హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్‌కి జెడ్పీటీసీ షాక్!!

By Staff
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు నాలుగు నెలల ముందు జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీని తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. ఏడు జడ్పీటీసీలకు ఉప ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌తో సమానంగా తెలుగుదేశం మూడు స్థానాలను గెలుచుకుంది. ఆళ్లగడ్డలో ప్రజారాజ్యం నేత భూమా నాగిరెడ్డి నిలబెట్టిన స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇద్దరు మంత్రుల నియోజకవర్గాల కేంద్రాలతో పాటు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ సొంత జిల్లాలోను కాంగ్రెస్‌ను తెదేపా ఓడించింది.

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ జడ్పీటీసీని కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం గెలుచుకోవడం ఆసక్తికర పరిణామం. మాక్లూర్‌ ప్రస్తుతం డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2008 ఏప్రిల్‌లో డిచ్‌పల్లి ఉప ఎన్నికలో మాక్లూర్‌ జడ్పీటీసీ పరిధిలో కాంగ్రెస్‌కు నాలుగువేలకుపైగా ఓట్ల ఆధిక్యం లభించింది.

కర్నూలు జిల్లాలో మంత్రి మారెప్ప నియోజకవర్గం పరిధిలోని ఆలూరు జడ్పీటీసీని కాంగ్రెస్‌ కోల్పోయింది. బీసీ వర్గాలు అత్యధిక శాతం ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపును తెదేపా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. తన వ్యాఖ్యల ద్వారా కలకలం రేపుతున్న మారెప్పకు ఇది గట్టి దెబ్బే. ఇక్కడ తెదేపా అభ్యర్థి మేకల భాస్కర్‌కు 10,789 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి లోక్‌నాథ్‌కు 9320 ఓట్లు వచ్చాయి.

ఆళ్లగడ్డ జడ్పీటీసీ ఎన్నికలో భూమా నాగిరెడ్డి తన ప్రాబల్యం చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో పోటీచేయరాదని ప్రరాపా నిర్ణయించుకున్నా ఇక్కడ మాత్రం తన పట్టు చాటుకునేందుకు ఆయన అభ్యర్థిని నిలిపారు. ఆయన మద్దతుతో స్వతంత్రుడిగా పోటీచేసిన మాదం రవికి 18,275 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 13,070 ఓట్లు రాగా.. తెదేపా 4635 ఓట్లతో మూడోస్థానానికి పడిపోయింది.

పశ్చిమగోదావరి జిల్లాలో మూడు జడ్పీటీసీలకుగాను రెండింటిని కాంగ్రెస్‌ గెల్చుకుంది. అయితే ఇక్కడా కాంగ్రెస్‌కు ఇబ్బంది తప్పలేదు. మంత్రి మాగంటి బాబు నియోజకవర్గం దెందులూరు జడ్పీటీసీని కాంగ్రెస్‌ నుంచి తెదేపా కైవసం చేసుకుంది. దెందులూరులో తెదేపా అభ్యర్థిని సుశీలకు 19,096 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థినిగా మంత్రి స్వయంగా నిలిపిన కమ్ముల రంగమ్మకు 14,620 ఓట్లు వచ్చాయి. పశ్చిమలో పెరవలి, ఆచంట జడ్పీటీసీలను కాంగ్రెస్‌ గెలుచుకున్నా ఇక్కడ తెదేపా గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో పెరవలిని తెదేపా గెలుచుకుంటుందని భావించినా చివరకు కాంగ్రెస్‌ అభ్యర్థి దాసరి విజయభాస్కరరావు తెదేపాకు చెందిన మధులతపై 928 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆచంటలో కాంగ్రెస్‌ అభ్యర్థి ముప్పాళ్ల వెంకటేశ్వరరావు తెదేపా అభ్యర్థి బొర్రా కృష్ణారావుపై 2600 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి జడ్పీటీసీని కాంగ్రెస్‌ భారీ మెజారిటీతో గెలుచుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి తూము వెంకటాచలానికి 20,545 ఓట్లు రాగా.. తెదేపా అభ్యర్థి గాడి వెంకటరంగారావుకు428 ఓట్లు మాత్రమే వచ్చాయి. పైకి ప్రకటించకున్నా ప్రజారాజ్యం శ్రేణులు మద్దతివ్వడం వల్లే కాంగ్రెస్‌కు ఇంత ఆధిక్యం లభించిందని భావిస్తున్నారు.

ఏడు జడ్పీటీసీలకు గాను నాలుగు కోల్పోగా.. వాటిలో మంత్రులు మాగంటి బాబు, మూలింటి మారెప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరు, ఆలూరు ఉన్నాయి. ఇక ఉప ఎన్నికలో విజయం సాధించిన డిచ్‌పల్లి నియోజకవర్గం పరిధిలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆకుల లలిత ప్రాతినిధ్యం వహించిన మాక్లూర్‌ జడ్పీటీసీ స్థానంలో పార్టీ పరాజయం పాలయింది.

ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేయలేదు (ఆళ్లగడ్డలో మాత్రం ప్రరాప తరపున స్వతంత్ర అభ్యర్థిని పోటీపెట్టారు). తెలుగుదేశం, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ సాగింది. అంతా ఏకపక్షంగా సాగుతుందనుకున్న వైఎస్‌ కలలు కల్లలయ్యాయి. దెందులూరు, ఆలూరులతో పాటు పీసీసీ అధ్యక్షుడు సొంత జిల్లాలోని మాక్లూర్‌ జడ్పీటీసీనీ కోల్పోవడం కాంగ్రెస్‌ కు ఆశాభంగం కలిగించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X