హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'పది'లంపై డౌట్స్: హైదరాబాద్‌పై ఢిల్లీ పర్యవేక్షణ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Hyderabad dilemma before Congress
హైదరాబాద్ పాలనా పగ్గాలు తెలంగాణ ప్రాంతానికే ఉంటాయని చెబుతున్నప్పటికీ, లక్షలాది మంది సీమాంధ్రులున్న నగరంలో వారికి భరోసా కల్పించాలంటే ఏదో ఒక విధమైన చట్టబద్ధ భద్రత కల్పించడం తప్పనిసరి అవుతుందని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని సీమాంధ్రులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే తెలంగాణ ప్రజల్లో తెలంగాణ వచ్చిందని సంతృప్తి ఉండదు.

ఈ నేపథ్యంలో నేరుగా కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా గవర్నర్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే మండలి నగర పాలనా వ్యవహారాల్ని చూసేలా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలాంటి సూచనలు లేవు. అయితే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటును ప్రస్తావిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.

హైదరాబాదు విషయమై నిపుణుల సూచనల మేరకు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. రాజ్యాంగంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర హోదా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల గురించి స్పష్టమైన ప్రస్తావన ఉన్నా ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావన లేదని చెబుతున్నారట. దీంతో ఎలా చెబుతున్నా పరిపాలనాపరంగా హైదరాబాదు పదేళ్లపాటు గవర్నర్ పాలనలో ఉండే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితే కేంద్రం మొత్తం వ్యవహారాలు పరిశీలిస్తుందంటున్నారు. దీని కోసం ఒక 'అడ్మినిస్ట్రేటర్'ను నియమిస్తుంది. ఆయన హోదా లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాల గవర్నర్‌లతోపాటు ఒక లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఏదో ఒక గవర్నర్‌కే లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించవచ్చునని అంటున్నారు.

అయితే, విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధాని అయినప్పటికీ దాని పరిపాలనాపరమైన అధికారాలు తెలంగాణ ప్రభుత్వానికే ఉంటాయని మరికొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు. చండీగఢ్‌ను దీంతో పోల్చడానికి వీల్లేదంటున్నారు. శాసన సభ, సచివాలయం, హైకోర్టు ఇతర కార్యాలయాలను రెండు ప్రభుత్వాలు పంచుకోవడం మినహా బయట ఇతరత్రా అధికారాలేవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అవకాశం లేదట.

చండీగఢ్

1948 మార్చిలో పంజాబ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కొత్త రాజధాని నిర్మాణం కోసం భూమిని కేటాయించింది. ఈ భూభాగం అంతా అంబాలా జిల్లాలో ఉంది. ఈ చండీగఢ్ కోసం 1952లో శంకుస్థాపన జరిగింది. అనంతర పరిణామాల్లో 1966 నవంబర్ 1న రాష్ట్రం పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లుగా విడిపోయినప్పుడు ఇది రెండు రాష్ట్రాల రాజధానిగా నిలిచింది.

అదే సమయంలో దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడున్న అసెంబ్లీ భవనం, హైకోర్టును రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఉపయోగించుకుంటున్నాయి. హైకోర్టు పంజాబ్, హర్యానా హైకోర్టు పేరుతోనే నడుస్తోంది. నగరానికి పంజాబ్ గవర్నర్ పరిపాలనాధికారిగా వ్యవహరిస్తున్నారు.

పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రాన్ని విభజించినప్పుడు చండీగఢ్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని 1966లో తీర్మానించారు. పదేళ్ల తర్వాత చండీగఢ్ పంజాబ్‌కు దక్కాలని, హర్యానా కొత్త రాజధాని నిర్మించుకోవాలని ఒప్పందం కుదిరింది. దాదాపు ఐదు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా, కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగుతోంది.

English summary

 Even though the Congress leadership was taken final decision on Telangana. now, Hyderabad dilemma before High Command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X