిపత్తిని తెచ్చిపెట్టింది. ఇవాళ్టి వరకూ దాన్ని అతను నిలబెట్టుకుంటూనే వున్నాడు. వసీరా ఆలోచనల్లో, నమ్మకాల్లో, మూఢ నమ్మకాల్లో చాలా మార్పులు వచ్చాయి. కానీ, అతని సీరియస్‌నెస్‌లో గానీ, ప్రయోజనశీలంలో గానీ ఎలాంటి కల్తీ కనిపించదు. బహుశా ఈ విషయంలో వసీరా ఒంటరివాడు!

ఇరవయ్యేళ్లుగా-విసుగూ విరామం లేకుండా- కవిత్వం రాస్తూ, రెండు పుస్తకాలు (లోహనది, మరోదశ) కూడా ప్రచురించిన వసీరా త్వరలో మూడో పుస్తకం ద్వారా మీ ముందుకొచ్చే ప్రమాదం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒకవేళ అతనికి అలాంటి ''పాపపుటాలోచన'' పుట్టకపోతే, ఇన్‌స్టిగేట్‌ చేసి అతని చేత ఆ 'తప్పు' చేయించేవాళ్లు డజన్లాది మంది ఉండనే వున్నారు. ఏదో మిమ్మల్ని ముందస్తుగా హెచ్చరించాల్సిన బాధ్యత ఉన్నవాణ్ని కనక ఈ ముక్క మీ ముందుంచుతున్నాను.

వసీరా మరీ ముంగిలా ముడుచుకుపోయే మనిషేం కాదు. అలాగని చొరవగా సంభాషణ సాగించేవాడూ కాదు. అతనికి ఇష్టమయిన రచయిత గురించో, రచన గురించో సూపర్లేటివ్స్‌తో గలగలా మాట్లాడ్డానికి చొరవ చేస్తుంటాడు. అంతే తప్ప సీరియస్‌గా తన ఆలోచనలని ఇతరులతో షేర్‌ చెయ్యడానికి ఉషారుగా ముందుకు రాడు. అలాంటివాడితో ఇంటర్వ్యూ చేయడంలోని ఇబ్బంది ఇంతింత కాదు. నానా అవస్థలూ పడి వసీరాతో నాలుగు ముక్కలు మాట్లాడించగలిగాను. ఇది మీ కోసం-కేవలం మీ కోసం మాత్రమే.....

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X