హైదరాబాద్: రాష్ట్రంలో రెండు వేర్వేరు ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. పుల్లలచెరువు మండలంలో కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురు పడ్డారని, ఈ సందర్భంగా మావోయిస్టులు కాల్పులు జరిపారని, తాము ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు అంటున్నారు. ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించాడు. మరణించిన మావోయిస్టును జాన్ బాబూరావుగా అనుమానిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. సంఘటనా స్థలంలో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
కాగా, వరంగల్ జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం లింగాల అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.ఇందులో ఒక నక్సలైట్ మరణించాడు. మరణించిన నక్సలైట్ ను ప్రజా ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి మోహన్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఎకే 47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు.