• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సందర్భం గద్దర్: విప్లవ సంక్షోభం, కాలానుగణ చర్చ

By Pratap
|

తాను మావోయిస్టు పార్టీ నుంచి విడిపోతున్నట్లు ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ చేసిన ప్రకటన చాలా మంది ఆశ్చర్యం కలిగించింది. కొంత ఎక్కువ మందికే ఆగ్రహం తెప్పించింది. కొద్ది మందికి ఆనందాన్ని కూడా ఇచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు ప్రాంతాన్నే కాదు, ఇతర రాష్ట్రాలను కూడా గద్దర్ పాట ప్రభావితం చేసింది. ఆ పాట ప్రభావంతో విప్లవోద్యమంలోకి వెళ్లినవారు తప్పకుండా ఉన్నారనే విషయాన్ని అంగీకరించాల్సిందే.

పాల పిట్టలై వస్తారా నా బిడ్డలూ అన్నప్పుడే కాదు, ఇతర గీతాలను ఆలపిస్తూ ఇచ్చిన ప్రదర్శనలు 1980 దశకంలోనే కాదు, ఆ తర్వాతి దశకంలో కూడా రోమాలు నిక్కబొడుచుకునే ఆవేశాన్ని ఇచ్చాయి. ఓ వైపు భయం, మరో వైపు ఆవేశం ముప్పిరిగొనగా, సమాజాన్ని సమూలంగా మార్చాలనే లక్ష్యంతో విప్లవం వైపు అడుగులు వేసిన యువత ఎక్కువే.

సమాజం మార్పునకు మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం సరిపోదని అంటూ అంబేడ్కర్, ఫూలే కూడా కావాలని ఆయన అంటూ తాను విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిన విషయాన్ని చెప్పారు. లోపల అంతర్గత ఆ విషయంపై చాలానే చర్చ చేశానని ఆయన అంటున్నారు. అది బయటి ప్రపంచానికైతే తెలియదు. మావోయిస్టు పార్టీని (అప్పటి పీపుల్స్ వార్ పార్టీని) కుల ప్రాధాన్యతపై ప్రశ్నిస్తూ అప్పటికే కొద్ది మంది ఉన్నారు.

తెలంగాణలోని కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలను ఉర్రూతలూగించింది. జగిత్యాల, గోదావరి లోయ పోరాటాలు ప్రభుత్వాలను వణికించాయి. ఫలితంగా అప్పటి ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాలుగా కూడా ప్రకటించింది. కానీ, ఇప్పుడు అది విస్తరించకపోగా, గిడసబారినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ గిరిజన ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిస్తోందని అంటున్నారు.

విప్లవోద్యమాలను సమర్థించేవాళ్ల మాట ఎలా ఉన్నా, వాస్తవాన్ని మాత్రం అంగీకరించక తప్పదు. మైదాన ప్రాంతాలకు అది విస్తరించలేకపోయిందనేది ఆ వాస్తవం. ఇందులో కుల ప్రత్యేకతను గుర్తించకపోవడం ఒక్కటే ఉందా, కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకుని అమలు చేయడంలో విఫలమైందా అనేది కూడా ఇక్కడ అప్రస్తుతం.

కుల ప్రత్యేకతను గుర్తించడంలో, దానికి అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకోవడంలో విప్లవోద్యమం విఫలమైందని వస్తున్న వాదన కొత్తది కాదు. ఇప్పుడు గద్దర్ చెబుతున్నది కొత్తదీ కాదు. 1980 దశకం చివరలోనే ఆ చర్చ ప్రారంభమైంది. అలా గుర్తించడంలో విఫలమైందని చెప్పే జనశక్తి పార్టీ నుంచి బయటకు వచ్చి వీరన్న మరో విప్లవ పార్టీని పెట్టారు. ఆ విప్లవ పార్టీ ఏమైంది, ముందుకు సాగలేదు. విప్లవోద్యమ కార్యాచరణలో కుల ప్రత్యేకతను గుర్తించకపోవడంలోనే కాదు, కాలానుగుణంగా కార్యాచరణను రూపొందించుకోవడంలోనూ వైఫల్యం ఉందనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది.

