బ్యాంకుల ముందే చెత్త కుప్పలు .. ఏపీలో కొత్త నిరసన .. రీజన్ ఇదే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని నిరసిస్తూ లబ్ధిదారులు వినూత్నరీతిలో నిరసనకు దిగారు. రుణాల మంజూరుపై బ్యాంకర్లతో ఎన్నిసార్లు మాట్లాడినప్పటికీ రుణాలు ఇవ్వకపోగా కనీసం సరిగ్గా సమాధానాలు కూడా ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు బ్యాంకుల ముందు చెత్త పోసి తమ నిరసనను తెలియజేశారు.

ప్రచారాల కోసమేనా చట్టాలు .. ఆడబిడ్డల రక్షణపై జగన్ సమాధానం చెప్పాలి : పవన్ కళ్యాణ్ డిమాండ్

రుణాలు ఇవ్వని బ్యాంకుల ముందు చెత్త పోసి నిరసన
కృష్ణాజిల్లా మచిలీపట్నం ,ఉయ్యూరులో యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ల ముందు నగర పారిశుద్ధ్య కార్మికులు తమకు రుణాలు ఇవ్వకపోవడంతో బ్యాంకుల ముందు చెత్త పోసి తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జగనన్న తోడు, వైయస్సార్ చేయూత వంటి పథకాలకు రుణాలు ఇవ్వడం లేదని, బ్యాంకులకు వెళ్లి రుణాలు ఇవ్వాలని అడిగితే అవహేళనగా మాట్లాడుతున్నారన్న కారణాలతో వారి బ్యాంకు ముందు చెత్త పోసి నిరసన తెలియజేశారు.

బ్యాంకుల ముందు చెత్త పోయటంపై కలెక్టర్ సీరియస్ .. చెత్త తొలగించాలని ఆదేశం
జిల్లావ్యాప్తంగా ఇలాగే బ్యాంకుల ముందు చెత్త పోసి రుణాలు ఇవ్వని బ్యాంకర్ల తీరును అందరికీ అర్థమయ్యేలా చేశారు. అయితే ఈరోజు ఉదయం బ్యాంకుకు విధుల నిమిత్తం వచ్చిన సిబ్బంది బ్యాంకు గుమ్మం ముందు చెత్తకుప్పలు దర్శనమివ్వడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎలాగోలా బ్యాంకులోకి వెళ్లి తమ విధులను నిర్వహిస్తున్నారు. బ్యాంకుల ముందు చెత్త పారబోసిన ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. లోన్లు ఇవ్వకుంటే బ్యాంకుల ముందు చెత్త పోస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెత్తను తొలగించాలని ఆదేశించారు.

ప్రభుత్వ పథకాలకు లోన్లు ఇవ్వకపోవటం ఈ నిరసనకు కారణం
దీంతో మున్సిపల్ కార్మికులు చెత్తను తొలగించారు . ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ ప్రకాష్ పలుమార్లు బ్యాంకు మేనేజర్ ల తో మాట్లాడిన లోన్లు ఇవ్వకపోవడంతో నే ఆగ్రహంతో ఈ పని చేసినట్లుగా లబ్ధిదారులు చెబుతున్నారు. బ్యాంకుల ముందు చెత్త పారబోసిన ఘటనపై బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది . ఉయ్యూరులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు చెత్త వేయడాన్ని తీవ్రంగా ఖండించిన బ్యాంకు ఉద్యోగుల సంఘం ఇది అరాచకానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది.

జగన్ ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇవ్వాలని చెప్పినా సరే బేఖాతరు చేస్తున్న బ్యాంకర్లు
స్వయంగా మున్సిపల్ అధికారులే దగ్గరుండి మరీ చెత్త వేయించడం దారుణమని వారు మండిపడుతున్నారు. బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా దాడులు ఎక్కడా జరగలేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో సీఎం జగన్ ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లకు చెప్పినప్పటికీ బ్యాంకులు మాత్రం రుణాల విషయంలో తీవ్ర ఇబ్బంది పెడుతున్నారన్న విషయం తాజా పరిణామాలతో వ్యక్తం అవుతుంది .