హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరకాల విషం కక్కారు: అల్లు అరవింద్

By Staff
|
Google Oneindia TeluguNews

Allu Aravind
హైదరాబాద్: ప్రజారాజ్యం విషవృక్షం కాదని, పరకాల ప్రభాకర్ మాటలే విషపూరితమని ప్రజారాజ్యం నాయకుడు అల్లు అరవింద్ అన్నారు. పరకాల ప్రభాకర్ ఓడిపోతాడని తమ సర్వేలో తేలిందని, అందుకే ప్రభాకర్ కు నర్సాపురం టికెట్‌ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. పరకాల ప్రభాకర్ కు నైతిక విలువలు లేవని, పరకాల మాటలు ప్రజలు నమ్మే స్థితి లేదని ఆయన అన్నారు. బాధ్యత తీసుకున్నందుకే పార్టీలో తనపై ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం రాత్రి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

వాస్తవానికి పరకాల మానసికంగా పార్టీ నుంచి ఆయన ఎప్పుడో వెళ్లిపోయారని, చిన్న అతుకు ఉండిపోయిందని, అదే నర్సాపురం టికెట్ అని, అది రాకపోవడంతో ప్రణాళిక రచించి ఆరోపణలు చేస్తూ పార్టీ నుంచి వెళ్లిపోయారని ఆయన అన్నారు.పార్టీ వేదిక మీది నుంచి మాట్లాడడానికి పరకాలకు ఎంత ధైర్యం అని ఆయన ప్రశ్నించారు. స్వార్థంతో పార్టీలోకి వచ్చిన పరకాల విషం కక్కారని ఆయన విమర్శించారు.ఇలాంటి ఆరోపణలన్నీ వస్తాయని ఏడాదిపాటు ఆలోచించే పార్టీ పెట్టామని, ఎన్నింటినైనా భరిస్తామని, చనిపోయే వరకు సామాజిక న్యాయం కోసం పోరాడతామని ఆయన అన్నారు.

"25 ఏళ్లుగా చిరంజీవిపై ఈగ వాలనివ్వని స్థానంలో తాను ఉన్నానని, అందుకే తనపై ఆరోపణలు వస్తున్నాయని, బాధ్యతలు తీసుకున్న వారిపైనే సహజంగా ఆరోపణలు వస్తుంటాయని, ఇంతకు పది రెట్లు ఆరోపణలు వచ్చినా చలించబోనని, చిరంజీవి స్వయంగా ఏదైనా అంటే తప్ప ఏ ఆరోపణల్నీ లెక్కచేయనని ఆయన అన్నారు.

ఆంజనేయరెడ్డి మినహా పార్టీని వీడేవారంతా ప్రయోజనం ఆశించే వచ్చారన్నారు. ఈ సందర్భంగా పరకాల కోవర్టా అని ప్రశ్నించగా.. పది పదిహేను రోజుల్లో ఆయన ఎక్కడ ల్యాండ్‌ అవుతాడన్న విషయాన్ని చూసిన తర్వాత చెబుతానన్నారు. కోవర్టు కానంత మాత్రాన మంచివాడు మాత్రం కాదన్నారు.

ఆయనెందుకు భుజాలు తడుముకుంటున్నారు: పరకాల అల్లు అరవింద్‌ను గానీ, వేరొకరినిగానీ పేరుపెట్టి తాను ఏమీ అనలేదని, ఆయన ఎందుకంత కంగారు పడుతున్నారో, ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని పరకాల ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. పీఆర్పీకి రాజీనామా సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందించిన అల్లు అరవింద్‌ వ్యాఖ్యలపై పరకాల ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. పార్టీలోకి రండి, రండి అంటేనే తాను వెళ్లానన్నారు.

నర్సాపురంలో తాము చేసిన సర్వేలో పరకాలకు అనుకూలంగా లేదనే టికెట్‌ ఇవ్వలేదని అరవింద్‌ అనడంపై ఆయన మాట్లాడుతూ "అసలు ఆయనను సర్వే ఎవరు చేయమన్నారు? నేనేమైనా టికెట్‌ కోరానా? ఏ సర్వే చెబితే ఆయనకు అనకాపల్లి టికెట్‌ ఇచ్చారు? ఏ కమిటీ నిర్ణయించింది" అని ప్రశ్నించారు. తన చరిత్ర బయటపెట్టాలనుకుంటే పెట్టవచ్చని, అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియకుండా ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. కుట్రపూరితంగా అలా చేశాడు, ఇలా చేశాడు అని తనను అనడం మానసిక వ్యాధిని సూచిస్తుందన్నారు.

"హరిరామజోగయ్య పార్టీలోకి నన్ను తీసుకొచ్చాడా..? ఎవరాయన? బుద్ధి ఉండాలి" అని ధ్వజమెత్తారు. పార్టీలో తాను ఎవరికీ టికెట్‌ ఇప్పిస్తానని చెప్పలేదని, వారు చెప్పమంటేనే కొందరికి పని చేసుకోవాలని చెప్పానని వివరణ ఇచ్చారు. విషవృక్షాన్ని ఇంకా పెంచడానికి నీరుగా ఉపయోగపడకూడదనే పార్టీ నుంచి బయటికి వచ్చానని పునరుద్ఘాటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X