ప్రత్యామ్నాయ శక్తులు ఎప్పుడు తుపాకి వాడాలో శంకర్ గుహ నియోగి స్పష్టంగానే చెప్పి ఉన్నాడు. తుపాకి గొట్టం ద్వారానే విప్లవం వస్తుందనే సూత్రాన్ని విప్లవోద్యమం గుడ్డిగా నమ్మి ఆచరించిందని కూడా అనుకోక తప్పదు. అదే సమంయలో మార్క్సిజాన్ని కేవలం హేతువాదంగా విశ్వసించడంలో కూడా కొంత వైఫల్యం ఉండవచ్చు.

గద్దర్ పాట ఆగ్రహాన్ని, ఆవేశాన్ని కలిగించి ఆలోచనను ద్వితీయం చేసిందని, దానివల్ల కూడా నష్టం జరిగిందని చెప్పేవాళ్లు కూడా ఉండవచ్చు. కానీ, ఆలోచనాపరులు కూడా విప్లవోద్యమంలోకి వెళ్లారు. కానీ, ఏమైంది? స్వాతంత్య్రానికి పూర్వం సిపిఐ చేసిన విప్లవోద్యమాలు ఏ దారి పట్టాయనేది కూడా ఆలోచించాలి.

K Nishanth on alternative politics in Gaddar context

నెహ్రూ సోషలిజాన్ని సిపిఐ ఆలింగనం చేసుకుని మార్క్సిస్టు కార్యాచరణను ద్వితీయం చేసిన సందర్భమే. ఇప్పుడు, విప్లవోద్యమ సందర్భం కూడా. 1969 తెలంగాణ ప్రత్యేక ఉద్యమం సఫలం కాకపోవడం వల్ల విప్లవోద్యమానికి బలం చేకూరిన మాటను కూడా అంగీకరించాలి. మళ్లీ 1998 ప్రాంతంలో ఉప్పెనలా ఎగిసిపడిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం భౌగోళిక తెలంగాణను సాధించిన సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి విప్లవోద్యమం బేషరతుగానే మద్దతు ప్రకటించిందని చెప్పాలి. కానీ, 1969లో మాదిరిగా అది ఈసారి క్యాడర్‌ను పెంచుకోలేకపోయింది. యువత విప్లవోద్యమం వైపు వెళ్లడానికి సుముఖత ప్రదర్శించలేదనే వాస్తవాన్ని గుర్తించాల్సి ఉంటుంది. పాలక వర్గాలపై నిరసన అది ఆత్మహత్యల రూపంలో వ్యక్తమైంది. ఆత్మహత్యలను మనం మరో రకంగా చూడవచ్చు కానీ తీవ్రమైన నిరాశ, అసంతృప్తి పేరుకుపోయి ప్రత్యామ్నాయం ఆశాజనకంగా లేనప్పుడు వ్యక్తమయ్యే నిరసన అది.

తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు గానీ ఆ తర్వాత గానీ విప్లవ సానుభూతిపరులు, విప్లవోద్యమాన్ని విశ్వసించినవాళ్లు (వాళ్లను మేధావులుగానూ కవులుగానూ గుర్తించవచ్చు) ఇప్పుడు ఎటు పయనించారనేది చూడాలి. అలా చూసినప్పుడు చరిత్ర తప్పకుండా పునరావృతమైన విషయం అర్థమవుతుంది. సిపిఐ నెహ్రూ సోషలిజాన్ని భుజానికెత్తుకున్న తర్వాత కమ్యూనిస్టు మేధావులు, రచయితలు సినీ రంగం వైపు వెళ్లారు. పాలకవర్గంతో రాజీ పడ్డారు. సాహిత్య, కళరంగాలకు చెందిన సంస్థల్లో చేరారు. వాటి పీఠాలను కూడా అధిష్టించారు.

ఇప్పుడు తెలంగాణలో అదే పరిస్థితి ఉందంటే కోపగించుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఆంధ్ర పెత్తందార్లు, దోపిడీదార్లు ఇంకా తెలంగాణను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనతో వారు పాలక వర్గాలతోనే కాదు, ప్రభుత్వంతో మిలాఖత్ కావడానికి సిద్ధపడ్డారు. వారి వాదనలో వాస్తవం కూడా ఉంది. తెలంగాణ ఏర్పడి, తెలంగాణకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్ర ఆధిపత్యవాదులు, పారిశ్రామికవేత్తలు ఆ ప్రయత్నాలు చేశారు. ఇంకా ఆ పరిస్థితి ఉందా, ఆ పరిస్థితి దాటిన తర్వాత వారు తిరిగి వారు తమ ప్రత్యామ్నాయ కార్యాచరణ వైపు వస్తారా, అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది.

