• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పంజాబ్ కాంగ్రెస్: అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ - ఈ ఇద్దరిలో ఎవరిది పై చేయి కాబోతోంది?

By BBC News తెలుగు
|
పంజాబ్ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ సిద్ధూ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.

కెప్టెన్ అమరీందర్ సింగ్‌ ప్రభుత్వంపై సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయి. శనివారం నాడు కీలక నిర్ణయం ఉంటుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చండీగఢ్‌లో జరగబోయే పార్టీ సమావేశానికి అందరూ హాజరు కావాలంటూ పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి.

పెను మార్పులు ఉంటాయంటూ పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ చేసిన ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

ఈ సమస్యకు రాహుల్ గాంధీ సీరియస్ పరిష్కారం చూపబోతున్నారని, ఈ నిర్ణయం వల్ల పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పని చేస్తాయని జాఖడ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

https://twitter.com/sunilkjakhar/status/1439124993485377538

శనివారం సాయంత్రం జరిగే సమావేశం గురించి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ హరీశ్ రావత్ ట్వీట్ చేశారు.

https://twitter.com/harishrawatcmuk/status/1438928075803168771

వివాదం ముగియలేదా?

శనివారం సాయంత్రం జరగబోయే సమావేశం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశాలన్నీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో, ఆయన పిలుపు మేరకు జరిగాయి. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హైకమాండ్ స్వయంగా కోరింది. దీంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి.

ఈ సమావేశంలో కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధూ ఇద్దరు తమ పక్షాన ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయవచ్చని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఈ సమావేశం తర్వాత ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవచ్చని కూడా అంటున్నారు.

మరోవైపు, లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని డిమాండ్ చేశారు. తద్వారా తమ బలం ఏమిటో చూపిస్తామని వారు అంటున్నట్లు కూడా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రిని మార్చాలని కూడా వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

సమస్య ఎప్పటి నుంచి?

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ ‌అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య వివాదం చాలా కాలంగా నడుస్తోంది. సిద్ధూ బీజేపీని వదిలి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుంచి వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్‌లోకి వచ్చిన సిద్ధూకు మంత్రి పదవి దక్కింది. అయితే సీఎంతో విభేదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు సిద్ధూ మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు.

అమరీందర్ సింగ్‌కు ఇష్టం లేకపోయినా, కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధూకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.

కొన్నాళ్లు ఇద్దరు నేతలు దిల్లీకి వచ్చి కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్యా ఒప్పందం కుదిరిందని, విభేదాలు సమసిపోయాయని ప్రచారం జరిగింది. కానీ, తాజా ఘటనల తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టమైంది.

వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన తరుణంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ విభేదాలు రచ్చకెక్కాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Punjab Congress: Amarinder Singh, Navjot Singh Sidhu - Which of these two is going to get the upper hand?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X