ఏపీ స్ధానిక పోరు అప్పుడే- జగన్ భారీ స్కెచ్-తిరుపతితో లింకు-నిమ్మగడ్డ స్ధానంలో ఆమె...
ఏపీలో గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను తిరిగి నిర్వహించే విషయంలో సీఎం జగన్ భారీ స్కెచ్ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు కరోనా సెకండ్‌వేవ్, బ్రిటన్ వైరస్ వ్యాప్తి, వ్యాక్సిన్ పంపిణీ పేరుతో సవాలక్ష కారణాలు వెతికినా హైకోర్టు ఆదేశాల ప్రకారం అవేవీ ఫలించలేదు. అయితే మార్చిలో నిమ్మగడ్డ రిటైర్మెంట్ తర్వాత ఏప్రిల్, మే నెలల్లో స్ధానిక పోరు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా వెల్లడించారు. అయితే నిమ్మగడ్డ స్ధానంలో ప్రభుత్వానికి విశ్వసనీయమైన అధికారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించబోతున్నారు.
స్ధానిక పోరుపై పట్టువీడని నిమ్మగడ్డ- హైకోర్టుకు మరో హామీ- చిక్కుల్లో జగన్ సర్కార్

స్ధానిక పోరుపై వైసీపీ సర్కార్ తకరారు
ఏపీలో కరోనా కారణంగా గతేడాది వాయిదా పడిన స్ధానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికీ, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కూ మధ్య ప్రచ్ఛన్న యుద్దం సాగుతూనే ఉంది. నిమ్మగడ్డ హయాంలో స్ధానిక ఎన్నికలు జరిగితే తమకు ఎట్టి పరిస్ధితుల్లోనూ న్యాయం జరగదనే నిర్ణయానికి వచ్చేసిన ప్రభుత్వం... ఎలాగైనా వీటిని అడ్డుకోవాలని శతవిథాలా ప్రయత్నాలు చేసింది. దీంతో గతేడాది ఎన్నికలు లేకుండానే ముగిసిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరిలో పంచాయతీ పోరు నిర్వహణకు నిమ్మగడ్డ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కరోనా సెకండ్ వేవ్, వ్యాక్సిన్ పంపిణీ పేరుతో అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. అయినా కుదరలేదు. దీంతో పంచాయతీ పోరు ఖాయమైపోయింది.

స్ధానిక పోరుకు జగన్ స్కెచ్ ఇదే...
గతేడాది మార్చి నెలలో కరోనా కారణంగా వాయిదా పడిన స్ధానిక పోరును సరిగ్గా ఏడాది పూర్తయ్యాక నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి స్ధానిక ఎన్నికలు వాయిదా పడి ఏడాది పూర్తవుతుంది. అదే సమయంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ ఏడాది మార్చితో పూర్తవుతుంది. దీంతో ఆయన ఇలా వెళ్లిపోగానే అలా కొత్త కమిషనర్‌ను నియమించి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇదే విషయాన్ని తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నిక పూర్తి కాగానే స్ధానిక పోరుకు వెళ్లాలని భావిస్తున్నట్లు శ్రీకాకుళంలో సాయిరెడ్డి వెల్లడించారు. దీంతో సీఎం జగన్ దీనికి పక్కా స్కెచ్ రెడీ చేసి పెట్టినట్లే కనిపిస్తోంది.

తిరుపతి ఫలితంతో లింక్
తిరుపతి లోక్‌సధ స్ధానానికి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనుంది. మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. ఇక్కడ విజయంపై వైసీపీ ధీమాగా ఉంది. సిట్టింగ్ స్ధానం కావడంతో పాటు రాష్ట్రంలో తాజా పరిస్దితులు తమకు అనుకూలంగా ఉన్నాయని వైసీపీ భావిస్తోంది. దీంతో ఉప ఎన్నికలో గెలిచి ప్రజల మద్దతు తమకే ఉందని చాటుకుని స్ధానిక పోరుకు వెళ్లేందుకు వైసీపీ సన్నాహాలు చేసుకుంటోంది.. కాబట్టి తిరుపతి ఉప ఎన్నిక ఫలితం రాగానే స్ధానిక సంస్ధల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.

నిమ్మగడ్డ స్ధానంలో ఆమెకు ఛాన్స్
ఏపీలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ఈ ఏడాది మార్చి నెలతో పూర్తవుతుంది. ఆయన పదవీ విరమణ చేయగానే ప్రభుత్వానికి తమకు నచ్చిన వారిని ఈసీగా నియమించుకునే అధికారం ఉంది. దీంతో నిమ్మగడ్డ స్ధానంలో మరో విశ్వసనీయమైన అధికారిని నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎస్‌గా పదవీ విరమణ చేసిన నీలం సాహ్నేను ఎన్నికల కమిషనర్‌గా నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ పదవీకాలం ముగియకపోవడం, ఆమె పదవీకాలం ముగియడంతో తాత్కాలిక ఏర్పాటుగా ఆమెకు సీఎం ముఖ్య సలహాదారుగా నియమించారు. నిమ్మగడ్డ రిటైర్ కాగానే ఈసీ బాధ్యతలు ఆమెకు అప్పగించనున్నారు.