పాలకవర్గాలతో రాజీ పడి, పదవులూ అవార్డులూ ఇతరేతర ప్రయోజనాలు పొందుతున్నవారున్నారు, వాటి కోసం కాచుకుని కూర్చున్నవారూ ఉన్నారు. కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చిందని, అభివృద్ధి జరుగుతున్నప్పటికీ అది సరైన దిశలో జరగడం లేదని, అభివృద్ధి కింది నుంచి పైకి జరగాలి గానీ పై నుంచి కిందికి జరుగుతోందని గద్దర్ అంటున్నారు. భౌగోళిక తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడే అది అలా ఉంటుందనే విషయం తెలియంది కాదు. ఇవాళ కొత్తగా చెప్పాల్సిన విషయం కూడా కాదు.

విప్లవోద్యమానికి పురుడు పోయడంలో ప్రధాన పాత్ర పోషించినవారు, విప్లవోద్యమానికి ఊపిరులూదినవారు చాలా మంది చేస్తున్నవాదనకు, వారి కార్యాచరణకు పొంతన కుదరడం లేదు. విప్లవోద్యమంపై విమర్శలు ఎక్కుపెట్టినవారు ప్రత్యామ్నాయ కార్యాచరణను రూపొందించి ముందుకు సాగాలనే విషయాన్ని (కెజి సత్యమూర్తి అలియాస్ శివసాగర్ మినహాయింపు కావచ్చు) గాలికి వదిలేసి పదవులు, అవార్లులు అందుకోవడానికి సిద్ధపడ్డారు. అది వాళ్ల తప్పు కూడా కాదు. విప్లవోద్యమం కూడా మైదాన ప్రాంతంలో రాజ్యాంగ పరిధిలో విప్లవ భావజాలాన్ని ప్రచారం చేసే మేధావులను, కపులను, రచయితలను ఎంచుకోవడంలో తప్పటడుగు వేసిందని కూడా చెప్పాలేమో.

తమ కార్యాచరణను వ్యతిరేకిరించినవారిని పూర్తిగా శత్రుపూరిత వైఖరితో (కె. బాలగోపాల్ ఇందుకు మినహాయింపు కావచ్చు, అందుకు కుల ప్రత్యేకత కూడా కారణం కావచ్చు) చూసే ధోరణిని పాటించిందని చెప్పడంలో సందేహం అక్కరలేదు. వారు వేసిన ప్రశ్నల పట్ల దృష్టి సారించాల్సిన అవసరాన్ని విస్మరించిందనే చెప్పాలి.

లుంపెన్ శక్తులను విప్లవీకరించే పని కూడా చాలా యాంత్రికంగా జరిగినట్లు కనిపిస్తుంది. అలాంటి లంపెన్ శక్తులు విప్లవోద్యమంలో చేరి, తిరిగి బయటకు వచ్చి చేసిన పనులు విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టమే చేశాయి. అది ఇక్కడ చర్చనీయాంశం కాదు. కానీ, సరైన ప్రత్యామ్నాయ శక్తులను గుర్తించి ప్రజాస్వామిక ఉద్యమాలను ధీటుగా నడిపించడంలో మాత్రం విఫలమైనట్లు చెప్పవచ్చు.

ఏమైనా, ఇప్పుడు ఓ ప్రత్యామ్నాయ ఆలోచనకు మార్గం వేయకతప్పదు. సందర్భాన్నీ, మారిన పరిస్థితులను బేరీజు వేసుకుని మాత్రమే ముందుకు సాగాల్సి ఉంటుంది. తుపాకులు పట్టి పాలకవర్గాలను ఎదుర్కునే సందర్భానికి ప్రజానీకం సంసిద్ధంగా ఉందా, లేదా అనేదే నేటి ప్రశ్న. దీనికి సమాధానం వెతకాల్సిందే.

-కె. నిశాంత్

చర్చలో పాల్గనదలిచినవారు తమ వ్యాసాలను telugunews@oneindia.co.in అనే మెయిల్ అడ్రస్‌కు పంపించగలరు)

English summary
K Nishanth expresses his opinion on the revolutionary movement in the context of Gaddar's statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X