1500 కోట్ల కుంభకోణం: బయటపెట్టిన బెంజ్ కారు! ఎలా జరిగిందంటే?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌‌లో విశాఖపట్టణంలో కేంద్రంగా జరిగిన రూ. 1500 కోట్ల భారీ కుంభకోణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇంత పెద్ద కుంభకోణమా? 1500 కోట్ల రూపాయలా? అంటూ సగటు విశాఖవాసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కుంభకోణం ఎలా బయటపడిందా? అనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి 24ఏళ్ల యువకుడే కావడం గమనార్హం. అతనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్టోన్‌ క్రషర్‌ యజమాని వడ్డి శ్రీనివాసరావు కుమారుడు మహేష్‌ (24).

ఇక ఈ కుంభకోణం ఎలా బయటపడిందంటే... కోల్‌కతాలో ఉల్లిపాయల ఏజెంట్‌గా పని చేసిన శ్రీకాకుళానికి చెందిన వడ్డి శ్రీనివాసరావు...అక్కడ సంపాదించిన డబ్బుతో శ్రీకాకుళం పరిసరాల్లో చిన్నపాటి మైనింగ్‌ వ్యాపారం ప్రారంభించారు. చుట్టుపక్కలవారు చూస్తుండగానే ఆ కుటుంబం మారిపోయింది. ఇల్లు, జీవన విధానం ఇలా అన్నింట్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఖరీదైన కార్లు, విలాసాల టూర్లు ప్రారంభమయ్యాయి.

సాధారణంగా ఇలాంటి వారి బ్యాంకు లావాదేవీలపై ఐటీ విభాగం ఒక కన్నేసి ఉంచుతుంది. ఎవరికీ తెలియకుండా హవాలా వ్యాపారంలో కోట్లు పోగేసిన వడ్డి మహేశ్‌ ఇటీవల మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు కొన్నాడు. దీంతో అతని ఆర్థిక మూలాలపై ఆరాతీసింది ఐటీ విభాగం. శ్రీకాకుళంలో చిన్న మైనింగ్ కంపెనీ పెట్టిన వ్యాపారికి బెంజ్ లగ్జరీ మోడల్ కొనేంత లాభాలా? అని ఆశ్చర్యపోయిన ఐటీ శాఖాధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.

vaddi mahesh

దీంతో వందల కోట్ల హవాలా డొంక కదిలింది. తండ్రి సహకారంతో మహేష్.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో వ్యాపారాలు చేస్తున్నామంటూ పలు షెల్ కంపెనీలు సృష్టించారు. తప్పుడు టర్నోవర్‌ నివేదికలను పుట్టించారు. వివిధ పేర్లతో భారీ సంఖ్యలో పాన్‌ కార్డులు సమకూర్చుకున్నారు. మొత్తం 12 ఉత్తుత్తి కంపెనీల పేరిట ఏకంగా 29 బ్యాంకు ఖాతాలు తెరిచారు. వాటిలో 12 ఖాతాలు వడ్డి మహేశ్‌ కుటుంబ సభ్యులవే కావడం విశేషం.

ఈ బ్యాంకు ఖాతాల ద్వారా హవాలా మార్గంలో డబ్బును విదేశాలకు తరలించడం మొదలుపెట్టారు. ఒక్క డాలరుకు 85 పైసల కమీషన్‌ చొప్పున తీసుకుని భారీ ఎత్తున.. విదేశాల నుంచి కస్టమైజ్డ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేస్తున్నామని చెబుతూ.. నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ ద్వారానే చైనా, హాంకాంగ్‌, సింగపూర్‌ దేశాలకు డబ్బు పంపారు.

రెండేళ్లపాటు నిర్వహించిన ఈ దందాలో 569 కోట్ల రూపాయలు విదేశాలకు పంపినట్టు ఐటీ శాకాధికారులు గుర్తించారు. దీంతో లెక్కలు వేసిన అధికారులు మొత్తం 1500 కోట్ల రూపాయలు ఈ కుంభకోణంలో చేతులు మారినట్టు గుర్తించారు. తొలిదశలో 578 కోట్ల రూపాయలు వీరికి చెందిన 29 అకౌంట్లలో జమ కాగా, అందులో 569 కోట్ల రూపాయలు వేర్వేరు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు.

