బాంబ్ హై కాదు.. బాంబే.. ఎయిర్పోర్ట్ సిబ్బందిని పరుగులు పెట్టించిన పదం..
ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఒక్క ఫోన్ కాల్ విమానాశ్రయ సిబ్బందిని ఉరుకులు పెట్టించింది. ఫోన్ చేసిన వ్యక్తి పలికిన ఒక్క పదం ఎయిర్‌పోర్ట్‌లో కలకలం సృష్టించింది. ఇంతకీ ఫోన్ చేసిన వ్యక్తి ఏం చెప్పాడు? ఎందుకంత హంగామా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవండి.

బాంబేను బాంబ్ హై గా విన్న సిబ్బంది
జులై 19. సాయంత్రం 4.30గంటల సమయం. ముంబై ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూంలో ఫోన్ మోగింది. ఫోన్ చేసిన యువకుడు ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలేమైనా ఖాళీగా ఉన్నాయని ఆరాతీశాడు. ఇంతలో అతని నోటి నుంచి వచ్చిన ఓ మాట ఒక్కసారిగా ఎయిర్‌పోర్ట్‌లో కలకలం సృష్టించింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానాశ్రయం అంతటా అణువణువూ గాలించారు. ఇంతకీ ఫోన్ చేసిన వ్యక్తి నోట వచ్చిన మాటేంటంటే ముంబై మహా నగరం పాత పేరు బాంబే. మాటల సందర్భంలో ఫోన్ చేసిన యువకుడు బాంబే అనే పదం పలికాడు. అది కాస్తా కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తికి బాంబ్ హై అన్నట్లు వినబడింది. అయితే కాలర్‌ను ఏమన్నారని మరోసారి ప్రశ్నించగా అతను బాంబే అని చెప్పాడు.

విమానాశ్రయంలో గాలింపు
బాంబే అన్న పదం వినిపించడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టంలేని ఎయిర్పోర్ట్ ఎంప్లాయి విషయాన్ని విమానాశ్రయ భద్రతా సిబ్బందికి తెలియజేశాడు.
బాంబ్ ఉందన్న సమాచారం అందడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టులో అణువణువూ జల్లెడపట్టారు. దాదాపు రెండు గంటల పాటు గాలించి బాంబు లేదని తెలుసుకుని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా విమానాశ్రయంలో భద్రత పెంచారు.

ఉద్యోగం కోసమే చేశానన్న యువకుడు
ఫోన్ చేసిన వ్యక్తి గురించి వివరాలు సేకరించిన అధికారులు సదరు యువకుడిని దులేకి చెందిన హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్‌గా గుర్తించారు. గత నాలుగైదు నెలలుగా ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండటంతో ప్రతి చోట జాబ్ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. ఇందులో భాగంగానే గూగుల్‌లో దొరికిన ఎయిర్పోర్ట్ నెంబర్‌కు కాల్ చేసి ఉద్యోగం గురించి ఆరా తీసినని అన్నాడు. అంతేతప్ప దాని వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని చెప్పారు. తనకు తెలియకుండానే జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పాడు.