లోన్ యాప్ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. మరో యువకుడి బలి, భార్యకు వేధింపులు..
లోన్ యాప్ నిర్వాహకులు సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇన్‌స్టంట్ లోన్ పేరిట క్షణాల్లో డబ్బులు ఇచ్చే ఈ సంస్థలు వడ్డీ,చక్రవడ్డీ,బారు వడ్డీల పేరుతో సామాన్యులను తీవ్రంగా వేధిస్తున్నారు. ఏదో అప్పటికప్పుడు డబ్బులు వస్తున్నాయని కదా అని ఆశపడితే... అంతకు నాలుగైదింతలు డబ్బులు గుంజుతున్నారు. ఒకవేళ చెల్లించకపోతే కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు కూడా అసభ్య మెసేజులు పంపుతూ కస్టమర్ల ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో యువకుడు లోన్ యాప్ అరాచకానికి బలైపోయాడు. నెల రోజుల వ్యవధిలోనే లోన్ యాప్ అరాచకాలకు తెలంగాణలో ఐదుగురు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం.

తీసుకున్న డబ్బు చెల్లించినా...
మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన చంద్ర మోహన్(36) అనే యువకుడు ఓ సూపర్ మార్కెట్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొద్ది నెలల క్రితం కొన్ని ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ నుంచి రూ.1లక్ష రుణం తీసుకున్నాడు. నిజానికి ఆ డబ్బు మొత్తం వడ్డీతో సహా అతను తిరిగి చెల్లించేశాడు. కానీ ఏవేవో లెక్కలేసి.. అదనంగా మరింత డబ్బు చెల్లించాలంటూ లోన్ యాప్ నిర్వాహకులు అతన్ని వేధించారు. దీంతో చంద్రమోహన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ..
చంద్ర మోహన్‌కు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు ఫోన్ స్విచ్చాఫ్ చేసుకోవాలని చెప్పారు. అయినప్పటికీ లోన్ యాప్ నిర్వాహకులు అతన్ని వదల్లేదు. చంద్రమోహన్ భార్య, బంధువులు, స్నేహితులకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రమోహన్ శనివారం(జనవరి 2) ఉదయం ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని సమాచారం. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన అతని భార్య ఫ్యాన్ సీలింగ్‌కు వేలాడుతున్న తన భర్తను చూసి షాక్‌కి గురైంది.

చనిపోయాడని చెప్పినా ఆగని వేధింపులు
చంద్ర మోహన్ మృతి చెందినా లోన్ యాప్ నిర్వాహకుల అరాచకాలు ఆగకపోవడం గమనార్హం. ఓవైపు ఇంట్లో మృతదేహం ఉండగానే లోన్ యాప్ నిర్వాహకులు డబ్బుల కోసం కుటుంబ సభ్యులకు కాల్స్ చేసి వేధిస్తున్నారు. చంద్ర మోహన్ మొబైల్‌తో పాటు భార్య, బంధువులు, స్నేహితులకు ఫోన్ చేస్తున్నారు. లోన్ తీసుకున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పినా... షూరిటీగా ఉన్నారు కాబట్టి డబ్బులు చెల్లించాలని వారిని కూడా వేధిస్తున్నారు. చంద్ర మోహన్ భార్య సంగీతకు ఆదివారం(జనవరి 3) ఉదయం నుంచి దాదాపు 46 కాల్స్ వచ్చాయి. ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే అసభ్య మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆ టార్చర్ తట్టుకోలేక...
ఈ ఘటనపై షేట్ బషీరాబాద్ ఎస్సై మహేష్ మాట్లాడుతూ...చంద్రమోహన్ దాదాపు 11 లోన్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు చెప్పారు. నిజానికి ఆ డబ్బు మొత్తం వడ్డీతో సహా చెల్లించినప్పటికీ అదనంగా మరింత డబ్బు చెల్లించాలని యాప్ నిర్వాహకులు వేధించినట్లు తెలిపారు. ప్రతీరోజూ అతనికి 8 నుంచి 10 కాల్స్ వచ్చేవని... అతని స్నేహితులు,కుటుంబ సభ్యులకు కూడా అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. గత డిసెంబర్‌లో నర్సాపూర్‌కి చెందిన ఎద్దు శ్రవణ్ యాదవ్,సిద్దిపేటకు చెందిన కిర్ని మౌనిక,రాజేంద్ర నగర్‌కు చెందిన పి.సునీల్,రామగుండంకు చెందిన సంతోష్ అనే నలుగురు లోన్ యాప్ వేధింపులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. లోన్ యాప్ ఆగడాలకు సంబంధించి ఇప్పటివరకూ తెలంగాణ పోలీసులు ఇప్పటివరకూ 50 కేసులు నమోదు చేసి 29 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు చైనీయులుకూడా ఉన్నారు.