ఈ తర్వాత 800 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో చైనా, హాంకాంగ్‌, సింగపూర్‌ తదితర దేశాల్లోని ఐదు కంపెనీలకు తరలించినట్లు గుర్తించారు. దీని కోసం తమ మైనింగ్ కంపెనీలోని ఉద్యోగుల పేర్లను కూడా వాడుకున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు.

నిందితుడిని పోలీసులకు అప్పగింత

బ్యాంకు అధికారులతో కుమ్మక్కై చేసిన మోసం కావడంతో నగర పోలీసులకు సైతం సమాచారం ఇచ్చారు ఐటీ అధికారులు. ప్రధాన నిందితుడు మహేశ్‌ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కూడా దీనిపై కూపీ లాగగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లుగా పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన కొందరిని చూపించారని నిర్ధారించారు.

ఉత్తరాంధ్రలో భారీ స్కాం, విదేశాలకు రూ.1,365 కోట్లు తరలింపు, పోలీసుల అదుపులో కీలక నిందితుడు

విశాఖ పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేయగా... వడ్డి మహేశ్‌ తమ బంధువేనని... తాము లారీ క్లీనర్లుగా జీవిస్తూ పొట్టపోసుకుంటున్నామని చెప్పారు. చాలా కాలం కిందట తమతో పేపర్ల మీద సంతకం చేయించుకున్నాడని... ఎందుకు చేయించుకున్నాడన్న వివరాలు మాత్రం తమకు తెలియవని చెప్పారు.

2014 నుంచే హవాలా దందా

వడ్డి మహేశ్‌ హవాలా లావాదేవీలకు, మోసాలకు పాల్పడుతున్నాడని తెలిసి ఐ.టి. అధికారి ఎం.వి.ఎన్‌.శేషుభావనారాయణ ఫిర్యాదు చేయడంతో ఎంవీపీ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ తెలిపారు. మహేశ్‌ 2014 నుంచి హవాలా వ్యాపారం చేస్తున్నట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. అతడితో పాటు తండ్రి శ్రీనివాసరావు, ఆచంట హరీష్‌, ఆచంట రాజేశ్‌, ప్రశాంత్‌కుమార్‌ రాయ్‌ బర్మన్‌, ప్రవీణ్‌కుమార్‌ ఝా, ఆయుష్‌గోయల్‌, వినీత్‌గోయంకా, వికార్‌గుప్తా తదితరులు కుమ్మక్కయ్యారని చెప్పారు.

2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ.1,500 కోట్ల హవాలా లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. వ్యవహారం మొత్తం మహేశే నడిపించాడా? అతని వెనక ఎవరైనా సూత్రధారులు ఉన్నారా? అన్న విషయాల్ని సైతం ఆరా తీస్తున్నామని సీపీ తెలిపారు. ఇంత పెద్ద స్కాంలో ఎవరైనా రాజకీయ నాయకులు లేదా బడా పారిశ్రామికవేత్తల హస్తం కూడా ఉండవచ్చునని, ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

9మంది నిందితులపై కేసులు పెట్టాం: డీసీపీ

విశాఖ కేంద్రంగా జరిగిన భారీ హవాల కుంభకోణంలో 9మంది నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు డీసీపీ నవీన్ గులాటీ చెప్పారు. విశాఖ, కోల్‌కతాల్లో డొల్లకంపెనీలను ఏర్పాటు చేసిన నిందితులు 30 బ్యాంకు ఖాతాల్లో రూ.680 కోట్లు జమచేసినట్లు డీసీపీ తెలిపారు. వీటిల్లో రూ.570 కోట్లను చైనా, సింగపూర్‌, హంకాంగ్‌లకు తరలించారన్నారు. ఏ1 వడ్డి మహేశ్‌, ఏ2గా వడ్డిశ్రీనివాసరావు, ఏ3గా ఆచంట హరీశ్‌, ఏ4గా ఆచంట రాజేశ్‌లను పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన ప్రసన్నకుమార్‌, ప్రవీణ్‌కుమార్‌లు చార్టెడ్‌ అకౌంటెంట్లని ఆయన తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The police here on Friday registered cases against nine persons for allegedly siphoning off Rs 1500 crore through fraudulent foreign remittances by forming fake companies.
Please Wait while comments are loading...