• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిరంజీవి ఇలా ఎందుకయ్యారు?

By Pratap
|
Google Oneindia TeluguNews
Chiranjeevi
స్వర్గీయ ఎన్టీ రామారావు రికార్డును రాజకీయాల్లో బద్దలు కొట్టడానికి బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ఇలా అయ్యారనేది ప్రస్తుతం మొలకెత్తుతున్న ప్రశ్న. ప్రజారాజ్యం పార్టీతో రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంటారని చిరంజీవి సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు అంచనాలు వేశారు. వారిద్దరు అన్నయ్యను ముఖ్యమంత్రి పీఠం మీద చూడాలని చెమటోడ్చారు. చివరికి వారే తప్పుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.

పార్టీ వ్యవహారాల్లో చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ ప్రాబల్యం పెరగడం, క్రమక్రమంగా కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా మారుతూ పోవడం ఒక పద్ధతి ప్రకారమే జరిగిందని భావిస్తున్నారు. అధికారంలోకి రావడానికి తగిన ప్రణాళిక, వ్యూహరచన ఎన్నికల సమయంలోనే ప్రజారాజ్యం పార్టీకి కొరవడింది. కేవలం చిరంజీవి ప్రజాకర్షణ మీద నెట్టుకు రావడం సాధ్యం కాలేదు. ఇక ముందు అలా నెట్టుకువస్తామనే ఆశలు కూడా సన్నగిల్లాయి. దీంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం దిశగా నడిపించింది. సామాజిక న్యాయం ఎజెండాతో ముందుకు వచ్చిన ప్రజారాజ్యం రాజకీయ చదరంగంలో ఓటమి పాలైంది.

రెండున్నరేళ్లు కూడా తిరక్కుండానే చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయింది. సరైన సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోలేక పోవడం వల్ల, నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తుపై భరోసా కల్పించలేక పోవడం వల్ల ఆశలు సన్నగిల్లి పార్టీ నాయకులు ఒక్కరొక్కరే తప్పుకుంటూ వచ్చారు. 2009 ఎన్నికల్లో ఓటమి తర్వాత మరింతగా ప్రజారాజ్యం పార్టీ బలహీనపడుతూ వచ్చింది. క్షేత్రస్థాయిలో పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజలకు భరోసా కల్పించలేక పోయింది. ప్రధాన రాజకీయ పార్టీల్లో అవకాశం దొరకని నాయకులు, ద్వితీయశ్రేణి నేతలు, మాజీలు వెల్లువలా వచ్చిచేరారు. చిరంజీవి ఇమేజ్‌ పార్టీకి మరింత గ్లామర్‌ను తెచ్చింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి సెజ్‌ బాధితుల పోరాటానికి మద్దతుగా పర్యటించటం, సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాల్ని పరామర్శించటం, మెరుగైన గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన వరంగల్‌ జిల్లాలోని గ్రామాన్ని సందర్శించటం వంటి సరికొత్త రాజకీయంతో ప్రజల్లో కొంత ఆశలు రేకెత్తించారు. ప్రజా అంకితయాత్ర పేరుతో రాష్ట్రమంతటా పర్యటించారు. చిరంజీవికి అనూహ్యమైన స్పందన వచ్చింది కానీ అది ఓట్ల రూపంలోకి మారలేదు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు తమ ప్రజారాజ్యం పార్టీ ప్రత్యామ్నాయమనే నమ్మకాన్ని ప్రజలకు చిరంజీవి కల్పించలేకపోయారు.

మహాజన పార్టీ, నవతెలంగాణా పార్టీల్ని విలీనం చేసుకుని, మనపార్టీతో పొత్తుపెట్టుకున్నా కనీస ప్రయోజనం కలగలేదు. పార్టీపై భ్రమలు పోవటంతో ఒక్కొక్కరుగా నాయకులు నిష్క్రమించ సాగారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ప్రరాపా కలసి పని చేయాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టింది. ఒంటరిగా పోటీచేసిన ప్రజారాజ్యంఒకేఒక్క స్థానానికి పరిమితమైంది. అయినా ఓటమి తర్వాత కూడా పార్టీలో చర్చ జరగలేదు. పార్టీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించాలనుకున్న ప్లీనరీ నిరుడు జరిపారు. ఆ సమయంలో పార్టీ రాష్ట్ర కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీల్ని పునర్‌ వ్యవస్థకరించే అధికారాన్ని చిరంజీవికి కట్టబెట్టగా ఆ పని చేయలేక పోయారు.

గత కొంతకాలంగా వివిధ సమస్యలపై ధర్నాలు, జిల్లాల పర్యటనలకు వెళ్లినా ప్రజలపై బలమైనముద్ర వేసేంత స్థాయిలో లేకపోయాయి. అయినా పర్యటనలో ఆయనకు జనాకర్షణ మాత్రం తగ్గలేదు. అయితే ప్రధాన పార్టీల అగ్రనేతలకు ధీటుగా విమర్శలు, ప్రతివిమర్శలు చేయటం, రాజకీయంగా వ్యూహ ప్రతివ్యూహాలు పన్నటం, ప్రజల్ని ఆకట్టుకునేలా ప్రసంగించటం వంటి అంశాల్లో తనకున్న బలహీనతలను ఆయన అధిగమించలేక పోయారు.

చివరికి సమైక్యాంధ్ర నినాదం అందుకోవటంతో తెలంగాణలో అసలు ఉనికే ప్రశ్నార్థకమైంది. తెలంగాణలోని ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. అదే సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్‌వర్గంతో చేరిపోయారు. సీమాంధ్ర ప్రాంతంలో పార్టీని దీటుగా నిలిపే క్రమంలో కాంగ్రెస్‌కి జనాకర్షణ ఉన్న నేత అవసరం అయ్యారు. ఇదే సమయంలో ఇటు పార్టీని ముందుకు తీసుకెళ్లటంలో సమస్యలు ఎదుర్కుంటున్న చిరంజీవి అందివచ్చిన అవకాశంతో కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X