ఉద్యోగం పేరుతో వ్యభిచార కూపంలోకి.. యువతిని మోసం, నిర్భందించి.. మద్యం సేవించి..
తిరుపతిలో దారుణం జరిగింది. ఓ యువతిని ఉద్యోగం పేరుతో వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. అయితే ముఠా నుంచి ఎలాగోలా ధైర్యం చేసి యువతి తప్పించుకున్నారు. అయితే ఆమెను ముఠా సభ్యులు నీడలా వెంటాడారు. ఆస్పత్రికి వెళితే అక్కడికీ కూడా వచ్చారు. అయితే సిబ్బంది వారించడంతో వెనుదిరిగారు. విషయం పోలీసులకు తెలియడంతో.. ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. వ్యభిచార కూపం నుంచి బయటపడిన ఆ యువతి హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చారు.

ఉద్యోగం పేరుతో మోసం..
తిరుపతి రూరల్‌కు చెందిన ఓ మహిళకు తెలంగాణకు చెందిన యువతి పరిచయం అయ్యింది. యువతిదీ కరీంనగర్ కాగా.. ప్రస్తుతం ఖమ్మంలో ఉంటోంది. అయితే ఉద్యోగం ఇస్తానని తిరుపతికి చెందిన మహిళ ఆఫర్ చేసింది. ఉపాధి అని చెప్పడంతో యువతి అంగీకరించింది. ఉద్యోగం వచ్చే వరకు తన వద్దే ఉండొచ్చని చెప్పి తిరుపతికి రప్పించింది.

కారు రూ.11 వేలు
ఖమ్మం నుంచి కారులో తిరుపతి వచ్చింది. కిరాయి రూ.11 వేలు చెల్లించి చేరుకున్నది. దారిలో వస్తుండగా కరకంబాడి మార్గంలో ఇద్దరు బాలికలు, ఓ వివాహితను ఆమె వద్దకు తిరుపతికి చెందిన యువతి పంపించింది. అక్కడి నుంచి నేరుగా ఓ ఇంటికి తీసుకెళ్లారు. దీంతో వారి నైజం బయటపడింది. అక్కడ వ్యభిచారం చేయాలని బలవంతం చేశారు. దీంతో ఖంగుతినడంతో కరీంనగర్‌కు చెందిన యువతి వంతయిపోయింది.

దాడి చేసి.. నిర్బంధం...
వ్యభిచారం చేసేందుకు అంగీకరించకపోవడంతో వ్యభిచార ముఠా సభ్యులు దాడి చేశారు. అక్కడే గృహ నిర్బంధం చేశారు. తర్వాత ఆమెతో బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. కానీ బాధితురాలు తప్పించుకుని గాయాలతో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి చేరింది. అయినా వదలని వ్యభిచార ముఠా సభ్యులు అక్కడికి కూడా వచ్చి ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఆస్పత్రికి కూడా వచ్చి..
తెలిసిన అమ్మాయని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బాధితురాలు వాళ్లతో వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో రుయా సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులకి సమాచారం రావడంతో ఆస్పత్రికి చేరుకున్న ఖాకీలు బాధితురాలిని విచారించారు. వ్యభిచార కూపంలోకి నెట్టడానికి యత్నించారని ప్రాథమికంగా తేలింది. ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.